కలెక్టరేట్ల ముట్టడి.. ఆందోళనలు

Congress party called for concerns on TRS and BJP Policies - Sakshi

టీఆర్‌ఎస్, బీజేపీ తీరుపై నిరసనలకు సిద్ధమైన టీపీసీసీ  

నవంబర్‌ 8న కలెక్టరేట్ల ముట్టడి 

11న గాందీభవన్‌ నుంచి హైదరాబాద్‌ కలెక్టరేట్‌ వరకు పాదయాత్ర

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగం, కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తోన్న ఆర్థిక తిరోగమన విధానాలకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ రెండు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా పేదలు కష్టాలు పడాల్సి వస్తోందని, దీనికి నిరసనగా నవంబర్‌ 8న అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించాలని పార్టీ శ్రేణులను కోరింది. ఈ మేరకు మంగళవారం గాందీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కోర్‌కమిటీ సమావేశంలో నిర్ణయించారు. నవంబర్‌ 11న గాందీభవన్‌ నుంచి పాదయాత్రగా వెళ్లి హైదరాబాద్‌ కలెక్టరేట్‌ను ముట్టడించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. కోర్‌ కమిటీలో తాజా రాజకీయ పరిణామాలు, ఆర్టీసీ సమ్మె, మున్సిపల్‌ ఎన్నికలపై చర్చించారు.
 
ఆ బాధ్యత నాదే.. 
హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని ఉత్తమ్‌ తెలిపారు. టీఆర్‌ఎస్‌ పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసి ప్రలోభాలకు గురిచేసినప్పటికీ పార్టీకి 70 వేల ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. అయినా ఓటమిని సమీక్షించుకుని ముందుకెళ్దామని చెప్పారు. త్వరలోనే జరుగుతాయని భావిస్తున్న మున్సిపల్‌ ఎన్నికలపై ఇప్పటికే పార్టీ ఆధ్వర్యంలో కసరత్తు ప్రారంభమైందని, ఈ కసరత్తును ముమ్మరం చేయాలని కోర్‌కమిటీ పార్టీ కేడర్‌ను కోరింది. ఈ మేరకు డీసీసీ అధ్యక్షులు, స్థానిక పట్టణ కమిటీలు అన్ని విధాలా ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని సూచించింది. దీంతో పాటు రాజకీయ పార్టీల కార్యాలయాలకు భూకేటాయిం పుల్లో భాగంగా జిల్లాల్లో తమ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి కూడా స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాలని సమావేశంలో నిర్ణయించారు.

ఈ మేరకు డీసీసీ అధ్యక్షులు, కలెక్టర్లతో సమన్వయం చేసుకునే బాధ్యతను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌కు అప్పగించారు. గతంలో పార్టీ రాష్ట్ర కార్యాలయం కోసం కేటాయించిన హౌసింగ్‌ బోర్డు స్థలం విషయంలో న్యాయపరమైన అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ఆ స్థలం నుం చి పార్టీ పరంగా వైదొలగాలని, పార్టీ రాష్ట్ర కార్యాలయం కోసం హైదరాబాద్‌లో తమకు స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాలని కోర్‌ కమిటీ నిర్ణయించింది. ఇక ఆర్టీసీ కారి్మకులకు అండగా నేడు జరగనున్న సకల జనుల సభకు మద్దతివ్వడంతో పాటు పార్టీ నేతలు పాల్గొనాలని కోర్‌ కమిటీ నిర్ణయించింది. కోర్‌ కమిటీ సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు ఎ.రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసకృష్ణన్, సలీం అహ్మద్, సంపత్‌కుమార్, చిన్నారెడ్డి, షబ్బీర్‌ అలీ, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top