
ఎమర్జెన్సీ చీకటిరోజులను గుర్తుచేసిన అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ : ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి ఈరోజుతో 45 సంవత్సరాలు పూర్తయిన క్రమంలో కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఇప్పటికీ ఎమర్జెన్సీ రోజుల తరహా మనస్తత్వానే కలిగిఉందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రతినిధి సంజయ్ ఝా తొలగింపు వంటి ఘటనలు దీనికి సంకేతమని అన్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో సీనియర్ సభ్యులు, యువ సభ్యులు కొన్ని అంశాలు లేవనెత్తగా వారి గొంతు నొక్కారని, పార్టీ ప్రతినిధి ఒకరిపై అనవసరంగా వేటువేశారని కాంగ్రెస్ పార్టీలో నేతలు ఇమడలేకపోతున్నారని ధ్వజమెత్తారు.
విపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ తనకు తాను కొన్ని ప్రశ్నలు వేసుకోవాలని అన్నారు. ఎమర్జెన్సీ తరహా మనస‍్తత్వం ఇంకా పార్టీలో ఎందుకు కొనసాగుతోందని, పార్టీలో ఇతర నేతలను ఎందుకు మాట్లాడనివ్వడం లేదని ప్రశ్నించుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీలో నేతలు ఎందుకు ఇమడలేకపోతున్నారనేది తెలుసుకోవాలని సూచించారు. 45 ఏళ్ల కిందట దేశం ఇదే రోజున (జూన్ 25) ఓ కుటుంబం అధికార దాహంతో రెండేళ్ల పాటు దేశం ఎమర్జెన్సీలోకి వెళ్లిందని రాత్రికి రాత్రే దేశం జైలుగా మారిందని పేదలు, అణగారిన వర్గాల వారిపై వేధింపులు సాగాయని అమిత్ షా గుర్తుచేశారు.
లక్షలాది ప్రజల ఆందోళనలతో ఎమర్జెన్సీని ఎత్తివేయడంతో భారత్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిందని అన్నారు. కాంగ్రెస్‌లో మాత్రం ప్రజాస్వామ్యం లోపించిందని విమర్శించారు. పార్టీ, దేశ ప్రయోజనాల కంటే ఓ కుటుంబ ప్రయోజనాలే అధికమయ్యాయని ఇప్పటికీ కాంగ్రెస్‌లో పరిస్థితి అలాగే ఉండటం బాధాకరమని అమిత్ షా వ్యాఖ్యానించారు.