నల్గొండ: జిల్లాకు రాహుల్‌ గాంధీ

AICC Chief Rahul Gandhi Visit To  Nalgonda Constituency - Sakshi

సాక్షి, నల్లగొండ : నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గంలో తన పట్టును నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. గత డిసెంబర్‌లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో చేదు ఫలితాలు ఎదురైనా పార్లమెంట్‌ నియోజకవర్గంలో విజయం సాధించడం ద్వారా పార్టీ కేడర్‌లో విశ్వాసాన్ని నింపే పనిలో పడింది. ఈ కారణంగానే తెలంగాణ ప్రదేశ్‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని నల్లగొండ లోక్‌సభా స్థానంలో బరిలోకి దించింది. ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక పర్యాయాలు గెలిచిన రికార్డున్న కాంగ్రెస్‌ ఆ సంప్రదాయాన్ని కొనసాగించేలా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టింది. ఈ ఎన్నికలను సవాలుగా తీసుకున్న కాంగ్రెస్‌ నాయకత్వం విజయం కోసం అన్ని రకాలుగా శక్తులను ఒడ్డుతోంది.

దీనిలో భాగంగానే కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ జిల్లాలో ప్రచారానికి వస్తున్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన టీ పీసీసీ అధ్యక్షుడు పోటీ చేస్తున్న నియోజకవర్గాన్ని కీలకంగా భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్‌ ఒకటో తేదీన హుజూర్‌నగర్‌ నియోజకవర్గ కేంద్రంలో రాహుల్‌ గాంధీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ స్థానంలో ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ సెగ్మెంటు నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోనే ఉండడం, సభను విజయవంతం చేయడం కోసం ఎక్కువ మందిని సమీకరించే అవకాశం ఉండడం వంటి కారణాల నేపథ్యంలో రాహుల్‌ బహిరంగ సభను హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి సరిహద్దుగా సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడెం నియోజకవర్గాలు ఉండడంతో ఇక్కడి నుంచి కూడా జన సమీకరణకు వెసులుబాటు ఉంటుందని అంటున్నారు.

నియోజకవర్గాల వారీగా ప్రచారం
మరో వైపు నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం చేస్తున్నారు. ప్రతీ  గ్రామంలో ప్రచారం కాకుండా తక్కువగా ఉన్న ప్రచార సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మండల కేంద్రాల్లో పార్టీ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొంటూ ప్రచారం కొనసాగిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు చోట్ల గెలిచిన కాంగ్రెస్, లోక్‌సభ నియోజకవర్గాన్ని కూడా 1.93లక్షల మెజారిటీతో కైవసం చేసుకుంది.

కానీ 2018 ముందస్తు ఎన్నికల్లో ఆరుచోట్ల ఓడిపోయి, కేవలం ఒక్క చోటనే విజయం సాధించింది. ఆరుచోట్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు వచ్చిన మెజారిటీ ఒక లక్ష ఓట్లు. దీంతో మరో 93వేల ఓట్లు తమ బ్యాంకుగానే ఉన్నాయని, కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తోంది. ఈ గణాంకాలను పరిగణలోకి తీసుకుని నియోజకవర్గాల వారీగా ఓటు శాతంపై అంచనాలతో ముందుకు వెళుతున్నారని చెబుతున్నారు. అయితే, మరో వైపు అధికార టీఆర్‌ఎస్‌ మొదటి సారి నల్లగొండ లోక్‌సభా నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగురవేసేందుకు దూసుకుపోతోంది. ఇరు పార్టీలూ తమ విజయాన్ని సవాలుగా తీసుకుని ప్రచారం చేస్తుండడంతో పోటీ హోరాహోరీగా సాగుతోంది. ఈనెల 29వ తేదీన మిర్యాలగూడెంలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రచార బహిరంగ సభ ఉండగా, వచ్చే నెల ఒకటో తేదీన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎన్నికల బహిరంగ సభ హుజూర్‌నగర్‌లో జరగనుంది.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top