ఉచిత డాటాతో బండి నడవదు మహాప్రభో..!

BJP Is Blamed By A Statement Cheap Fuel vs Cheap Mobile Data - Sakshi

బీజేపీ నేత వ్యాఖ్యలపై నెటిజన్ల సెటైర్లు

సాక్షి, న్యూఢిల్లీ: పెరిగిన ఇంధన ధరలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఒడిశా బీజేపీ సీనియర్‌ నాయకుడు జయనారాయణ్‌ మిశ్రా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని నవ్వులపాలు చేశాయి. కాంగ్రెస్‌పై విమర్శలు చేసే క్రమంలో అనాలోచితం‍గా ఆయన చేసిన వ్యాఖ్యలపై ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

మిశ్రా మంగళవారం ఒక న్యూస్‌ ఏజెన్సీతో మాట్లాడుతూ.. ఇంధన ధరల పెరుగుదలపై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పదేళ్ల పాలనలో మొబైల్‌ డాటాకు ఎంతో ఖర్చు చేయాల్సి వచ్చేదని, కానీ నేడు దాదాపు ఉచితం‍గా లభిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని విమర్శించడమే కాంగ్రెస్‌ లక్ష్యంగా మారిందంటూ.. యూపీఏ ప్రభుత్వ కాలంలో పెట్రోలు ఇతర వస్తువుల ధరలు ఏమేరకు పెరిగాయో వివరించారు. ‘2004లో లీటరు పెట్రోలు రూ.29కి లభించేది. పదేళ్ల యూపీఏ పాలన అనంతరం దాని ధర 74 రూపాయలకు చేరింది. కిలో నెయ్యి 2004లో రూ.130 ఉండగా.. 2014లో రూ.380 కి చేరింది. నాటి యూపీఏ హయాంలో 1 జీబీ డాటా కోసం రూ.300  చెల్లించాల్సి వచ్చేది.. కానీ, నేడు ఉచితంగా డాటా లభిస్తోంద’ని మిశ్రా వివరించారు. దీనిపై నెటిజన్లు స్పందించారు. ట్విటర్‌ వేదికగా బీజేపీపై విమర్శలు గుప్పించారు.

‘డాటా ఉచితం అయితే కావచ్చు. కానీ, డాటాతో బండి నడవదు కదా..!’ అంటూ ఒకరు స్పందించగా.. ‘ఈయన లెక్కలు బాగా చెబుతున్నారు. కొంపదీసి వచ్చే ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా చేస్తారేమోన’ని ఇంకొకరు చమత్కరించారు. ‘జియో వచ్చాక దేశంలో ఇంటర్నెట్‌ సౌకర్యం సులభమయింది. కానీ, ఏం లాభం. జియో మాదిరే పెట్రోలుపై కేంద్రం దృష్టి సారిస్తే మంచిది. 399 రూపాయలకే 70 రోజుల పాటు.. రోజూ ఒక లీటర్‌ చొప్పున జియో మాదిరే పెట్రోలు పథకం ప్రవేశపెడితే బాగుంటుంద’ని మరొకరు ట్వీట్‌ చేశారు.

‘మాకు జియో మ్యాజిక్‌ ఏం వద్దు. నిత్యావసరమైన పెట్రోలు ధరలు తగ్గిస్తే చాల’ని ఇంకో నెటిజన్‌ అన్నారు. బీజేపీ ప్రభుత్వం గత ప్రభుత్వాలను విమర్శిస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తోందనీ.. వారేం చేశారు.. వీరేం చేశారు అని మునుపటి ప్రభుత్వాలను వేలెత్తి చూపడం మానుకొని.. తక్షణం చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని నెటిజన్లు కేంద్రానికి సూచించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top