ఆ ఎమ్మెల్యేల చూపు మా వైపు

BJP Yeddyurappa Criticize On CM  Kumaraswamy - Sakshi

సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్, జేడీఎస్‌ పార్టీల్లోని చాలా మంది అసంతృప్త నేతలు తమ పార్టీలోకి చేరేందుకు ఆసక్తి కనపరుస్తున్నారని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు బీఎస్‌ యడ్యూరప్ప చెప్పారు. శనివారం బెంగళూరు మల్లేశ్వరంలో రాష్ట్ర బీజేపీ యువ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారని, అయితే ఆ ఎమ్మెల్యేల పనితీరు, ప్రాధాన్యాన్ని బట్టి ఎవరెవరినీ పార్టీలో చేర్చుకోవాలనే అంశంపై తమ పార్టీ జిల్లాల నాయకత్వం నిర్ణయిస్తుందని తెలిపారు.

సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న అసంతృప్తిని, అసహనాన్ని ఆధారంగా చేసుకుని లాభపడాలని మేము భావించడం లేదు. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం ఎంత కాలం వరకు తన మనుగడను నిలపుకోగలదో నాకు తెలుసు. అప్పటివరకు ప్రజల ఆకాంక్షల మేరకు ప్రతిపక్ష పాత్ర చక్కగా పోషిస్తాం. ఎన్నికల్లో కేవలం కొద్ది సీట్లతో అధికారం కోల్పోయాం. ఈసారి చక్కగా పనిచేసి అధికారంలోకి వస్తాం. మేం అనుకుంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి రాగలం. కానీ ప్రస్తుతం మా దృష్టి అంతా 2019 లోక్‌సభ ఎన్నికలపై ఉంది. మరోసారి మా నాయకుడు నరేంద్రమోదీని ప్రధానిని చేసేందుకు కృషి చేస్తాం’ అని యడ్డి తెలిపారు.

 కుమారకు పట్టం.. దారుణం

స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారి 37 స్థానాలు గెలిచిన ఒక పార్టీ నేత ముఖ్యమంత్రి కావడం విడ్డూరమని యడ్యూరప్ప విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి దారుణం జరగడం ఒక్క కర్ణాటకకే చెల్లిందన్నారు. గతంలో 20–20 నెలల చొప్పున సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు బీజేపీకి జేడీఎస్‌ చేసిన అన్యాయం కాంగ్రెస్‌ మరచిపోరాదని సూచించారు. మున్ముందు ఈ విషయంలో కాంగ్రెస్‌ పశ్చాత్తాపపడక తప్పదన్నారు.

అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే రుణమాఫీ చేస్తానని హామీనిచ్చిన సీఎం కుమారస్వామి ఇప్పటివరకు ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని తెలిపారు. గత 15 రోజులుగా మంత్రి విస్తరణతో బిజీగా ఉన్న కాంగ్రెస్, జేడీఎస్‌ నేతలు పాలనను  గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. ఈ సారి ఎన్నికల్లో కొద్ది సీట్లతో వెనుకంజలో పడ్డామని, వచ్చే ఎన్నికల్లో 150 స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ ప్రతాప్‌ సింహా, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయేంద్ర, ఎమ్మెల్యే అరవింద్‌ లింబావళి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top