‘‘అప్పువడ్డ భరతావని’’ తన అప్పు తీర్చేదెప్పుడు?

‘‘అప్పువడ్డ భరతావని’’ తన అప్పు తీర్చేదెప్పుడు?


అస్పృశ్యతను జీవితాంతం ప్రతిఘటించి దానిని పద్యకవిత్వంలో మహత్తరంగా వ్యక్తీకరించిన తొలి మహాకవి గుర్రం జాషువా. అసమ సమాజాన్ని సంస్కరణ దృక్పథంతో తీవ్రంగా నిరసించిన జాషువా  భారతీయ భాషల్లో అస్పృశ్యతపై తిరుగుబాటు లేవదీసిన తొలి కవిగా గుర్తింపు పొందారు. ఉదాహరణకు ఈ పద్యపాదాన్ని చూడండి.  ‘‘వాని తలమీద బులిమిన పంకిలమును/ గడిగి కరుణింపలేదయ్యె గగనగంగ  వాని నైవేద్యమున నంటుపడిన నాడు / మూడు మూర్తుల కును గూడ గూడులేదు’’.అంటరానితనాన్ని కడిగేయడం పౌరుల బాధ్యతేకాని గగన గంగల పని కాదని ఇప్పటికైనా మన సమాజం కళ్లు తెరచుకొనకపోతే అది క్షంతవ్యం కాని నేరమన్నారు జాషువా. మురికి కంపు, చీకటి కోణాలతో నిండిన దేశంలో భగభగ మండే మానవతా కిరణాలతో ఉదయించిన సూర్యుడే ‘విశ్వనరుడు’ జాషువా మహాకవి. ‘ఇది మానవజాతేనా? మనుషులు తమ తోటి మనుషుల పట్ల ఇంత పైశాచికంగా ప్రవర్తిస్తారా? ఆలోచన చేయగల కనీస జ్ఞానం కూడా ఈ జాతికి లేదా?’’ అనే ప్రశ్నలు కవి గుండెను తూట్లుపొడవగా ధారకట్టిన రక్తం కలం నుండి అక్షరాల్లో ఉప్పొంగింది;

 

 ‘జనులంబీలిచి పిప్పిజేసెడు దురాచారంబులన్ గాలమ

 ట్టని విద్యాబలమేల? విద్యయన మౌఢ్యవ్యాఘ్రికింపైన ‘భో’

 జనమా, మోసపు వ్రాతకోతలకు రక్షా బంధమా, యెందుకీ

 మనుజత్వంబు నొసంగలేని చదువుల్ మైరేయపున్ మైకముల్’

 

 ఇవీ ప్రశ్నలు! ‘జనులను పీల్చి పిప్పిచేసే దురాచారాలను కాల్చ లేని విద్యాబలమెందుకు? ఆచారానికి, దురా చారానికి తేడా ఉంది కదా! విద్య, దాని బలం సొంతం చేసుకున్నవాళ్లున్న దేశంలో ‘దురాచా రాలు’ ఇష్టారాజ్యంగా ప్రబలిపోవడం విద్యా వంతులకే అవమానం. మనిషి హృదయంలో, మానవతను ప్రోది చేయలేనిది ‘విద్య’ కానే కాదు. అది అజ్ఞాన మహా శిఖరం! అందుకే జాషువా కవి కలం వాపోయింది;

 

 ‘‘... ముప్పదినూర్ల కులాలవారికిన్ నందుల నాగులం గొలిచి నవ్వులపాలగుచున్న జాతికిన్’’ అంటూ ఒకే జాతిగా మనుగడ సాగించవలసిన ప్రజలు, వేల కులాలుగా ముక్కలవ డమేగాక, జంతువులను, విష పురుగులను పూజించి, ప్రపంచ ప్రజల ముందు నవ్వులపాలవుతున్నారే అన్న వేదన జాషువా కవి కలాన్ని నిద్రపోనివ్వలేదు. మనుషులు కలసిమెలసి జీవించడం కాకుండా కొం దరిని అమానుషంగా అణచివేయడం, దానికి మతాన్ని పునాదిగా చేయడం, దేవుడు అనే వ్యవస్థను కాపలా పెట్టడం ఒక ప్రణాళికా బద్ధమైన దారుణ కుట్రగా కవి దాన్ని చీల్చిచెండాడారు.

 

 కులవ్యవస్థ సమాజంలోని ఒక వర్గం ప్రజలను బానిసలుగా, హీనులుగా చేసి, అంటరానివారనే ముద్రవేసి, వారిని ఊరివెలుపలకు నెట్టివేసిన వైనాన్ని కవి జీర్ణించుకోలేకపోయారు. ఒక ఆశ్చర్యమూ, ఒక విషాదమూ ఏంటంటే - జాషువా కాలం నాటికీ, నేటికీ సమాజంలోగానీ, సామాజ కాలంలోగానీ పెద్ద మార్పేమీ లేకపోవడం.

 మనుషుల్లో అత్యున్నత మానవతా విలువలను, పెంచాల్సిన మతం..అది సృష్టించిన కులం, కొన్ని తరాల పౌరులను తాము మను షులన్న స్పృహ లేకుండా నడిచే శవాలను, జీవచ్ఛవాలను చేసింది.

 ‘కనుపడలేదు సత్కులము కన్న పిశాచము భారతంబునన్  కనపడలేదు పంచముని కన్నను నీచపు జంతువేదియున్.’’ ప్రపంచంలో జంతువులను అత్యధికంగా ప్రేమించే వాళ్లున్నారు గానీ, మనుషులను ఇంతగా హీనపరిచిన జాతి ఎక్కడాలేదేమో!

 

 ‘ముప్పు ఘటించి వీనికులమున్, గలిమిన్ గబళించి బిప్పియొ నర్చునీ భరత్‌వీరుని పాదము కందకుండగా  జెప్పులుగుట్టి జీవన ముసేయునుగాని నిరాకరింపలే  దేవుడు నప్పువడ్డది సుమీ, భరతా వనని వీని సేవకున్!’’ అప్పుపడ్డవాళ్లు అప్పు తీర్చక తప్పదు కదా! భరతావని తన నేలపై అడుగిడిన తొలి పౌరుని సేవలకు, జీవితానికి పడిన అప్పు తీర్చాలి. త్వరలోనే .. ఇది జాషువా కవి ఆన ! నెరవేర్చాల్సిన ధర్మ సూత్రం! విశ్వనరుని’ వేదనల రోషం ఈ జాతిని మేల్కొల్పాలి!  ‘వాడి తలపై నీ కాళ్లున్నందుకు సిగ్గుపడు  సిగ్గుపడడమే విప్లవం! (కారల్ మార్క్స్)  కులం మురికే / దేశం నిండా  గుండెల ప్రక్షాళనమే / స్వచ్ఛ భారత్  నిచ్చెనమెట్లు / లేని  భారతం  కోట్ల పాలపుంతలు / ఇలకు దిగిన కాంతివనం!

 (నేడు జాషువా జయంతి సందర్భంగా)

 - ఝాన్సీ కె.వి.కుమారి  హైదరాబాద్

 మొబైల్: 9010823014

Back to Top