రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దే: అద్దంకి | Sakshi
Sakshi News home page

రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దే: అద్దంకి

Published Thu, Apr 4 2019 4:01 PM

Congress Party Leader Addanki Dayakar Slams KCR In Siddipet - Sakshi

సిద్ధిపేట జిల్లా: గడిచిన శాసనసభ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో గెలుపొంది రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ వ్యాఖ్యానించారు. గురువారం సిద్ధిపేట కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో అద్దంకి దయాకర్‌ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సిద్ధిపేట రావడం జరిగిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని రాహుల్‌ గాంధీ అన్న విషయాన్ని గుర్తు చేశారు. పేద కుటుంబాలకు నెలకు రూ.6 వేల చొప్పున ఏడాదికి రూ.72 వేలు ఇస్తామని చెప్పారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు పేదరికం నిర్మూలించడానికి నెలకు రూ.6 వేలు ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోందన్నారు.

ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు పూర్తి చేయాలని కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందని వెల్లడించారు. 16 ఎంపీలతో కేంద్రంలో చక్రం తిప్పుతా అంటున్న కేసీఆర్‌ ఎందుకు ఎంపీగా పోటీ చేయలేదని ప్రశ్నించారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్‌ రూ.100 కోట్లకు ఒక్కో టిక్కెట్‌ అమ్ముకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వివేక్‌,  మొదలుకొని మొన్నటి గుత్తా సుఖేందర్‌ రెడ్డి వరకు ఎవ్వరికీ టికెట్‌ ఇవ్వలేదని గుర్తు చేశారు.  తల్లిని బిడ్డను వేరు చేసి కేసీఆర్‌ పాలన చేస్తున్నారని తీవ్రంగా  విమర్శించారు. హరీష్‌ రావు టీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వెళ్తే 30 మంది ఎమ్మెల్యేలు పోతారని, అందుకే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని  విమర్శించారు. ప్రతిపక్షాలు బతకాలని ప్రజలు కోరుకుంటుంటే టీఆర్‌ఎస్‌ మాత్రం ప్రతిపక్షాలను చంపాలని చూస్తోందని అన్నారు.

ఆ పథకం సంజీవని లాంటిది: ఇంద్ర శోభ

పేద ప్రజలకు నెలకు రూ.6 వేలు ఇస్తామని కాంగ్రెస్‌ తెచ్చిన పథకం ప్రజలకు సంజీవని లాంటిదని కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ఇంద్ర శోభ వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే నల్లధనం తెస్తానని దేశప్రజలను మోసం చేసిన వ్యక్తి నరేంద్ర మోదీ అని తూర్పార బట్టారు. కేసీఆర్‌ 16 ఎంపీలు గెలవకున్నా కూడా ఆయన సీఎం పదవి ఎక్కడికీ పోదన్నారు. మెదక్‌ జిల్లా రైతుల ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement