సీఎం యోగికి ఉద్ధవ్‌ ఫోన్‌.. ఏం అడిగారు?

Bulandshahr Incident: Uddhav Thackeray speaks to Yogi Adityanath - Sakshi

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మంగళవారం ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్‌ చేశారు. బులందర్‌షహర్‌ జిల్లాలో జరిగిన ఇద్దరు సాధువుల హత్యపై ఆందోళన వెలిబుచ్చారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ‘యూపీ ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడాను. బులందర్‌షహర్‌ జిల్లాలో జరిగిన ఇద్దరు సాధువుల హత్యపై ఆందోళన వ్యక్తపరిచాను. మేము మీతో ఉంటామని ఆయనతో చెప్పాను. ఇలాంటి కేసులో మేము వ్యవహరించినట్టుగానే కఠినంగా ఉండాలని, దోషులను చట్టం ముందు నిలబెట్టాలని సూచించాను. దీనికి మతం రంగు పూయొద్దని కోరాన’ని ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు.

కాగా, సాధువుల హత్యపై యూపీ సీఎంకు ఠాక్రే ఫోన్‌ చేయడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మహారాష్ట్రలోని పాల్గాఢ్‌ జిల్లాలో సాధువుల హత్య జరిగిన సందర్భంలో ఉద్ధవ్‌కు సీఎం యోగి ఫోన్‌ చేశారు. హంతకులను కఠినంగా శిక్షించాలని ఆయనకు సూచించారు. సరిగ్గా ఇదేవిధంగా ఇప్పుడు ఆదిత్యనాథ్‌కు ఠాక్రే ఫోన్‌ చేశారు. పాల్గాఢ్‌ ఘటనకు మతం రంగు పూయాలని బీజేపీ నాయకులు ప్రయత్నించగా ఉద్ధవ్‌ సర్కారు సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో ఇరువురు నేతల ఫోన్‌ సంభాషణ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

శివసేన సీనియర్‌ సంజయ్‌ రౌత్‌ కూడా బులందర్‌షహర్‌ సాధువుల హత్య​కు మతం రంగు పులమకుండా జాగ్రత్త పడాలని ట్విటర్‌లో పేర్కొన్నారు. సోమవారం రాత్రి బులందర్‌షహర్‌ జిల్లా ప‌గోనా గ్రామంలోని శివా‌లయంలో ఇద్దరు సాధువులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో మురారీ అలియాస్‌ రాజు అనే వ్యక్తిని యూపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. (దేవుడు కోరాడనే సాధువులను చంపేశా)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top