పోలీసు శాఖ పనితీరుపై వైఎస్ జగన్ ఆగ్రహం | YSRCP Chief YS Jagan Expresses Anger Over AP Police Performance | Sakshi
Sakshi News home page

పోలీసు శాఖ పనితీరుపై వైఎస్ జగన్ ఆగ్రహం

Mar 26 2026 9:44 PM | Updated on Mar 27 2026 11:50 AM

YSRCP Chief YS Jagan Expresses Anger Over AP Police Performance

తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్‌ శాఖ పనితీరుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఏపీలో నో పోలీస్‌, నో పోలీస్‌, నో పోలీస్‌ అంటూ ధ్వజమెత్తారు వైఎస్‌ జగన్‌.  కేవలం కాగితాలపై మాత్రమే పోలీసులు కనిపిస్తున్నారని, సహాయం కోసం ఎవరైనా పోలీస్‌ సాయం కోరినప్పుడు మాత్రం పోలీసులే కనిపించడం లేదన్నారు. ఈ మేరకు హలో ఇండియా ఒకసారి ఏపీ వైపు చూడండి అంటూ ట్వీట్‌ చేశారు వైఎస్‌ జగన్‌. 

జంగిల్‌  రాజ్‌గా మారిపోయింది..
‘ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు  జంగిల్ రాజ్‌గా మారిపోయింది. కాగితాలపై మాత్రమే పోలీసులు కనిపిస్తున్నారు. కానీ గిరిజనులు, మహిళలు, పేదలు సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నప్పుడు, వారు సహాయంకోసం అర్థిస్తున్నప్పుడు పోలీసులు కనిపించడంలేదు. మరోవైపు నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ నంబర్లు కూడా స్పందించడం లేదు. ఫలితంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ అధికారంలో ఉన్నవారు ప్రజల భద్రతను గాలికి వదిలేసి..అవినీతి, రాజకీయ ప్రయోజనాలు, ప్రచార స్టంట్లపై దృష్టి పెడుతున్నారు’ అని మండిపడ్డారు.

17 ఏళ్ల బాలిక బలైపోయింది..
‘17 ఏళ్ల నిరుపేద గిరిజన బాలిక బలయిపోయింది.  చదువులు చెప్తామని ఆమెను తీసుకువెళ్లి దారుణానికి పాల్పడ్డారు. మార్చి 22న శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో ఒక సివిల్ ఇంజనీర్ ఆమె కుటుంబానికి మాటలు చెప్పి..ట్యూషన్ చెప్తానని నమ్మబలికాడు. ఆ తర్వాత మార్చి 23న విశాఖపట్నంలో ఆమెపై పలు మార్లు లైంగిక దాడి జరిగినట్లు మీడియా కథనాల్లో  వచ్చింది. మార్చి 24న, ఆ బాలిక మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రుల ఇంటికి డోర్‌ డెలివరీ చేశారు. 

ఇది కేవలం క్రూరత్వం మాత్రమే కాదు, వ్యవస్థల వైఫల్యాన్ని సూచిస్తోంది. ఈ ఘటనను మూసివేసేందుకు, తీవ్రత తగ్గించి చూపించేందుకు బాధిత కుటుంబంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఘటన విషయం తెలిసినా పోలీసులు సరిగా స్పందించలేదు. హడావిడిగా శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించి, అంత్యక్రియలు జరిపించేశారు. ఇప్పటివరకు ఎటువంటి చర్యా లేదు, ఎటువంటి అరెస్టు లేదు’ అని పోలీసులను తీరును తీవ్రంగా తప్పుబట్టారు వైఎస్‌ జగన్‌

మరో భయానక వైఫల్యం.. 
‘ఈరోజు మార్కాపురంలో జరిగిన బస్సు అగ్నిప్రమాదం ఘటన ప్రభుత్వ యంత్రాంగంలో మరో భయానక వైఫల్యాన్ని బయటపెట్టింది. అనేకసార్లు పోలీస్ ఎమర్జెన్సీ నంబర్‌ 100 కు కాల్ చేసినా స్పందన లేదు.  108 అంబులెన్స్ కూడా స్పందించలేదు. మా గోడు ఎవరూ వినిపించుకోలేదంటూ బాధితులు చెప్తున్నారు. 

సమయానికి సహాయం అందక 14 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పందించాల్సిన వ్యవస్థలు స్పందించలేదు. చంద్రబాబు ప్రభుత్వంలో పీఆర్ స్టంట్స్ తప్ప పరిపాలన చేయటం లేదని మరోసారి తేలిపోయింది. “రెడ్ బుక్” పాలనలో పోలీసులు అచేతనంగా మారిపోయారు. రక్షణ లేక ప్రజలు బాధలు పడుతున్నారు. రాష్ట్రంలోని ఉన్న వాస్తవిక పరిస్థితి ఇదే’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement