ప్రజాస్వామ్యానికి అవమానం ఓటర్లకు అపహాస్యం

Chandrababu Naidu Comments On Election Commission Of India - Sakshi

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: గత ఎన్నికల కన్నా ఎక్కువ పోలింగ్‌ శాతం నమోదైంది. మహిళలు బారులు దీరి ఓట్లేశారు. యువ ఓటర్లు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకొని మురిసిపోయారు. ఇంకు మార్కు ఉన్న వేలును చూపుతూ ఫొటోలు దిగారు. తొలిసారిగా వీవీ ప్యాట్లను ఏర్పాటు చేయడంతో ఎవరికి ఓటు వేశామో తెలుసుకున్నామని, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు. వాస్తవం ఇలా ఉండగా చంద్రబాబు ఎన్నికల సంఘంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం సర్వత్రా విమర్శలపాలైంది. ఈసీపై ఆయన అక్కసంతా ఓటర్లపై మళ్లించడంతో ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోంది.

2009 సాధారణ ఎన్నికల్లో జిల్లాలో 74.42 శాతం పోలింగ్‌ నమోదైంది. 2014లో 75.02 శాతం ఓట్లు పడ్డాయి. ఈసారి 76.35 శాతం పోలింగ్‌ నమోదు కావడం వెల్లివిరిసిన ఓటరు చైతన్యానికి ప్రతీక. సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ సమయం ముగిసేసరికి క్యూలో ఉన్నవారందరికీ ఎంత వేళైనా పోలింగ్‌కు అనుమతించడంతో ఇది సాధ్యమైంది. ఈవీఎంలు మొరాయించడం మొదట్లో చికాకు కలిగించినా.. తర్వాత ఎన్నికల సిబ్బంది దిద్దుబాటు చర్యలతో అందరూ సజావుగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. అయితే ఈసీని చిన్నబుచ్చుతూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా తమను విమర్శించడమేనని ఓటర్లు అభిప్రాయపడుతున్నారు.

వీవీ ప్యాట్‌లతో పారదర్శకత
ఈసారి ఎన్నికల్లో వీవీ ప్యాట్‌లను వినియోగించారు. గతంలో కేవలం బ్యాలెట్‌ యూనిట్, కంట్రోల్‌ యూనిట్‌లు మాత్రమే ఉండేవి. అప్పుడు ఓటరు ఏ అభ్యర్థ్ధికి ఓటు వేశారో తెలియని పరిస్థితి ఉంది. ఈవిధానంలోనే గత 2014 ఎన్నికలు జరిగాయి. అప్పుడు చాలామంది వారు వేసిన ఓటుపై పలు సందేహాలు వ్యక్తం చేశారు. అయితే ఈసారి జరిగిన ఎన్నికల్లో  ప్రజల్లో ఓటుపై ఎటువంటి సందేహాలు లేకుండా చేసేందుకు, వారు వేసిన ఓటు వారికి కనిపించే విధంగా, పారదర్శకంగా వివి ప్యాట్‌లను ఎన్నికల కమిషన్‌ తీసుకువచ్చింది. దీంతో వారు వేసిన ఓటు గుర్తు వీవీప్యాట్‌లో కన్పించడంతో ఓటరు సంతృప్తిని వ్యక్తం చేశారు. వృద్ధుల కోసం వీల్‌ చైర్లు వంటి సదుపాయాలు ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తమైంది. గతంలో ఓటు వేయని కొన్ని వర్గాలు ముఖ్యంగా వృద్ధులు, ఉద్యోగులు సైతం ఈసారి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఎన్నికల విధానం ఆధునికీకరణ, పారదర్శకత తేవడంతో ప్రజల్లో ఈవీఎం ఓటింగ్‌ విధానంపై నమ్మకం కలిగింది. 

ఓటమి భయంతోనే టీడీపీ నేతల విమర్శలు
టీడీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకొంది. ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు, ఇంటిలిజెన్స్‌ రిపోర్టు ఇప్పటికే ఓటమిని ఖరారు చేశాయి. దీంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి నుంచి పార్టీ గ్రామ స్థాయి కార్యకర్త వరకు  అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. మేధావులు చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికారులు తప్పులు చేసి ఉంటే దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి వుంటుందని తేల్చిచెప్పారు. 2014లో కూడా ఈవీఎంల ద్వారానే ఎన్నికలు జరిగాయి. అయితే అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వ్యక్తం చేస్తున్నారని అంతా నిలదీస్తున్నారు. అంతేకాదు ఎన్నికలు జరుగుతున్న సమయంలో టీడీపీ నాయకులు వారి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నాయకులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడడం, పోలింగ్‌ అ«ధికారులపై ఒత్తిడి తేవడం, బెదిరింపులకు పాల్పడడం విమర్శలపాలైంది.

రికార్డు స్థాయి పోలింగ్‌
గత ఎన్నికలతో పోల్చితే ఈసారి పోలింగ్‌ ఎక్కువ జరిగింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోస్టల్‌ బ్యాలెట్‌లో ఈసారి ఉద్యోగులు ఎక్కువగా పాల్గొన్నారు. 21 వేలు పోస్టల్‌ బ్యాలెట్లు, మరో 16 వేలు సర్వీసు ఓట్లు జారీ చేశారు. ఇవే 37 వేల వరకూ ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా ఎచ్చెర్లలో 84.30 శాతం, నరసన్నపేటలో 80 శాతం పోలింగ్‌ నమోదైంది. దాదాపు అన్నిచోట్లా మహిళలే ఎక్కువగా ఓటుహక్కు వినియోగించుకున్నారు.

ఈవీఎంలు భద్రం
పోలింగ్‌ ముగిశాక ఈవీఎంలు, కంట్రోల్‌ యూనిట్లు, వీవీప్యాట్లను ఎచ్చెర్లలోని శ్రీశివానీ ఇంజనీరింగ్‌ కళాశాలలో భద్రపరిచారు. జిల్లాలోని పది నియోజక వర్గాల నుంచి మిషన్లను బస్సుల్లో తీసుకువచ్చి ఇక్కడ ఉంచారు. ఎన్నికల ప్రత్యేకాధికారులు, కేంద్ర బలగాల పర్యవేక్షణలో భద్రతకు అన్ని చర్యలు తీసుకున్నారు.  

ఓటమి భయంతోనే..
తాజా ఎన్నికల్లో అద్భుతంగా పోలింగ్‌ జరిగింది. నా అంచనా ప్రకారం ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఓటమి ఖాయమనే సంకేతాలు రావడంతో ఏదో ఒక రాద్ధాంతం చేద్దామని చంద్రబాబు చూస్తున్నాడు. తాను చెప్పిందే వేదం... అన్నట్లుగా నియంతలాగానే వ్యవహరిస్తున్నాడు. ప్రజాసామ్యాన్ని ఖూనీ చేసిన ఆయనే.. ఎప్పుడూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మాట్లాడుతుంటాడు. తాజా ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించినప్పటికీ పోలింగ్‌ ప్రక్రియ సాఫీగా సాగింది. ఎవరు ఎవరికి ఓటేసేరో కూడా ప్రత్యేక మిషన్‌ ద్వారా తెలిసిపోయింది. నేను కూడా ఓటేసి చూసుకున్నాను. తాను గెలిస్తే సక్రమం...ప్రత్యర్ధులు గెలిస్తే అక్రమం అన్న రీతిలో చంద్రబాబు చెబుతున్నాడు. పోలింగ్‌ సరళిపై అనవసర అనుమానాలు రేకెత్తించి, కేంద్ర ప్రభుత్వం ఏదో చేయించిందని చెబుతున్నాడు. గతంలో ఈయన అలాగే గెలిచాడా.... అంటే ఏం చెబుతాడు? – గొండు నరసింగరావు, మాజీ ఎమ్మెల్సీ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top