‘కిషోర్‌ హత్యకు చంద్రబాబు సమాధానం చెప్పాలి’

Alla Nani Questioned Chandrababu Over YSRCP Activist Murder Case - Sakshi

సాక్షి, భీమడోలు(పశ్చిమగోదావరి జిల్లా) : టీడీపీ నేతలు దాడులు ఆపకపోతే చట్టపరమైన చర్యలతోపాటు ప్రజలే ఎదురు తిరిగి దాడులకు పాల్పడతారని డిప్యూటీ సీఎం ఆళ్లనాని హెచ్చరించారు. భీమడోలు మండలం అంబరుపేట గ్రామంలో శుక్రవారం టీడీపీ కార్యకర్తల దాడిలో మృతిచెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త పసుమర్తి వెంకట కిషోర్‌ కుటుంబ సభ్యులను ఆళ్లనాని, ఉంగుంటూరు ఎమ్మెల్యే ఉప్పల వాసుబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి మాట్లాడుతూ.. వెంకట కిషోర్‌ సాగు చేసుకుంటున్న​ భూమికి మాజీ శాసనసభ్యుడు గన్ని వీరాంజనేయులు సోదరుడు గోపాలానికి ఎలాంటి సంబంధం లేదని, అయినప్పటికీ భూమిని కాజేయడం కోసం ఇలాంటి హత్య రాజకీయాలు చేయడం దారుణమన్నారు. 

గత అయిదేళ్లలో టీడీపీ నేతలు ఏ విధంగా దాడులకు పాల్పడ్డారో అందరికీ తెలుసని, ప్రస్తుతం అధికారం కోల్పోయినా దాడులు మాత్రం ఆపడం లేదని మండిపడ్డారు. ఈ ఘటనలో తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారని, తొమ్మిదో వ్యక్తి గన్ని గోపాలం పరారీలో ఉన్నాడని పేర్కొ​న్నారు. మృతుడు కిషోర్‌ కుటుంబానికి న్యాయం చేస్తామని, ఈ ఘటనను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ హత్యకు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని మంత్రి ఆళ్ల నాని డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్యే ఉప్పల వాసుబాబు మాట్లాడుతూ.. ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. దోషులకు చట్టరీత్యా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మృతుడు కిషోర్‌ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. పచ్చని పశ్చిమగోదావరి జిల్లాలో కావాలనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. అధికారం కోల్పోయినా టీడీపీ నేతలు దాడులు కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. (సంబంధిత వార్త: వైఎస్సార్‌సీపీ నేత దారుణహత్య)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top