ధర 2.86 శాతం తక్కువే

CAG report says NDA's Rafale deal 2.86% cheaper than UPA's in 2007 - Sakshi

యూపీఏ కుదుర్చుకున్న ఒప్పందంలోనే ధర ఎక్కువ

ఫ్రాన్స్‌ ప్రభుత్వ పూచీకత్తు తీసుకోకపోవడం భారత్‌కు నష్టం

రఫేల్‌ యుద్ధ విమానాలపై పార్లమెంటులో కాగ్‌ నివేదిక

నివేదిక అంతా అబద్ధం: కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: నిత్యం వివాదాలతో వార్తల్లో ఉంటున్న రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ఎట్టకేలకు కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) నివేదిక బుధవారం పార్లమెంటుకు చేరింది. రఫేల్‌ విమానాల కోసం 2007లో నాటి యూపీఏ ప్రభుత్వం ఖరారు చేసిన ధర కన్నా ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం కుదుర్చుకున్న ధర 2.86 శాతం తక్కువగానే ఉందని కాగ్‌ నివేదిక వెల్లడించింది. అయితే రఫేల్‌ వ్యవహారంలో ప్రధాన ఆరోపణలు ఉన్న ‘భారత్‌లో ఆఫ్‌సెట్‌ భాగస్వామి ఎంపిక’ అంశాన్ని కాగ్‌ ఈ నివేదికలో కనీసం ప్రస్తావించలేదు. యుద్ధ విమానాల పూర్తి, స్పష్టమైన ధరలను కూడా కాగ్‌ తన నివేదికలో పేర్కొనలేదు. కాంగ్రెస్‌ కుదుర్చుకున్న ధర కన్నా తమ ప్రభుత్వం రఫేల్‌ విమానాలను కొంటున్న ధర 9 శాతం తక్కువగా ఉందంటూ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ గతంలో ప్రకటించగా, తాజాగా కాగ్‌ మాత్రం అది 2.86 శాతమే తక్కువని స్పష్టం చేయడం గమనార్హం.

ఆ ప్యాకేజీకి 6.54 శాతం ఎక్కువ ధర
రఫేల్‌ ధరల వివరాలను సంపూర్ణంగా బయటపెట్టకపోయినప్పటికీ, ఇంజనీరింగ్‌ సహాయక ప్యాకేజీ, వాయుసేనకు పనితీరు ఆధారిత లాజిస్టిక్స్‌ వరకు చూస్తే ప్రస్తుత ధర గతం కన్నా 6.54 శాతం ఎక్కువగా ఉందని కాగ్‌ నివేదిక వెల్లడించింది. 2007లో కుదుర్చుకున్న ధరలతో పోలిస్తే శిక్షణా వ్యయం కూడా ప్రస్తుతం 2.68 శాతం పెరిగిందంది. రఫేల్‌ విమానాల్లో భారత్‌ కోరిన సౌకర్యాలు తదితరాల్లో మాత్రం యూపీఏ ధర కన్నా ఎన్డీయే ధరలు 17.08 శాతం తక్కువగా ఉన్నాయంది. ఆయుధాల ప్యాకేజీ కూడా గతం కన్నా ప్రస్తుతం 1.05 శాతం తక్కువకే వచ్చిందని తన 157 పేజీల నివేదికలో కాగ్‌ వెల్లడించారు. మొత్తంగా చూస్తే యూపీఏ కన్నా ఏన్డీయే కుదుర్చుకున్న ధర 2.86 శాతం తక్కువగా ఉందన్నారు.

అయితే కాంగ్రెస్‌ మాత్రం తాము ఒక్కో విమానాన్ని రూ. 520 కోట్లకు కొనేందుకు ఒప్పందం కుదుర్చుకుంటే ప్రస్తుతం మోదీ ప్రభుత్వం ఒక్కో విమానానికి రూ.1,600 కోట్లు ఖర్చు చేస్తోందని గతం నుంచీ ఆరోపిస్తోంది. డసో పోటీ సంస్థ యూరోపియన్‌ ఏరోనాటిక్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ కంపెనీ (ఈఏడీఎస్‌) విమానాల ధరపై 20 శాతం తగ్గింపు ఇస్తామనడంపై ప్రభుత్వ స్పందనను కూడా కాగ్‌ రాజీవ్‌ మహర్షి ఈ నివేదికలో ప్రస్తావించారు. 20 శాతం తగ్గింపును ఆ కంపెనీ భారత్‌ అడగకుండానే ఇచ్చిందనీ, అలాగే ఈఏడీఎస్‌ ప్రతిపాదనల్లో వాస్తవిక వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీని ఎంపిక చేయలేదని రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పినట్లు కాగ్‌ నివేదిక తెలిపింది.

లెటర్‌ ఆఫ్‌ కంఫర్ట్‌తోనా?
ఎన్డీయే ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలోని లోపాలనూ కాగ్‌ తన నివేదికలో ప్రస్తావించారు. ఫ్రాన్స్‌ ప్రభుత్వం నుంచి హామీ/పూచీ తీసుకోకుండా కేవలం లెటర్‌ ఆఫ్‌ కంఫర్ట్‌తోనే మోదీ ప్రభుత్వం సరిపెట్టుకుందనీ, దీనివల్ల రఫేల్‌ విమానాల తయారీ సంస్థ డసో ఏవియేషన్‌కు లబ్ధి చేకూరిందని కాగ్‌ తెలిపారు. 2007లో కుదిరిన ఒప్పందం ప్రకారమైతే ముందస్తు చెల్లింపులకు 15 శాతం బ్యాంకు గ్యారంటీ కూడా ఉందనీ, ప్రస్తుత ఒప్పందంలో అలాంటిదేమీ లేదని కాగ్‌ నివేదిక వెల్లడించింది. ‘ఫ్రాన్స్‌ ప్రభుత్వం నుంచి పూచీకత్తు లేకుండా లెటర్‌ ఆఫ్‌ కంఫర్ట్‌తో సరిపెట్టుకోవడం వల్ల ఒకవేళ భవిష్యత్తులో డసో ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే భారత్‌కు తలనొప్పి తప్పదు. ఒప్పంద ఉల్లంఘన జరిగితే ముందుగా భారత్‌ మధ్యవర్తిత్వం ద్వారా డసోతోనే చర్చలు జరపాలి. ఈ చర్చల ఫలితం భారత్‌కు అనుకూలంగా ఉంటే, ఇందులో వచ్చిన తీర్పును/పరిష్కారాన్ని అనుసరించేందుకు కూడా డసో విముఖత చూపితే భారత్‌ మళ్లీ అందుబాటులో ఉన్న అన్ని న్యాయ పరిష్కారాలనూ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే డసో తరఫున ఫ్రాన్స్‌ ప్రభుత్వం భారత్‌కు డబ్బు తిరిగి చెల్లిస్తుంది’ అని నివేదిక వివరించింది.

అబద్ధాలని తేలిపోయింది: జైట్లీ
కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు రఫేల్‌పై చెబుతన్నవన్నీ అబద్ధాలేనని కాగ్‌ నివేదికతో తేటతెల్లమైందని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు.

ఆఫ్‌సెట్‌ భాగస్వామి ప్రస్తావనే లేని నివేదిక
రఫేల్‌ వివాదంలో కాంగ్రెస్‌ ప్రధాన ఆరోపణ ఆఫ్‌ ఎంపిక గురించే. డసో భారత్‌లో తనకు ఆఫ్‌సెట్‌ భాగస్వామిగా ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)ను కాకుండా రిలయన్స్‌ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకుందనీ, ఈ రంగంలో ఏ అనుభవం లేని కొత్త కంపెనీ రిలయన్స్‌ డిఫెన్స్‌కు ఈ అవకాశం దక్కడానికి మోదీ ప్రభుత్వ అవినీతే కారణమని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. అయితే కాగ్‌ నివేదికలో మాత్రం ఆఫ్‌సెట్‌ భాగస్వామి ఎంపిక అంశం గురించి కనీసం ప్రస్తావన కూడా లేదు.

ఆ కాగితమంత విలువ కూడా లేదు: రాహుల్‌
రఫేల్‌ ఒప్పందం కుదుర్చుకునేందుకు జరిపిన చర్చల సమయంలో వచ్చిన అసమ్మతి గురించి అసలు ఈ నివేదికలో కాగ్‌ ప్రస్తావించలేదంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగ్‌ నివేదికను ముద్రించిన కాగితాలకు ఉన్నంత విలువ కూడా అందులో పేర్కొన్న అంశాలకు లేదని విమర్శించారు. ‘కొత్త ఒప్పందం కుదుర్చుకోవడానికి మోదీ ప్రభుత్వం చెబుతున్న కారణాలు ధర, మరింత వేగంగా సరఫరా. కానీ ఈ ఆ రెండు వాదనలూ అవాస్తవాలేనని ద హిందూ పత్రిక తాజా కథనంతో తేలిపోయింది. కేవలం రిలయన్స్‌ గ్రూప్‌ అధినేత అనిల్‌ అంబానీకీ రూ. 30 వేల కోట్లు అక్రమంగా ఇచ్చేందుకే ఈ కొత్త ఒప్పందం జరిగింది’ అని రాహుల్‌ మరోసారి ఆరోపించారు. రఫేల్‌ అంశంపై మాజీ ప్రధాని మన్మోహన్, రాహుల్, సోనియా తదితరులు పార్లమెంటు భవనం వద్ద నిరసన చేపట్టారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top