'చంద్ర'మామ వారి బేతాళ కథలు | Ap cm chandrababu once again plan to her strategy | Sakshi
Sakshi News home page

'చంద్ర'మామ వారి బేతాళ కథలు

Mar 15 2019 2:30 AM | Updated on Mar 23 2019 8:59 PM

Ap cm chandrababu once again plan to her strategy - Sakshi

పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టుపై నుంచిశవాన్ని దించి, భుజాన వేసుకుని ఎప్పటిలాగానే మౌనంగానడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు...’’అంటూ చందమామలోని బేతాళ కథల్లోవిక్రమార్కుడికి మౌనభంగంకలిగించడానికి శవంలోని బేతాళుడు కథలు చెప్పేవాడు. కానీ, నేటి మన బేతాళమాంత్రికుడు మాత్రం తన అధికార పీఠాన్ని కాపాడుకోడానికి, ప్రతిపక్ష నేతపైబురద జల్లడానికి మాత్రమే ఈ కథలు ఎల్లో మీడియా ద్వారా చెబుతాడు.చందమామలోని బేతాళుడు చెప్పిన కథను మళ్లీ చెప్పేవాడు కాదు. కానీ,‘చంద్ర’ బేతాళుడు ఎల్లో మీడియా ఆకారంలోకి ప్రవేశించి ఒక్కో కథను వందసార్లు చెబుతాడు.చీకటి పడగానే మళ్లీ ఎప్పటిలాగానే కరకట్టపై నిద్రపోతాడు.

సాక్షి, అమరావతి: ప్రజలకు ఇచ్చిన మాట కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్వశక్తిమంతురాలైన సోనియా గాంధీని ఎదిరించి కాంగ్రెస్‌ పార్టీని వీడినప్పటి నుంచి ఆయనను లక్ష్యంగా చేసుకున్నారు. జగన్‌ పట్ల విశేష ప్రజాదరణ వెల్లువెత్తుతుండటంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. దాంతో తన ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. వైఎస్‌ జగన్‌పై అక్రమ కేసులు బనాయించారు. అప్పట్లో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ కేంద్రంగానే ఈ కుట్రలు సాగించారు. కట్టుకథలు అల్లేశారు. ఒక్కో కథను వందసార్లు టీడీపీ ఎల్లో మీడియాలో ప్రచారంలోకి తీసుకొచ్చారు. చంద్రబాబు సూత్రధారిగా, ఆయనకు అనుకూలుడైన అప్పటి సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా(జేడీ)లక్ష్మీనారాయణ పాత్రధారిగా రాజకీయ కుతంత్రాన్ని నడిపారు. ప్రస్తుతం మళ్లీ ఎన్నికలు రావడంతో ఆ పాత కుట్రలకు తాజాగా మరింత పదును పెడుతున్నారు. నాలుగేళ్లపాటు బీజేపీతో అంటకాగి కేంద్ర దర్యాప్తు సంస్థల్లో జొప్పించిన తన అస్మదీయ అధికారులతో దుష్ప్రచార కుట్రను రచించారు. ఈడీ రెండేళ్ల క్రితం సీబీఐకి రాసిందంటూ ఓ లేఖ పేరుతో టీడీపీ మీడియా అసత్యాలు, అభూత కల్పనలతో జగన్‌పై తప్పుడు ప్రచారం చేయడం, మర్నాడు చంద్రబాబు అదే లేఖను ప్రస్తావిస్తూ జగన్‌పై విషం చిమ్మడం.. ఇలా తమ పన్నాగాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. పోలింగ్‌ వరకు నెలరోజుల పాటు ఈ డర్టీ స్టోరీలతో రాష్ట్రాన్ని హోరెత్తించాలన్నదే చంద్రబాబు అండ్‌ ఎల్లో గ్యాంగ్‌ సిండికేట్‌ కుతంత్రం.  

ఎల్లో మీడియాకు లక్ష్మీనారాయణ లీకులు  
చంద్రబాబు అల్లిన కట్టుకథల ఆధారంగానే అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ చార్జిషీట్లను రూపొందించేవారు. వాటినే మళ్లీ ఎల్లో మీడియా మహాప్రసాదంగా స్వీకరించి, ప్రచురించేది.. ప్రసా రం చేసేది. దర్యాప్తు అంశాలను అనధికారికంగా వెల్లడించకూడదన్న కేంద్ర హోం శాఖ నిబంధనలను కూడా బేఖాతర్‌ చేస్తూ లక్ష్మీ నారాయణ టీడీపీ మీడియాకు ఎప్పటికప్పుడు లీకులు ఇచ్చేవారు. ఆయన రోజూ చాలాసార్లు టీడీపీ మీడియా ప్రతినిధులతోమాట్లాడినట్లు కాల్‌డేటా వెల్లడైన సంగతి తెలిసిందే. జగన్‌పైదుష్ప్రచారాన్ని 2014 ఎన్నికల దాకా కొనసాగిస్తూ వచ్చారు.  

చంద్రబాబు అడ్డదారులు 
రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన నవ్యాంధ్ర కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ, గత ఐదేళ్లలోచంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అరాచక పాలనతో రాష్ట్రం నిర్వీర్యమైపోయింది. సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికొదిలేసిన టీడీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారు. ఓవైపు తెలుగుదేశం పార్టీని ప్రజలు చీకొడుతుండడం, మరోవైపు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారు. అందుకే ఆనాటి కుతంత్రాస్తాన్ని మరోసారి బయటకు తీశారు. ఇలాంటి అవసరం రావచ్చన్న ఉద్దేశంతోనే కేంద్రంలో బీజేపీతో అంటకాగుతున్న సమయంలోనే చంద్రబాబు ముందస్తుగానే తన అస్మదీయ అధికారులను కేంద్ర దర్యాప్తు సంస్థల్లో చేర్పించారు. కీలక దర్యాప్తు సంస్థల్లో తమ వారిని నింపుకోవడానికి ప్రాధాన్యమిచ్చి, రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేశారు. మరోవైపు గతంలో సీబీఐలో ఉంటూ తనకు సహకరించిన లక్ష్మీనారాయణను గుప్పిట్లో పెట్టుకున్నారు. చంద్రబాబు వ్యూహంలోనే భాగంగానే లక్ష్మీనారాయణ కొన్నేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి తటస్థుడి ముసుగులో రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. సీబీఐకి ఈడీ రెండేళ్ల క్రితం రాసిందంటూ ఓ లేఖను తన అనుకూల మీడియా ద్వారా చంద్రబాబు మంగళవారం రాత్రి ప్రచారంలోకి తెచ్చారు. వైఎస్‌ జగన్‌పై విషం చిమ్మడమే లక్ష్యంగా టీడీపీ మీడియా ఆ కట్టుకథను తమ పత్రికల్లో బుధవారం బ్యానర్‌ కథనాలుగా ప్రచురించి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. టీడీపీ అనుకూల టీవీ ఛానళ్లు కూడా నానా యాగీ చేశాయి. అంతటితో చంద్రబాబు ఆగలేదు. ఎందుకంటే ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఇంకా ధైర్యం రాలేదు. దాంతో బుధవారం ఆయనే స్వయంగా తెరపైకి వచ్చారు. మీడియా సమావేశం పెట్టి గంటల తరబడి తీరుబడిగా అదే కట్టుకథను మళ్లీ వినిపించారు. దాంతో టీడీపీ అనుకూల పత్రికలు మళ్లీ అదే అభూతకల్పనను గురువారం బ్యానర్లుగా ప్రచురించి హడావుడి చేశాయి. టీడీపీ టీవీ చానళ్లు మళ్లీ అదే పైత్యాన్ని పదేపదే చూపించాయి.  
 
పస లేని ఆరోపణలు.. అర్థం లేని రాద్ధాంతం  
అసలు చంద్రబాబు గానీ, టీడీపీ మీడియా గానీ ప్రసారం చేసి రాద్ధాంతం చేసిన దాంట్లో ఏమైనా పస ఉందా? అంటే ఏమీ లేదు. చంద్రబాబు చేసిన ఆరోపణల్లో నిజం అంతకన్నా లేదు. ఈడీ ఎప్పుడో 2017లో సీబీఐకి ఓ లేఖ రాసిందట! ఆ లేఖను చూపించి ప్రధాని మోదీ వైఎస్‌ జగన్‌ను బ్లాక్‌మెయిల్‌ చేశారట! జగన్‌ లొంగిపోవడంతో ప్రధాని మోదీ ఒత్తిడితో ఆ లేఖను సీబీఐ తొక్కి పెట్టిందట! ఇదీ చంద్రబాబు అండ్‌ కో అల్లిన కొత్తకథ. అసలు 2017లో ఈడీ లేఖ రాస్తే ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముందే ఎందుకు బయటకు వచ్చింది!? ఆ లేఖలో ఉన్న అంశాలకూ, జగన్‌కు ఏం సంబంధం ఉంది!? అసలు హిందూజా సంస్థతో జగన్‌కు ఉన్న సంబంధం ఏమిటి!? హిందూజా సంస్థకు విశాఖపట్నంలో అప్పనంగా ప్రాజెక్టు కట్టబెట్టింది చంద్రబాబు ప్రభుత్వమే కదా! వాస్తవాలు ఇలా ఉంటే అందుకు విరద్ధంగా చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా వైఎస్‌ జగన్‌పై విషం చిమ్మడం విడ్డూరంగా ఉంది. ఈడీ రాసినట్లుగా చెబుతున్న ఆ లేఖను సరిగ్గా ఎన్నికల ముందే లక్ష్మీనారాయణ సీబీఐలోని తన సన్నిహితుల ద్వారా బయటకు తెచ్చారా? ఈడీలో ఉన్న చంద్రబాబు సన్నిహితుల హస్తం ఉందా? అన్నది కీలకంగా మారింది. అంటే సీబీఐ, ఈడీలలో చంద్రబాబు అనుకూల అధికారులు ఉన్నారని స్పష్టమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వారు చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని తేటతెల్లమవుతోంది. సీబీఐ, ఈడీలలో చంద్రబాబు అనుకూల అధికారులు ఉన్నారని వైఎస్‌ జగన్‌ గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు వాస్తవమేనని తాజా ఉదంతం నిరూపిస్తోంది. ఈడీ, సీబీఐలలో చంద్రబాబు కోవర్ట్‌ బ్యాచ్‌ ఉంటే ఆ సంస్థల పనితీరు పారదర్శకంగా> ఉంటుందని ఎలా నమ్మగలం?  
 
గోబెల్స్‌ను మించిపోయిన చంద్రబాబు  

తప్పుడు ప్రచారంతో ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు అనాటి గోబెల్స్‌ను మించిపోయారు. వైఎస్‌ జగన్‌ ఆస్తుల గురించి గానీ, మోదీతో సంబంధాలున్నాయనే అంశాల్లో గానీ చంద్రబాబు ఆరోపణలన్నీ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు చేసినవే. ఆయన ఆరోపణలు, వినిపించిన కట్టుకథలు పరస్పర విరుద్ధంగా ఉండటమే ఇందుకు నిదర్శనం.  

►వైఎస్‌ జగన్‌ రూ.లక్ష కోట్లు అక్రమంగా ఆర్జించారని చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా గతంలో పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది. ఎలాంటి ఆధారాల్లేని ఆ ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. పోనీ చంద్రబాబు ఆ అబద్ధపు ఆరోపణలకు కట్టుబడ్డారా అంటే అదీ లేదు. తాజాగా బుధవారం ఆయన మీడియాతో మాట్టాడుతూ జగన్‌ రూ.48 వేల కోట్లు అక్రమంగా ఆర్జించారని అన్నారు. రానున్న ఎన్నికల కోసం జగన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.వెయ్యి కోట్లు ఇస్తున్నారని ఆరోపించారు. జగన్‌ వద్ద రూ.లక్ష కోట్లో, రూ.48 వేల కోట్లో నిజంగా ఉంటే ఎన్నికల వ్యయం కోసం కేసీఆర్‌ నుంచి రూ.వెయ్యి కోట్లు ఎందుకు తీసుకుంటారు? రోజుకో రీతిలో అసత్య ఆరోపణలు చేయడమే చంద్రబాబు అసలు లక్ష్యం. ఏపీ ఎన్నికలకు, కేసీఆర్‌కు ఏం సంబంధం? అందులోనూ వైఎస్సార్‌సీపీకి కేసీఆర్‌తో ఏం సంబంధం? కానీ, వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్‌ ఒకటేనని అబద్ధపు ప్రచారం చేయడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించాలన్నదే చంద్రబాబు పన్నాగం.    

►ఇక నరేంద్ర మోదీకి జగన్‌ లొంగిపోయారని చంద్రబాబు మరో కహానీ వినిపిస్తున్నారు. సీబీఐ కొన్ని నెలల క్రితమే వైఎస్‌ జగన్‌ సతీమణి భారతి పేరును కూడా కేసుల్లో చేర్చింది. అమెకు నోటీసులు జారీ చేసింది. ఆ విషయాన్ని టీడీపీ అనుకూల పత్రికలు కూడా ప్రచురించాయి. మరి జగన్‌ లొంగిపోవడంతో మోదీ ఆయనపై కేసులను తొక్కిపెడితే.. వైఎస్‌ భారతికి ఎందుకు నోటీసులు వస్తాయి?  
 
ఈ నెల రోజులూ బేతాళ ఆపరేషనే  

అసత్య ఆరోపణలు, అవాస్తవ ప్రచారాలు, రాజకీయ కుతంత్రంతోనే ఎన్నికలను ఎదుర్కోవాలని చంద్రబాబు నిర్ణయించారు. అందుకే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దుష్ప్రచారం కోసం తాజాగా అల్లిన కట్టుకథను ఈ నాలుగు వారాలపాటు విస్తృతంగా ప్రచారం చేయాలని కుయుక్తులు పన్నారు. అదే అభూత కల్పనను పోలింగ్‌ ముగిసే దాకా రోజుకో రీతిలో టీడీపీ అనుకూల మీడియాలో ప్రచురించాలని, టీవీ చానళ్లలో పదేపదే ప్రసారం చేయాలని చంద్రబాబు అండ్‌ కో ఉమ్మడిగా నిర్ణయానికొచ్చాయి.   

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై మళ్లీ మొదలైన దుష్ప్రచారం
►జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక కట్టుకథలను సృష్టించిన చంద్రబాబు  
►అవే కథలను వందల సార్లు వండివార్చిన ఎల్లో మీడియా  
►ఎన్నికల సమీపిస్తుండడంతో పాత కుట్రలకు మరోసారి పదును  
►సీబీఐకి ఈడీ లేఖ రాసినట్టుగా చెబుతున్న లేఖ సరిగ్గా ఎన్నికల ముందే ప్రత్యక్షం  
►బాబు గుప్పిట్లోని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అండతో కుతంత్రం  
►కేంద్ర దర్యాప్తు సంస్థల్లోని చంద్రబాబు కోవర్టు అధికారుల సహకారం  
►అసత్యాలు, అభూత కల్పనలతో ప్రజలను ఏమార్చేందుకు ఎత్తుగడ  
►ఎన్నికలయ్యేదాకా కట్టుకథలను ప్రచారం చేయాలని బాబు, ఎల్లో సిండికేట్‌ నిర్ణయం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement