బీజేపీకి ‘రసగుల్లా’

bjp will score a big rosogolla in bengal - Sakshi

ఎన్నికల తర్వాత మోదీకి మిగిలేది చౌకీనే

ఎన్నికల ప్రచార ర్యాలీలో మమతా బెనర్జీ వ్యాఖ్యలు

బాలుర్‌ఘాట్‌/గంగరామ్‌పూర్‌: లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి ‘రసగుల్లా’నే (సున్నాను సూచిస్తూ) దక్కుతుందని, ఆ పార్టీ కనీసం ఒక్క స్థానం గెలవదని తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) చీఫ్, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో ఎక్కువ సీట్లు గెలవాలన్న ప్రధాని మోదీ ఆశ కలగానే మిగులుతుందన్నారు. దక్షిణ్‌ దినాజ్పూర్‌ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె ప్రసంగించారు. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో కనీసం సగమైనా గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని, కానీ 2014 ఎన్నికల్లో వచ్చిన రెండు సీట్లలో కూడా ఈసారి గెలవదన్నారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీకి 100 సీట్లు కూడా రావన్నారు.

ఈశాన్య రాష్ట్రాలు, ఏపీ, తమిళనాడు, కేరళ, ఒడిశాలో ఆ పార్టీ ఖాతా తెరవదన్నారు. బెంగాల్లో ఆశ్చర్యం కలిగించే ఫలితాలు వస్తాయన్న కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ వ్యాఖ్యలపై స్పందించిన ఆమె... సున్నా స్థానాలు గెలుపొంది నిజంగానే ఆశ్చర్యానికి గురవుతారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఛాయ్‌వాలా ప్రధానికి, కేథీవాలా (ఛాయ్‌ ఉంచే పాత్ర) ఆర్థిక మంత్రి అని జైట్లీని విమర్శించారు. ఐదు సంవత్సరాల క్రితం తాను ఛాయ్‌వాలా అని, ఇప్పుడు చౌకీదార్‌ అని చెప్పుకుంటున్న మోదీకి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మిగిలేది చౌకీనే (మంచం) అన్నారు. 2014లో బీజేపీ గెలిచిన డార్జిలింగ్‌ సహా రాష్ట్రంలో మొదటి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్న ఐదు స్థానాల్లో టీఎంసీ విజయం సాధిస్తుందని మమతా ధీమా వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top