అక్కడ ఓటు ఖరీదు రెండు లక్షల వరకు!

Arunachal Pradesh All About Money Politics - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అక్కడ ప్రతి అసెంబ్లీ నియోజక వర్గం మత్తులో తూగిపోతోంది. పిల్లా, పాపలు విందు, వినోదాల్లో తేలిపోతున్నారు. దాదాపు 15 రోజులుగా ఏ ఇంటి నుంచి పొగ రావడం లేదు. వంట మానేసిన ఓటరు కుటుంబాలన్నీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఇళ్లకు క్యూ కడుతున్నాయి. ఇంటి ఆవరణలోనో, కమ్యూనిటీ హాల్లలోనో అభ్యర్థులు ఏర్పాటు చేస్తున్న  పంక్తి భోజనాల్లో ఫుల్‌గా తాగుతున్నాయి. సుష్టుగా భోంచేస్తున్నాయి. మొదట నది చేపలు, బంగాళ దుంపలు, కూరగాయలతో మొదలైన విందులు, కూల్‌డ్రింక్స్‌తో ముగిసేవి. ఎన్నికలు సమీపిస్తుండడంతో రకరకాల చేపలతోపాటు గోమాంసం, అడవి పందుల మాంసం వెరైటీలతో విందు భోజనాలు ఘాటెక్కుతున్నాయి. స్థానికంగా పెంచుకునే ‘మిథున్‌ (త్రికోణాకృతిలో ముఖము, కొమ్ములు కలిగిన ఆవుజాతి జంతువు) మాంసం తప్పకుండా ఉండాల్సిందే. 60 అసెంబ్లీ స్థానాలు కలిగిన అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఏ నియోజక వర్గంలోనైనా ఇదే సీన్‌. ఆ రాష్ట్ర ప్రజలకు ఎన్నికలు వచ్చాయంటే పండుగే. ఈ సీన్‌ పునరావృతం కావాల్సిందే. 

స్థానిక ఓటర్లు విందు, మత్తు పానీయాలతో సంతృప్తి పెడతారనుకుంటే పొరపాటే. ఓటుకు నోట్లు చెల్లించాల్సిందే. అక్కడి ఓటు వెల తెలిస్తే మన ఓటర్లే కాదు, మన నాయకులు కూడా మూర్ఛ పోవాల్సిందే. ఒక్క ఓటు విలువ 20 వేల నుంచి 25 వేల రూపాయల వరకు ఉంటుందని ఓ స్థానిక జర్నలిస్ట్‌ తెలిపారు. ‘26 జాతులవారు నివసిస్తున్న నైషి నియోజక వర్గంలో ఈ రేటు ఎక్కువగా ఉంటుంది. సరాసరి ఓటరుకు 30 వేల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. పుల్లలు పెట్టేవారైనా, పది మందిని ప్రభావితం చేసే వారైవరైనా ఉంటే ఇక వారికి రెండు లక్షల రూపాయల వరకు చెల్లిస్తారు.’ అని నైషి ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు మేడి రామ్‌ డోడమ్‌ తెలిపారు. ఆయన 1990 దశకంలో బెమాంగ్‌ అసెంబ్లీ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 

డబ్బులే ప్రధానం
‘సమర్థుడైన నాయకుడా, కాదా ? అన్నది ఇక్కడ ఎవరికి అవసరం లేదు. క్రితం సారి గెలిపిస్తే ఏం చేశాడన్నది కూడా అప్రస్తుతం. ఎన్నికలకు ఎంత ఖర్చు పెడుతున్నారు ? ఎంత మంచి విందులు ఇస్తున్నారు ? చివరకు డబ్బు ఎంత ఇస్తారు? అన్నదే ఇక్కడ ముఖ్యం. మంచితనం గుర్తించి ఓటేసే వారు ఉంటే వేళ్ల మేద ఉండొచ్చు. ఇక్కడ డబ్బే ప్రధానం. కాకపోతే ఇక్కడ ఇతర రాష్ట్రాలకన్నా చాల ఎక్కువ’ అని అరుణాచల్‌ ఈస్ట్‌ మాజీ ఎంపీ లయేటా ఉంబ్రే చెప్పారు. డబ్బుతో పాటు అరుణాచల్‌లో తల్లిపరమైన బంధుత్వం కూడా పనిచేస్తోంది. ఇక్కడి చాలా జాతుల్లో తల్లిపరమైన సంబంధాలకే ప్రాధాన్యం ఇస్తారు. ‘మా నియోజకవర్గంలో 12,000 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో ఐదువేల మంది ఓటర్లు నా తల్లి రక్త సంబంధాలను, నా వ్యక్తిగత సంబంధాల కారణంగా నాకే ఓటు వేస్తారు. మిగతా ఏడు వేల మందిని నోట్లతో కొనాల్సిందే. ఓ రాజకీయ నాయకుడిగా నేను దీన్ని అరికట్టడంలో ఘోరంగా విఫలమయ్యాను’ అని రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ టాకమ్‌ సంజోయ్‌ తెలిపారు. 

పోటీకి 30 కోట్లు కావాలి!
‘గత ఎన్నికల్లో నేను పోటీ చేయాలనుకున్నాను. దానికోసం కసరత్తు కూడా చేశాను. అప్పుడు ఒక్కో ఓటుకు 20 వేల నుంచి 25 వేల రూపాయలు పలికింది. నియోజకవర్గంలో దాదాపు 17 నుంచి 18 వేల వరకు ఓటర్లు ఉన్నారు. గోమాంసం, పంది మాంసం విందులకు అదనంగా పెట్టాలి. స్థానిక జాతి ఆవు ధర 50 వేల రూపాయలు ఉంటుంది. మొత్తం కలిపి 25 కోట్ల నుంచి 30  కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తేలింది. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాం’ అనుకొని పోటీని విరమించుకున్నా’ అని నైషి నియోజకవర్గంలోని దిగువ సుభాన్‌శ్రీ జిల్లాకు చెందిన ఓ రాజకీయ నాయకుడు తెలిపారు. ‘ఇక్కడ జాతి సంబంధాల వల్ల కొంత కలిసి వస్తుంది. గత ఎన్నికల్లో 50 పందులు, కొన్ని ఆవులు, రెండు స్థానిక జాతి అవులు ఉచితంగా లభించాయి’ అని తూర్పు సియాంగ్‌ జిల్లా బీజేపీ శాసన సభ్యుడి అనుచరుడుకరు తెలిపారు. 

ఎందుకు ఓటుకు ఇంత డిమాండ్‌?
భౌగోళికంగా అసెంబ్లీ నియోజకవర్గాల విస్తీర్ణం పెద్దగా ఉన్నా ఓటర్ల పరంగా చూస్తే చాలా చిన్నవి. 12 నుంచి 15 వేల మంది ఓటర్లున్న నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి. బ్రిటీష్‌ కాలం నుంచి వివిధ పాలనా వ్యవస్థల కింద అరుణాచల్‌ ఉంటూ రావడం, భారీ ఎత్తున ప్రాజెక్టులు చేపట్టడం, ఇంజనీర్లు భారీ ఎత్తున అవినీతికి పాల్పడడం లాంటి పరిణామాలన్నీ ఓటు విలువను పెంచాయి. ఒకప్పుడు అస్సాం పరిధిలో ఉన్న ఈ ప్రాంతాన్ని 1914లో అప్పటి బ్రిటీష్‌ పాలకులు ‘సరిహద్దు పాలనా ప్రాంతం’గా ప్రకటించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1947లో ఇది అస్సాంలో కలిసి పోయింది. 1954లో దీన్ని ‘నార్త్‌ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ ఏజెన్సీ’గా ప్రకటించారు. విదేశీ వ్యవహారాల విభాగం కింద ఉన్న ఈ ప్రాంతం పరిపాలనా బాధ్యతలను అస్సాం గవర్నర్‌ చూసుకునేవారు. 

1962లో చైనా యుద్ధం 
1962లో చైనా వాళ్లు ఈ ప్రాంతంపైకి దురాక్రమణకు వచ్చినప్పుడు ఈ ప్రాంతం పాలనా బాధ్యతలను కేంద్ర హోం శాఖకు అప్పగించారు. 1972లో దీనికి కేంద్ర పాలిత ప్రాంతం హోదాను కల్పించారు. 1978లో మొదటిసారి ఎన్నికలు నిర్వహించారు. 1982లో పూర్తిస్థాయి రాష్ట్రం హోదాను కల్పించారు. ఈ ప్రాంతంలో రోడ్డు ప్రాజెక్టులతోపాటు జల విద్యుత్‌ ప్రాజెక్టులను చేపట్టడం వల్ల కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు ఈ ప్రాతంపై పట్టు సాధించారు. అవినీతి కారణంగా ఈ రెండు వర్గాల వారు కోట్లకు పడగలెత్తారు. వారే నేరుగా ఇక్కడ రాజకీయరంగంలోకి ప్రవేశించడంతో ఎన్నికలు మరింత ఖరీదయ్యాయి. 

సంస్కరణలకు కృషి
1990వ దశకంలో ఓటర్లలో చైతన్యం తీసుకరావడం కోసం ప్రముఖ సామాజిక కార్యకర్త జార్జుమ్‌ ఎటే అనే మహిళ తీవ్రంగా కృషి చేశారు. ఆమె ప్రజా వేదికలను పెట్టి డబ్బులు తీసుకొని ఓటు వేయడం ఎంతటి నీచమైన సంస్కారమో ఇటు ఓటర్లకు, అటు రాజకీయ నాయకులకు హితబోధ చేశారు. రాజకీయ నాయకులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఒకే వేదిక నుంచి వివిధ పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఉద్దేశించి మాట్లాడే వెసులుబాటును కూడా కల్పించారు. తన ప్రయత్నాలు ఫలించక పోవడంతో ఎటే 2001లో తన స్వచ్ఛంద సంస్థను రద్దు చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. ఈసారి పార్లమెంట్‌ టిక్కెట్‌ రాకపోవడంతో ఆమె మార్చి 15వ తేదీన కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. జనతాదళ్‌ (సెక్యులర్‌) పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున అరుణాచల్‌ వెస్ట్‌ లోక్‌సభ సీటుకు పోటీ చేస్తున్నారు. 

విద్యార్థి ఎన్నికలకు కోట్లే!
ఇక్కడ విద్యార్థి సంఘం ఎన్నికల్లో గెలవాలన్నా రెండు నుంచి మూడు కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుందని ‘అఖిల అరుణాచల్‌ ప్రదేశ్‌ విద్యార్థి సంఘం’ కార్యవర్గ సభ్యుడొకరు తెలియజేశారు. విద్యార్థులే నోట్లు తీసుకొని ఓట్లేసే సంస్కృతి ఉన్నప్పుడు గ్రామీణ ప్రజలు ఇంక ఎలా ఉంటారని ఓటర్లలో చైతన్యం తీసుకరావడానికి స్థానిక చర్చితో కలిసి కృషి చేస్తున్న సామాజిక కార్యకర్త టొకో టెకీ వ్యాఖ్యానించారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top