అప్పటి లవ్వు.. కమలం పువ్వు!

Chandrababu and BJP Bonding in 1999 election - Sakshi

1999–ఫ్లాష్‌బ్యాక్‌

బాబు–బీజేపీ బంధం

1999 ఎన్నికల్లోనూ బీజేపీతో బాబు అవసరార్థ పొత్తు

టీడీపీకి కలిసొచ్చిన ‘వాజ్‌పేయి సానుభూతి’

సాక్షి, నాలెడ్జ్‌సెంటర్‌: నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో తొలిసారి 1999 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించింది. 1989 జమిలి ఎన్నికల తర్వాత బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తెలుగుదేశం పదేళ్లకు మళ్లీ ఈ ఎన్నికల్లో కాషాయ పక్షంతో పొత్తుపెట్టుకుని పోటీచేసింది. 1999 ఏప్రిల్‌లో అటల్‌బిహారీ వాజ్‌పేయి(బీజేపీ) నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుకు జరిగిన బలపరీక్షలో ప్రభుత్వానికి అనుకూలంగా తెలుగుదేశం ఓటేయడంతో రెండు పార్టీల మధ్య మళ్లీ ఈ స్నేహం మొదలైంది. లోక్‌సభలో ఒక ఓటు తేడాతో కూలిపోవడంతో వాజ్‌పేయిపై పెల్లుబికిన సానుభూతి, కార్గిల్‌ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్‌ విజయంతో పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి పెరిగిన ఓట్లు టీడీపీకి ఉపయోగపడ్డాయి. లోక్‌సభతోపాటే అసెంబ్లీ (జమిలి) ఎన్నికలు జరగడంతో టీడీపీ–బీజేపీ కూటమి గెలిచింది. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కాగలిగారు.

చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై అసెంబ్లీ ఎన్నికలను రిఫరెండంగా భావించారు. అయితే, కేంద్రంలోజరిగిన రాజకీయ పరిణామాల ఫలితంగా బీజేపీతో పొత్తుపెట్టుకుని టీడీపీ ఈ జమిలి ఎన్నికల్లో విజయం సాధించింది. ఎన్టీఆర్‌ మూడో కొడుకు, టీడీపీ మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ, అల్లుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు నాయకత్వంలోని అన్న టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా పోటీచేసి ఓడిపోయింది. ఈ పార్టీకి ఒక్క సీటూ దక్కలేదు. హరికృష్ట గుడివాడ నుంచి పోటీచేసి తెలుగుదేశం అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 సీట్లకుగాను తెలుగుదేశం 216 సీట్లు సంపాదించగా, 1999 సెప్టెంబర్‌–అక్టోబర్‌లో జరిగిన ఈ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఈ పార్టీకి 181 సీట్లు దక్కాయి. బీజేపీకి 12 వచ్చాయి. ఏపీలోని మొత్తం 42 లోక్‌సభ సీట్లలో టీడీపీ 29, బీజేపీ 6, కాంగ్రెస్‌ 5 సీట్లు గెలుచుకున్నాయి. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 26 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్‌ ఈసారి పీసీసీ అధ్యక్షుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో 91 సీట్లు కైవసం చేసుకుంది. అక్టోబర్‌ 11న చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగా, వైఎస్‌ ప్రతిపక్షనేత అయ్యారు.  

తెలంగాణలో తగ్గిన టీడీపీ సీట్లు 
తెలంగాణలో తెలుగుదేశం బలం తగ్గింది. కాంగ్రెస్‌ సీట్లు ఇక్కడ పెరిగాయి. తెలంగాణలోని 107 అసెంబ్లీ సీట్లలో టీడీపీ 49, కాంగ్రెస్‌ 42 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ 7, ఎంఐఎం 4, సీపీఐ(ఎంఎల్‌) 1, సీపీఎం 2 స్థానాలు సాధించాయి. హైదరాబాద్‌ నగరంలో టీడీపీ–బీజేపీ కూటమికి అత్యధిక సీట్లు దక్కాయి. కిందటి అసెంబ్లీలో కాంగ్రెస్‌ పక్ష నేత పి.జనార్దన్‌రెడ్డి 1983 ఎన్నికల తర్వాత ఈ ఎన్నికల్లో ఖైరతాబాద్‌లో ఓడిపోవడం విశేషం. టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన మాజీ డీజీపీ కె.విజయరామారావు చేతిలో పీజేఆర్‌ ఓడిపోయారు. మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి నాగర్‌కర్నూలులో మరోసారి విజయం సాధించారు. మాజీ మంత్రి పి.చంద్రశేఖర్‌(టీడీపీ) మహబూబ్‌నగర్‌ నుంచి మళ్లీ ఎన్నికయ్యారు. హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి(టీడీపీ) భువనగిరి నుంచి గెలుపొందారు. ప్రస్తుత తెలంగాణ టీఆర్‌ఎస్‌ మంత్రి జూపల్లి కృష్ణారావు(కాంగ్రెస్‌) కొల్లాపూర్‌ నుంచి తొలిసారి కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచారు. మాజీ మంత్రి పి.ఇంద్రారెడ్డి తొలిసారి కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీచేసి చేవెళ్ల నుంచి గెలుపొందారు.

తర్వాత కొద్ది నెలలకే ఆయన రోడ్డుప్రమాదంలో మరణించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ మొదటిసారి అసెంబ్లీకి చాంద్రాయణ గుట్ట నుంచి పోటీచేసి ఎంబీటీ నేత అమానుల్లాఖాన్‌ను ఓడించారు. మంత్రులు టి.దేవేందర్‌గౌడ్, కె.చంద్రశేఖర్‌రావు వరుసగా మేడ్చల్, సిద్దిపేట నుంచి మళ్లీ గెలుపొందారు. మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డి (కాంగ్రెస్‌) మరోసారి బాల్కొండ నుంచి ఎన్నికయ్యారు. మండవ వెంకటేశ్వరరావు(టీడీపీ) డిచ్‌పల్లి నుంచి మళ్లీ గెలుపొందారు. కాంగ్రెస్‌ నేతలు డి.శ్రీనివాస్‌(నిజామాబాద్‌), జి.గడ్డెన్న(ముధోల్‌), ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి(నిర్మల్‌), దానం నాగేందర్‌(ఆసిఫ్‌నగర్‌), దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు(మంథని), కొండా సురేఖ(శాయంపేట), వనమా వెంకటేశ్వరరావు(కొత్తగూడెం), ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(కోదాడ), కోమటిరెడ్డి వెంకటరెడ్డి(నల్లగొండ) విజయం సాధించారు.  

లోక్‌సభ ఎన్నికల్లోనూ... 
- అసెంబ్లీ ఎన్నికలతోపాటు జరిగిన లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో జతకట్టి  టీడీపీ గట్టెక్కింది.  
ఈ కూటమికి 35 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు ఐదు సీట్లే దక్కాయి. బీజేపీ ఆరు సీట్లు గెలవడం ఇదే మొదటిసారి.  
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ(బీజేపీ) వరుసగా రెండోసారి సికింద్రాబాద్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మరో మంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌రావు కూడా కరీంనగర్‌ నుంచి వరుసగా రెండోసారి విజయంసాధించారు. 
మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరిన సీనియర్‌ నేత సూదిని జైపాల్‌రెడ్డి మిర్యాలగూడ నుంచి గెలుపొందారు. 
కాంగ్రెస్‌ టికెట్‌పై లోక్‌సభకు పోటీచేసిన మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు సికింద్రాబాద్‌లో దత్తాత్రేయ చేతిలో ఓటమిపాలయ్యారు.  

ఇల్లెక్కిన ఇందిరమ్మ 
కోదాడ: ప్రచార సభ వేదికలను ప్రత్యేకంగా నిర్మిస్తారు. కానీ, ఒక ఇల్లే ప్రచార వేదిక కావడం మాత్రం విచిత్రమే. ఉమ్మడి నల్లగొండ జిల్లా కోదాడ పట్టణం నయానగర్‌లోని పాత కోర్టు ఎదురుగా, రవీంద్రభారతి పాఠశాల వెనుక ఓ ఇల్లుంది. నాడు ఈ ప్రాంతం విశాలమైన సాగుభూమిగా ఉండి.. మధ్యలో ఇల్లు ఉండేది. 1983లో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తలో తొలిసారి కోదాడకు వచ్చారు. వేలమంది ఆయనను చూసేందుకు తరలివచ్చారు. వారినుద్దేశించిన ఆయన ఈ ఇంటి మీద నుంచే ప్రసంగించారు. దీంతో కోదాడ కాంగ్రెస్‌ అభ్యర్థి చింతా చంద్రారెడ్డి.. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని కోదాడకు తీసుకొచ్చారు. ఆమె కూడా ఈ ఇంటి మీది నుంచే ప్రసంగించారు. హెలికాప్టర్‌లో వచ్చిన ఇందిరను చూసేందుకు నాడు ప్రజలు ఎగబడ్డారని నాటి తరం నేతలు చెబుతుంటారు. ఇక తామేం తక్కువ కాదన్నట్టు సీపీఎం నాయకులు సినీ నటుడైన మాదాల రంగారావును తీసుకొస్తే.. ఆయనా ఈ ఇంటి మీద నుంచే ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అలా ఈ ఇల్లు నాడు ఎన్నికల వేళ ప్రచారహోరుతో వెల్లువెత్తేది. ఇంతకీ ఈ ఇల్లు వంగవీటి వెంకట్రామయ్యది. 

టౌన్‌హాలు.. అసెంబ్లీ
హైదరాబాద్‌ మహా నగరానికి తలమానికంగా నిలిచే శాసనసభ భవన నిర్మాణం వెనుక ఆసక్తికరమైన అంశాలు దాగి ఉన్నాయి. దవళ వర్ణంలో తళతళలాడుతూ కనిపించే ఈ భవనాన్ని 1913లో నిర్మించారు. అప్పట్లో ఇది టౌన్‌హాలుగా వినియోగంలో ఉండేది. నిజాం నవాబు మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ 40వ జన్మదినోత్సవం సందర్భంగా, ఆయనకు కానుక సమర్పించేందుకు అప్పటి హైదరాబాద్‌ వాసులు కొన్ని నిధులు సేకరించారు. ఈ మొత్తంతో ప్రస్తుత అసెంబ్లీ భవనాన్ని నిర్మించారు. ప్రసిద్ధ వాస్తు శిల్పులు ఈ భవనానికి డిజైన్‌ చేశారు. ఇదీ మన శాసనసభ భవనం నిర్మాణం వెనకున్న కథ. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top