ఎన్నికలు ఓ ఫార్సు

Chandrababu Naidu is deeply embarrassed About AP Elections - Sakshi

సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం

నేను వేసిన ఓటు మా పార్టీకే పడిందో లేదో నాకే తెలియలేదు 

ప్రజాస్వామ్యం భవిష్యత్తును ఒక యంత్రం మీద వదిలిపెట్టారు  

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను ట్యాంపరింగ్‌ చేశారు  

ఈవీఎంలలో చిప్‌లను మార్చేశారు  

ఇంతలా బాధ్యతలేని ఈసీని ఎప్పుడూ చూడలేదు  

ఎన్నికల సంఘాన్ని బీజేపీ బ్రాంచ్‌ ఆఫీసులా మార్చేశారు  

ఈ వ్యవహారాన్ని ఇక్కడితోనే విడిచిపెట్టను  

మంత్రులు, ఎంపీలతో కలిసి నేడు ఢిల్లీకి వెళ్తా...  

ఎన్నికల సంఘాన్ని కలుస్తా.. అవసరమైతే ధర్నా చేస్తా  

ఈవీంఎలపై న్యాయస్థానంలో పోరాటం కొనసాగిస్తాం   

టీడీపీని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు  

తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే బస్సులను ఆపేశారు   

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కోవర్టును నియమించారు  

డీజీపీ కార్యాలయానికి సీఎస్‌ వెళ్లడమేంటి?  

జగన్‌మోహన్‌రెడ్డి లోటస్‌పాండ్‌ నుంచి పాలిస్తారా?   

మోదీ చెప్పడం వల్లే ఏపీలో మొదటి విడతలో ఎన్నికలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఓ ఫార్సు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేల్చేశారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల ట్యాంపరింగ్‌ చేశారని, అందులోని చిప్‌లను మార్చేశారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) స్థానంలో అనిల్‌చంద్ర పునేఠాను మార్చి ఒక కోవర్టును నియమించారని మండిపడ్డారు. జగన్‌మోహన్‌రెడ్డి కేసుల్లో సహ నిందితుడైన వ్యక్తిని సీఎస్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం ఉండవల్లిలోని ప్రజావేదికలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలింగ్‌ రోజు సీఎస్‌.. డీజీపీ కార్యాలయానికి వెళ్లడం ఏమిటని ఆక్షేపించారు. ఇలా ఎప్పుడైనా జరిగిందా? అని నిలదీశారు. సీఎస్‌ తనకు నచ్చని పనులు ఎలా చేస్తారని అన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం(ఈసీ) పూర్తిగా విఫలమైందని, తన జీవితంలో ఇంత పనికిమాలిన ఎన్నికల సంఘాన్ని చూడలేదని విమర్శించారు. చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారంటే...  

‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఎవరి ఊహకూ అందనంత సైలెంట్‌ వేవ్‌ ఉంది. అది జగన్‌మోహన్‌రెడ్డి కోసం ఉంటుందా? సాధారణంగా పోలింగ్‌ మొదట్లో మందకొడిగా సాగి, ఆ తర్వాత పుంజుకుంటుంది కానీ, ఈసారి దీనికి భిన్నంగా ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు(ఈవీఎంలు) పనిచేయకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. 31 శాతం ఈవీఎంలు పనిచేయలేదు. ఈవీఎంలను సరిచేసిన తర్వాత హింసను ప్రేరేపించారు. ఈవీఎంలు రిపేర్‌ చేస్తామని వచ్చిన వాళ్లు రిపేర్లు చేశారా? లేక ట్యాంపరింగ్‌ చేశారా? ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలమైనా జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు జరిగింది ఎన్నిక కాదు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం. నరేంద్ర మోదీ, జగన్, కేసీఆర్‌ వంటి వారితో పోరాడాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని చాలాచోట్ల దాడులకు పాల్పడ్డారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇవన్నీ జరిగాయి. తెలంగాణ నుంచి వచ్చే ఏపీకి బస్సులను ఆపేశారు.  

పోలింగ్‌లో కుట్ర చేశారు 
ఓటు వేసేందుకు ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చారు. పూణే నుంచి వచ్చి ఓటు కోసం పోలింగ్‌ కేంద్రాల్లో గొడవపడుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే నుంచి ఓటు వేసేందుకు వస్తే, వారిని అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. పోలింగ్‌లో కుట్ర చేశారు. ఉదయం ఓటేద్దామని పోలింగ్‌ కేంద్రాలకు వెళితే ఈవీఎంలు పనిచేయలేదు. అందరితో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్నాను. ఒక పథకం ప్రకారమే ఇదంతా చేశారు. ఎన్నికల సంఘానికి మేము ముందే చెప్పినా వినకుండా సీనియర్‌ అధికారులందరినీ మార్చేశారు. కడప జిల్లా ఎస్పీని కూడా మార్చారు. ఎన్నికల సంఘం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ల ప్రధాన ఎన్నికల అధికారియే(సీఈవో) ఓటేయలేక వెనక్కి వచ్చేశారు. ఎన్నికల సంఘం సీఈవోనే ఓటేయలేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఈవీఎంలను మార్చి కొత్తవి పెట్టారు. ప్రజాస్వామ్య భవిష్యత్తును ఒక యంత్రం మీద వదిలి పెట్టారు. కరెంటు లేకపోతే ఈవీఎం పనిచేయలేదు. చాలాచోట్ల మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్‌ ప్రారంభించి సాయంత్రం ఆరు గంటలకే ముగించారు. శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎప్పుడైనా రౌడీయిజం ఉందా? పోలింగ్‌ రోజు అక్కడ గూండాల్ని దింపి అల్లకల్లోలం సృష్టించారు. 

ఎన్నికలను రౌడీలకు అప్పగించారు 
దేశంలో అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేశారు. ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని కూడా బీజేపీ బ్రాంచ్‌ ఆఫీసులా మార్చేశారు. పోలీసులపై దాడులు చేసి, ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఈవీఎంల సమస్య ఏపీలో పెద్ద సమస్యే కాదని ఎన్నికల అధికారి చెబుతున్నారు. ఇంత బాధ్యతారాహిత్యంగా పనిచేసిన ఎన్నికల సంఘాన్ని ఇంతవరకు నేను చూడలేదు. పోలీస్‌ బలగాలు కూడా లేకుండా చేసి రౌడీలకు అప్పజెప్పాలని చూశారు. ఎన్నికల సంఘం వైఫల్యాలపై జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన లోటస్‌పాండ్‌ నుంచే రాష్ట్రాన్ని పరిపాలిస్తారా? వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏం చెబితే ఎన్నికల సంఘం దాన్ని పాటించే పరిస్థితి ఉంది. ప్రతిపక్షానికి ఇన్ని రూ.వేల కోట్ల ఎక్కడి నుంచి వచ్చాయి? ఈవీఎంల ఊతంతో ఎన్నికల తతంగాన్ని ఒక ఫార్సుగా మార్చేశారు. ఎమ్మెల్యే పదవిని మార్కెట్లో సరుకులా మార్చారు. వీవీ ప్యాట్లను లెక్కించాలంటే ఆరు రోజులు పడుతుందని కబుర్లు చెబుతున్నారు. 

ఈవీఎంలపై నమ్మకం ఉంటుందా? 
పోలింగ్‌ రోజు పరిస్థితులను చూశాక దేశంలో ఎవరికైనా ఈవీఎంలపై నమ్మకం ఉంటుందా? నేను వేసిన ఓటు మా పార్టీకే పడిందో లేదో తెలియలేదు. ఈవీఎంలను రిపేర్లు చేస్తున్నారో, ఏమారుస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు. కంప్యూటర్‌ ఆపరేటర్‌ మీద, ప్రోగ్రామర్‌ మీద, చిప్‌ మీద ప్రజాస్వామ్యం ఆధారపడే పరిస్థితి ఉంది. ఈవీఎంలలో చిప్‌లు మార్చేశారు. ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలిపెట్టం. మంత్రులు, ఎంపీలతో కలిసి శనివారం ఢిల్లీకి వెళ్లి, ఎన్నికల సంఘాన్ని కలుస్తా. అవసరమైతే ధర్నా చేస్తా. ఈవీంఎలపై న్యాయస్థానంలో పోరాటం కొనసాగిస్తాం. ఎన్నికల సంఘం సీఈవోనే ఓటేసుకోలేకపోయాడంటే ఇది వాళ్ల చేతకానితనం కాదా? ఏపీలో గత ఎన్నికలను చివరి విడతలో నిర్వహించి, ఈసారి తొలి విడతలో ఎందుకు పెట్టారు? మోదీ చెప్పడం వల్లే మన రాష్ట్రంలో మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించారు. ఎవరితోనూ చర్చించకుండా ఎన్నికలు నిర్వహించడం దారుణం’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. మీడియాతో చాలాసేపు మాట్లాడిన చంద్రబాబు ఎన్నికల ఫలితాలపై మాత్రం స్పందించలేదు. ఎవరు గెలుస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... తామే గెలుస్తున్నామని బదులిచ్చారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top