ఢిల్లీలో చంద్రబాబు తీరు జుగుప్సాకరం.. | Chandrababu Disgusting Mannerism In Delhi Tour, Says YSRCP MPS | Sakshi
Sakshi News home page

చెప్పినట్లుగానే రేపు రాజీనామాలు

Apr 5 2018 5:59 PM | Updated on Jul 28 2018 2:46 PM

Chandrababu Disgusting Mannerism In Delhi Tour, Says YSRCP MPS - Sakshi

ఢిల్లీలో వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీల ప్రెస్‌ మీట్‌

సాక్షి, న్యూఢిల్లీ ప్రత్యేక హోదాపై వైఎస్సార్‌ సీపీ అధ్యక్షడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముందుగా ప్రకటించినట్లే రేపు (శుక్రవారం) రాజీనామాలు  చేస్తున్నట్లు ఆ పార్టీ ఎంపీలు ప్రకటించారు. రాజీనామాల అనంతరం ఏపీ భవన్‌ వేదికగా నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. వైఎస్సార్‌ సీపీ ఎంపీలు గురువారం సాయంత్రం ఢిల్లీలో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి మాట్లాడుతూ...ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు జుగుప్సాకరంగా ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయిని చంద్రబాబు దిగజార్చారని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీతో ఇక పొత్తు పెట్టుకోనని 2003లో చెప్పిన వ్యక్తి...నరేంద్ర మోదీ గ్రాఫ్‌ పెరగగానే మళ్లీ బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చారన్నారు. చంద్రబాబుకు ఎప్పుడూ అధికారమే పరమావధి అని, ఆయన ఎన్ని విన్యాసాలు చేసినా తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. అవిశ్వాసం, రాజీనామాల ప్రకటనతో  ప్రత్యేక హోదా ఉద్యమం ఉధృతమైందన్నారు.

మొదట్నించీ ప్రత్యేక హోదాపై వైఎస్‌ జగన్‌ పోరాటం
‘ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని హోదాకు ప్రత్యామ్నయం లేదని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మొదట్నుంచీ చెబుతున్నారు. హోదా కోసం వైఎస్‌ జగన్‌ ఎన్నో పోరాటలు చేశారు. గుంటూరులో ఆమరణ దీక్ష కూడా చేశారు. ధర్నాలు, దీక్షలు, యువభేరీలు నిర్వహించారు. యువభేరీలకు విద్యార్థులను పంపొద్దని చంద్రబాబు బెదిరించారు. ఒకవేళ పంపితే పీడీ యాక్ట్‌ కింద కేసులు పెడతామని హెచ్చరించారు. ప్యాకేజీనే బెటరంటు చంద్రబాబు హోదాను విస్మరించారు. 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయంటూ గొప్పలు చెప్పారు. తాత్కాలిక భవనాలతోనే కాలం గడుపుతున్నారు. 2016 సెప్టెంబర్‌లో చెప్పిన విషయాన్నే గతనెలలో మళ్లీ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు.ఆ వెంటనే రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందంటూ చంద్రబాబు ఎన్డీయేకు తన మద్దతు ఉపసంహరించుకున్నారు. ప్యాకేజీ కావాలని నేను ఎప్పుడు చెప్పలేదని చంద్రబాబు మాట మార్చారు. ఇప్పుడు ఢిల్లీ వేదికగా డ్రామాలు మొదలుపెట్టారు.

వైఎస్‌ జగన్‌ మాత్రం ఒకేమాట మీద నిలబడ్డారు. హోదా ఇవ్వకపోతే కేంద్రంపై అవిశ్వాసం పెడతామని చెప్పారు. లోక్‌సభ నిరవధిక వాయిదా పడగానే ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామని ప్రకటించారు. వైఎస్‌ జగన్‌ అవిశ్వాసం పెడతామని చెప్పగానే అవిశ్వాసంతో ఏం ఒరుగుతుందని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. మేం మాత్రం అవిశ్వాసంపై నోటీసులు ఇచ్చి అన్ని పార్టీలను కలిసి మద్దతు కోరాం.’ అని ఎంపీ మేకపాటి తెలిపారు.

‘పార్లమెంట్‌ సాక్షిగా ఏపీకి ఐదేళ్లు హోదా ఇస్తామని చెప్పారు. ఐదేళ్లు కాదు...పదేళ్లు కావాలని బీజేపీ నేతలు అడిగారు. అధికారంలోకి వచ్చాక హోదాను మర్చిపోయారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి సభలో ప్రధానమంత్రి మోదీ చెప్పారు. ఢిల్లీని తలదన్నేలా రాజధానిని నిర్మించి ఇస్తామన్నారు. హోదాను కేబినెట్‌ ఆమోదించి మార్చిలో ప్లానింగ్‌ కమిషన్‌కు పంపింది. 2015, మార్చి 31 వరకూ 13వ ఆర్థిక సంఘమే అమల్లో ఉంది. హోదా హామీని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నా హోదా ఇవ్వలేదు. ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. కేంద్రం చెప్పగానే ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించారు. అంతేకాకుండా కోడలు మగపిల్లాడ్ని కంటానంటే అత్త వద్దంటుందా అని సామెతలు కూడా చెప్పారు. చివరకూ హోదాపై ఉద్యమం ఉధృతం కావడంతో యూటర్న్‌ తీసుకున్నారు. ప్రత్యేక హోదా అంటూ విన్యాసాలు చేస్తున్నారు. అబద్ధాలు ఆడటంతో చంద్రబాబు మోనగాడు. చంద్రబాబు వద్ద ఏమాత్రం విలువలు లేవు. చంద్రబాబుకు ప్రజలు తగు గుణపాఠం చెబుతారు’అని మేకపాటి హెచ్చరించారు.

ఏపీకే ఎందుకు అన్యాయం చేస్తున్నారు..?
నాలుగేళ్లు పాటు ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆ అన్యాయానికి బీజేపీ, టీడీపీ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ‘విభజన హామీలన్నీ అమలు చేస్తామని ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాన్‌ చెప్పారు. నాలుగేళ్లు అయినా ఒక్క హామీని అమలు చేయలేదు. ప్యాకేజీ ఇవ్వడానికి బీజేపీ ఎవరు?. తీసుకోవాడానికి చంద్రబాబు ఎవరు?. చంద్రబాబు కొత్తడ్రామకు తెర లేపుతున్నారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నీ అమలు చేయాల్సిందే. ఏపీ భారతదేశంలో భాగం కాదా?. ఏపీకే ఎందుకు అన్యాయం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎన్డీయే ప్రభుత్వం దిగొచ్చి హోదా ఇవ్వాలి, లేకుంటే రాజీనామాలు చేసి ఆమరణ దీక్షలో కూర్చుంటాం.’ అని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

అశాస్త్రీయంగా ఏపీ విభజన
రాష్ట్ర విభజనలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం చెప్పిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. హోదా ఐదేళ్లు కాదు, 15 ఏళ్లు ఇవ్వాలని చంద్రబాబు కోరారని, నాలుగేళ్లు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు హోదా గురించి ఎప్పుడు మాట్లాడలేదని వరప్రసాద్‌ విమర్శించారు. పైగా హోదా సంజీవని కాదంటూ మభ్యపెట్టారని, వైఎస్సార్‌ సీపీ మాత్రం హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని చెప్పిందన్నారు.  హోదా కోసం వైఎస్‌ జగన్‌ చాలా పోరాటాలు చేశారని, నాలుగేళ్లు అయినా హోదా ఇవ్వకపోవడంతో కేంద్రంపై తాము అవిశ్వాసం పెట్టామన్నారు. ఏప్రిల్‌ 5కల్లా హోదా ఇవ్వకపోతే 6న రాజీనామాలు చేస్తామని చెప్పామన్నారు. రేపు సభ వాయిదా పడగానే రాజీనామాలు చేస్తామని, అనంతరం ఏపీ భవన్‌లో ఆమరణ దీక్షలో కూర్చుంటామని వరప్రసాద్‌ తెలిపారు.

టీడీపీ ఎంపీలు మాతో కలిసి రావాలి
పన్నెండుసార్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చినా చర్చకు అనుమతించకపోవడం బాధాకరమని ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం అయినా చర్చ జరగాలని కోరుకుంటున్నామని, రేపు సభ వాయిదా పడగానే పదవులకు రాజీనామాలు చేసి ఏపీ భవన్‌లో ఆమరణ దీక్షకు కూర్చుంటామన్నారు. టీడీపీ ఎంపీలు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. 25మంది ఎంపీలు రాజీనామాలు చేసి దీక్షలో పాల్గొంటే కేంద్రం కచ్చితంగా దిగొస్తుందని వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి అన్నారు. కాలయాపన కోసమే చంద్రబాబు వేసిన జాయింట్‌ యాక్షన్‌ కమిటీలు పనికి వస్తాయన్నారు. 

ఏపీ ప్రజల సత్తా కేంద్రానికి చూపిస్తాం
రాష్ట్ర ప్రజల సత్తా కేంద్రానికి చూపిస్తామని ఎంపీ మిథున్‌ రెడ్డి అన్నారు. విభజన హామీలు అమలు చేసేవరకూ వదిలిపెట్టమని ఆయన తెలిపారు. హోదాపై కేంద్ర వైఖరికి నిరసనగా రేపు రాజీనామాలు చేస్తామని, ఆ తర్వాత ఏపీ భవన్‌లో ఆమరణ దీక్షకు కూర్చుంటామన్నారు. టీడీపీ ఎంపీలు రాజకీయాలు పక్కన పెట్టి తమతో కలిసి రావాలని మిథున్‌ రెడ్డి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement