‘ఓఆర్‌ఓపీ’కి కట్టుబడి ఉన్నాం

Congress will fulfill OROP demands, says Rahul Gandhi - Sakshi

న్యూఢిల్లీ: ఒకే ర్యాంకు–ఒకే పెన్షన్‌ (ఓఆర్‌ఓపీ) అమలుకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. శనివారం కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో మాజీ సైనికులతో రాహుల్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సైనికుల సంక్షేమం, ఓఆర్‌ఓపీ అమలు తదితర అంశాలపై వారితో చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఓఆర్‌ఓపీ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 2019లో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారం చేపడితే ఓఆర్‌ఓపీతో సహా సైనికుల డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

రఫేల్‌ వ్యవహారంలో అనిల్‌ అంబానీకి రూ.30 వేల కోట్లు కేటాయించిన మోదీ సర్కార్‌కు సైనికుల డిమాండ్ల పరిష్కారానికి మాత్రం చేతులు రావటం లేదని విమర్శించారు. జమ్మూకశ్మీర్‌ విషయంలో కేంద్రం తీరు సరిగా లేదని, దీని వల్ల సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రాహుల్‌ విమర్శలకు అధికార బీజేపీ దీటుగా సమాధానం ఇచ్చింది. అధికారంలో ఉండగా ఎన్నడూ సైనికుల సంక్షేమంపై మాట్లాడని రాహుల్‌ ఇప్పుడు తమను విమర్శించటం సిగ్గుచేటని బీజేపీ రాజ్యసభ సభ్యుడు అనిల్‌ బరూనీ విమర్శించారు. అధికారం కోల్పోయి నాలుగున్నరేళ్ల తర్వాత గానీ ఆయనకు సైనికులు గుర్తుకు రాలేదని ఎద్దేవా చేశారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top