‘రాహుల్‌కు కనీసం ఆ విషయమైనా తెలుసా’

BJP Leader Kishna Reddy Critics Rahul Gandhi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై బీజేపీ నేత కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. రాహుల్‌కు వ్యవసాయం అంటే తెలుసా అని ప్రశ్నించారు. కనీసం పాలు బర్రె నుంచి వస్తాయా.. దున్నపోతు నుంచి వస్తాయా అనేది కూడా తెలియదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌ అన్ని వర్గాలకు న్యాయం చేసేదిగా ఉందని కొనియాడారు. ప్రధాని మోదీ నీతి, నిజాయితీతోనే దేశంలో పాలన గాడిన పడిందన్నారు. మోదీ ప్రజాకర్షక బడ్జెట్‌ను జీర్ణించుకోలేక కొందరు అనవరస ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో కేసీఆర్‌ చుట్టూ.. కేంద్రంలో మోదీ చుట్టూ
‘రైతులకు రోజుకు 17 రూపాయలు ఇచ్చే పథకాన్ని ప్రారంభించారని రాహుల్‌ విమర్శిస్తున్నారు. మరి ఇన్నేళ్ల కాంగ్రెస్‌ పాలనలో వారికి 10 రూపాయలైనా ఇచ్చారా’ అని రాహుల్‌ విమర్శలను తిప్పికొట్టారు. పంటలకు కనీస మద్దతు ఇవ్వని కాంగ్రెస్‌ ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన పథకాలపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ‘కిసాన్‌ సమ్మాన్‌’ పథకంతో రైతులకెంతో మేలు జరగుతుందని, ఏడాదికి 6 వేల రూపాయల నగదు బదిలీ పథకం  రైతుల్లో ఉత్సాహం నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మొన్న తెలంగాణ ఎన్నికలు కేసీఆర్‌ చుట్టూ తిరిగాయి. రాబోయే పార్లమెంటు ఎన్నికలు మోదీ, బీజేపీ చుట్టూ తిరుగుతాయి’ అని జోస్యం చెప్పారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్‌ రైతుబంధు పథకం ప్రారంభించారని.. కానీ, ఎన్నికలకు ముందే ‘కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ని తెచ్చారని కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top