‘కేసీఆర్‌.. ఫ్రంట్, టెంట్ ఎక్కడ పోయింది?’

BJP State President Laxman Fires On CM KCR - Sakshi

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడ పోయింది

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు

సీఎంపై బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఫైర్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ సభలో పచ్చి అబద్దాలు మాట్లాడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. శాసనసభను టీఆర్‌ఎస్‌ పార్టీ సభగా మార్చారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను అబద్దాలకు అంబాసిడర్‌గా మారిస్తే సరిపోతుందని ఎద్దేవా చేశారు. చేసిన అప్పును కూడా ఆదాయంగా చూపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. దాదాపు 3లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ప్రజలపై భారం మోపారని లక్ష్మణ్‌ మండిపడ్డారు. కాగ్ రిపోర్టు కేసీఆర్ ప్రభుత్వాన్ని అనేక అంశాలపై తప్పు పట్టిందని ఆయన గుర్తుచేశారు. 

ఆదివారంతో తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన విషయం తెలిసిందే. దీనిపై లక్ష్మణ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఎన్నికల సమయంలో కేసీఆర్ చెప్పింది వేరు.. ప్రస్తుతం చేస్తోంది వేరు. ప్రజలు నమ్మి కేసీఆర్‌కు అధికారం ఇస్తే.. రాష్ట్రాన్ని అప్పుల పాలుగా చేశారు. మన దగ్గర ఆర్థిక మాంద్యం లేదు. మాంద్యం ముసుగులో రాష్ట్రంలో నిధులు లేని అంశాన్ని కప్పిపుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం తెలంగాణకు 3లక్షల కోట్ల నిదులు ఇచ్చింది. కాళేశ్వరానికి జాతీయ హోదా కోసం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనను కేంద్రానికి పంపలేదు. ఈ విషయం పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రమంత్రులే ప్రకటించారు. తెలంగాణలో రైతులకు ఎందుకు రైతుబంధు ఇవ్వడం లేదు.

రైతు రుణమాఫీ లేదు. ఒక్క శాతం కూడా అక్షరాస్యత పెరగని రాష్ట్రం ఏదైనా ఉంటే అది తెలంగాణ మాత్రమే. విద్య వ్యవస్థను నాశనం చేసారు. బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు.  ప్రొఫెసర్ జయశంకర్ గారిని వ్యక్తిగతంగా దూషించిన చరిత్ర కేసీఆర్ ది. కేసీఆర్ ప్రభుత్వం పాలనే అయినా ఎంఐఎం అజెండా కొనసాగుతుంది. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడ పోయింది. ఢిల్లీలో చక్రం తిప్పుతామన్నారు. కారు సారు సర్కారు అన్నారు. ఇప్పుడు మీ ఫ్రంట్ ,టెంట్ ఎక్కడ పోయింది. ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చే పీఏసీ ఛైర్మెన్ పదవి  అక్బరుద్దీన్‌కు ఇవ్వడం చూస్తే తెలుస్తోంది తెలంగాణ లో ఎలాంటి పాలన ఉందో’ అని వ్యాఖ్యానించారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top