ఒక్క ప్రాజెక్టయినా పూర్తి చేశారా? | Batti Vikramarka Comments on TRS | Sakshi
Sakshi News home page

ఒక్క ప్రాజెక్టయినా పూర్తి చేశారా?

Nov 18 2018 1:42 AM | Updated on Mar 18 2019 9:02 PM

Batti Vikramarka Comments on TRS - Sakshi

కరీంనగర్‌ సదస్సులో మాట్లాడుతున్న భట్టి విక్రమార్క

కరీంనగర్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేసిందా అని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రీ డిజైనింగ్‌ పేరిట కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే అంచనాలు పెంచుతూ ప్రజాధనం దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. శనివారం కరీంనగర్‌లో కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా సదస్సులో భట్టి మాట్లాడారు. ఈ ఎన్నికలు నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిందేమి లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట పెద్ద దోపిడీ జరిగిందని ఆరోపించారు. లక్షల కోట్లు దండుకుని అవినీతి సొమ్ముతో మరోసారి ఎలాగైనా అధికారం దక్కించు కోవాలని తహతహలాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులే తప్ప ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసిన పాపాన పోలేదన్నారు.  ఫాంహౌస్‌ సీఎంను సాగనంపాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ పీడ వదుల్చుకునేందుకే మహాకూటమిగా జట్టు కట్టామని, కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు.  

ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టించారు..
స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి మాట్లాడుతూ ఎన్నో ఆశలతో టీఆర్‌ఎస్‌కు అధికారం అప్పగిస్తే చేసిందేమి లేదని విమర్శించారు. నాలుగున్నరేళ్లలో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేశారన్నారు. ఫాం హౌస్‌కు పరిమితమై పాలన సాగించిన కేసీఆర్‌ సర్కార్‌కు చరమగీతం పాడాలని ఆమె పిలుపునిచ్చారు.   సభలో కరీంనగర్, మానకొండూర్‌ అభ్యర్థులు పొన్నం ప్రభాకర్, ఆరెపల్లి మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement