వైఎస్‌ చొరవతోనే పోలవరం

BJP MLC Madhav Criticize On Chandrababu Naidu - Sakshi

తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): పోలవరం ప్రాజెక్టు కార్యరూపం దాల్చడానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చూపిన చొరవే కారణమని ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌.మాధవ్‌ స్పష్టం చేశారు. రైల్వే న్యూకాలనీలోని సుబ్బలక్ష్మి కల్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి పర్యావరణ శాఖల నుంచి అనుమతులు తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టును కార్యరూపంలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్టర్లను వత్తాసు పలికేందుకే అన్నట్టుగా వ్యయాన్ని పెంచుకుంటూ పోతోందని ఆరోపించారు.

ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం పూర్తి చేస్తానంటే కమీషన్లు అందవేమోనని భయపడి ఇవ్వడం లేదన్నారు. నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించిందని తెలిపారు.  నేషనల్‌ హైవే ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1.15 లక్షల కోట్లు మంజూరు చేసిందని, ఇప్పటికే రూ.10 వేల కోట్లు ఖర్చు చేసినట్టు ఆయన తెలిపారు. రాష్ట్రానికి 24/7 కరెంట్‌ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అన్ని ప్రాజెక్టుల్లోనూ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. గృహనిర్మాణంలో చదరపు అడుగుకు కేవలం రూ.1200 ఖర్చుతో పూర్తి చేయడానికి పలు సంస్థలు ముందుకు వచ్చినా.. కాంట్రాక్టర్ల ఒత్తిడికి లోనై నేడు చదరపు అడుగు దాదాపు రూ. 2500లను ముట్టచెబుతోందన్నారు.

రాష్ట్రంలో ఏ పేదవాడికైనా ఉచితంగా ఇసుక అందించారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చారని, ఏ ఒక్కటీ నేరవేర్చలేదన్నారు. ఈ తప్పులన్నీ కేంద్రంపై మోపాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి అందించిన సాయంపై ప్రజలకు వివరిస్తామని, రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి లెక్కలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పార్టీ ప్రారంభించిన సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమం త్వరలో విశాఖలో ప్రారంభమవుతుందన్నారు. అంతకుముందు కార్యవర్గ సమావేశం జరిగింది. బీజేపీ నాయకులు, వార్డు అధ్యక్షుడు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top