తెగనున్న మూడో ‘ముడి’?

తెగనున్న మూడో ‘ముడి’? - Sakshi


రాజధాని పేరిట భూములు తీసుకుని రైతులకూ, రోడ్ల వెడల్పు పేరుతో శ్మశానాలను తీసుకుని ఆత్మలకూ, కృష్ణా పుష్కరాల పేరిట గుడులను కూల్చి దేవుళ్లకూ అన్యాయం చేస్త్తున్నా చూస్తూ ఊరుకోలేమని బీజేపీ నేతలు అంటున్నారు. కేంద్ర నిధులను మళ్లించి, లెక్కలు చెప్పకపోగా కేంద్ర సహాయం అందడం లేదన్నట్టు మాట్లాడటాన్ని బీజేపీ జీర్ణించుకోలేక పోతున్నది. పైగా దక్షిణాదిన సొంత బలం పెంచుకోవాలన్న లక్ష్యం కూడా బీజేపీకి ఉంది. కాబట్టి బీజేపీ, టీడీపీల దోస్తీ అప్పుడో ఇప్పుడో కటీఫ్ కాక తప్పదని పరిశీలకుల భావన.

 

 రెండేళ్ల క్రితం రాష్ర్ట విభజన అనంతరం మూడోసారి స్నేహితులైన తెలుగు దేశం భారతీయ జనతా పార్టీల బంధం ఇక ఎక్కువ కాలం నిలిచేట్టు కనిపిం చడం లేదు. కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్‌లో కలిసి అధికారం పంచుకుంటున్న ఈ రెండు పార్టీలకూ ఈ మధ్య అస్సలు పొసగటం లేదు. గత వారం ఏపీ బీజేపీ నాయకులు జరిపిన ఢిల్లీ పర్యటన మీద ఆ పార్టీకి చెందిన ఒక యువనాయ కుడు... మా రెండు పార్టీల మధ్య తీవ్ర విభేదాలున్నాయి, అయితే అవి నివు రుగప్పిన నిప్పులా ఉన్నాయి. త్వరలోనే బయట పడటం ఖాయం అని వ్యాఖ్యానించడాన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గతంలో ఎన్టీ రామారావు హయాంలోనూ, ఆ తరువాత చంద్రబాబు నాయుడు హయాం లోనూ ఈ రెండు పార్టీలు కలిసి పనిచేశాయి. అయితే గతంలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో ఈ మూడోసారి సంబంధాలకు విఘాతం కలిగిం దనీ, రెండేళ్లలోనే ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం చంద్రబాబేననీ చాలామంది బీజేపీ నాయకులు బాహాటంగానే వ్యాఖ్యానిస్త్తున్నారు.

 

 తలబరువు ‘బంధం’

 గతంలో బీజేపీ ఎన్టీఆర్ హయాంలోనూ, ఆ తరువాత చంద్రబాబు హయాం లోనూ టీడీపీతో స్నేహం చేసింది. అయితే అప్పట్లో పార్టీకి వాజపేయి, అద్వానీలు నాయకత్వం వహిస్తుండటంవల్ల, పార్టీ అంత బలంగా లేకపోవ డంవల్ల టీడీపీతో సర్దుకుపోయే రీతిలో వ్యవహరించాం, ఇప్పుడు నరేంద్ర మోదీ, అమిత్ షా నాయకత్వంలో ఎవరి మద్దతూ అవసరం లేనంత బలంగా, పటిష్టంగా ముందుకు పోతున్నాం, ఒక ప్రాంతీయ పార్టీకి లొంగి ఉండాల్సిన అవసరం మాకు లేదని బీజేపీ నేతల వాదన. అంతేకాదు, 1999లో, 2014లో మా కారణంగా టీడీపీ అధికారంలోకి వచ్చిందే తప్ప, చంద్రబాబు వల్ల మేం లాభపడింది ఏమీ లేదని వారి భావన. గతంలో చంద్రబాబు రాష్ట్ర బీజేపీని ఖాతరు చెయ్యకుండా నేరుగా కేంద్ర నే తలతో వ్యవహారం నడిపినట్టే ఇప్పుడు కూడా చెయ్యడం కుదరదన్నది ప్రస్తుత బీజేపీ రాష్ట్ర నేతల వాదన.

 

 అందుకే మొన్నటి ఢిల్లీ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తాము నిర్ణయించిన నాయకులతో తప్ప చంద్రబాబు తనకు ఇష్టమైన వారితో మాట్లాడటానికి వీలు లేదని స్పష్టంగా చెప్పినట్టు వార్తలు వచ్చాయి. టీడీపీ, బీజేపీల మధ్య సమన్వయం కోసం వేసిన కమిటీ మొక్కుబడిగా ఒక్కసారే సమావేశం కావడం పట్ల కూడా బీజేపీ జాతీయ నాయకత్వం  అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు కూడా వార్తలొచ్చాయి. చంద్ర బాబు నమ్మదగ్గ మిత్రుడేమీ కాదన్న విషయం కొత్తేమీ కాదు, పైగా దక్షిణా దిన స్వంత బలం పెంచుకోవాలన్న లక్ష్యం కూడా బీజేపీకి ఉంది. కాబట్టి ఆ రెండు పార్టీల మధ్య దోస్తీ అప్పుడో ఇప్పుడో కటీఫ్ కాక తప్పదని పరిశీలకుల అభిప్రాయం.

 

 భారీ మూల్యం చెల్లించక తప్పదు


 గత రెండేళ్ళుగా టీడీపీ అధినేత వ్యవహార శైలి మింగుడు పడకపోయినా, అనేక సందర్భాలలో ఆయన తమకు నష్టం జరిగే విధంగా వ్యవహరిస్తున్నా మిత్ర ధర్మంలో భాగంగా  బీజేపీ నాయకులు కిక్కురుమనకుండా ఉన్నారు. కానీ తాజాగా జరిగిన దేవాలయాల కూల్చివేత వ్యవహారంతో ఇంకా మిన్నకుంటే అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఉందని గుర్తించారు. కాబట్టే మొన్నటి ఢిల్లీ సమావేశంలో కొన్ని కఠిన నిర్ణయాలే తీసుకున్నట్ట్టు వార్తలొ చ్చాయి. చంద్రబాబు  రాజధానిని నిర్మిస్తానని భూములు తీసుకుని రైతు లకూ, రోడ్ల వెడల్పు పేరుతో శ్మశానాలను తీసుకుని ఆత్మలకూ, చివరకు కృష్ణా పుష్కరాల పేరు చెప్పి గుడులను కూల్చి దేవుళ్లకూ అన్యాయం చేస్త్తున్నా చూస్తూ ఊరుకోలేమని బీజేపీ నేతలు బాహాటంగానే చెపుతున్నారు. దొడ్డి దారిన ఎన్నికల ముందు బీజేపీలో చేరి టికెట్ సంపాదించి గెలిచి మంత్రి వర్గంలో చేరిన ఒక నాయకుడు, మరికొద్దిమందిని మినహాయిస్తే బీజేపీ నేతలు చాలా వరకు టీడీపీ ప్రభుత్వంతో స్నేహం కొనసాగించడం వల్ల రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని మధనపడు తున్నారు.

 

 బీజేపీ హిందుత్వ ఆధారంగానే రాజకీయాలు నడుపుతున్న పార్టీ. అటువంటి పార్టీ తాను భాగస్వామిగా ఉన్న ప్రభుత్వమే రోడ్లు వెడల్పు చేసే నెపంతో గుళ్లు కూల్చెయ్యడాన్ని జీర్ణించుకోలేకపోతున్నది. ఏపీ దేవాదాయ శాఖామంత్రి, బీజేపీ నేత పీ కొండల మాణిక్యాలరావుకు ఈ విషయం గురించి కనీస సమాచారం కూడా అందించకపోవడం గమనార్హం. కృష్ణా పుష్కరాల కోసం అన్న కారణంతో అధికారులే నేరుగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హఠాత్తుగా రాత్రికి రాత్రి గుళ్లను కూల్చేయడాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నది. ఒక పార్లమెంట్ సభ్యుడు, ఒక శాసన మండలి సభ్యుడి కోసం ఇదంతా జరిగిందన్న విషయం బీజేపీ రాష్ర్ట నాయకత్వం కేంద్ర నాయకత్వం దృష్ట్టికి తీసుకు వెళ్లింది. దీంతో బీజేపీ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జ్ సిద్ధార్థ్‌నాథ్ సింగ్ ఢిల్లీలో చంద్రబాబును కలిసి తీవ్ర అభ్యంతరం  తెలిపారు.

 

 నిధులు మళ్లించి ఇవ్వలేదని శోకాలా?

 కేంద్రం నుంచి వస్త్తున్న నిధులకు సరయిన లెక్కలు చెప్పక పోవడమే కాకుండా, కేంద్రం నుంచి అసలు సహాయమే అందడం లేదన్న రీతిలో టీడీపీ  తెలుగుదేశం నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మాట్లాడటాన్ని బీజేపీ జీర్ణించుకోలేక పోతున్నది. రాజధాని కోసం ఇచ్చిన నిధులను అందుకు ఖర్చు చెయ్యకపోగా కేవలం చంద్రబాబు ప్రతిభతోనే విదేశీ సహా యంతో అమరావతిని నిర్మించబోతున్నట్టు ప్రచారం చేసుకోవడాన్ని వారు ఆక్షేపిసున్నారు. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా, అంటే 75 శాతం ఇళ్ల నిర్మాణానికి  నిధులను కేంద్రం ఏపీకి మంజూరు చేస్తే ఒక్క ఇల్లు కట్టడమైనా ప్రారంభం కాకపోవడం, పోలవరం ప్రాజెక్ట్ కోసం, ఇతర పనుల కోసం ఇచ్చిన నిధులు ఖర్చు చెయ్యక పోవడం లేదా దారి మళ్ళించడం తదితర అంశాలను బీజేపీ నేతలు ఎత్తి చూపుతున్నారు.

 

 తాజాగా రాష్ర్ట విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన ఏడు జిల్లాల కోసం కేంద్రం విడుదల చేసిన రూ. 700 కోట్లను వేరే పనులకు మళ్లించడం పట్ల నీతి ఆయోగ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఆ నిధులన్నీ ఖర్చు చేసినట్టు కేంద్రానికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినందుకు ఆక్షేపించిన నీతి ఆయోగ్ ప్రత్యేక తనిఖీ బృందాలను పంపబోతున్నట్టు స్పష్టం చేసింది. ఈ నిధులలో రూ. 8 కోట్లను కేంద్ర మార్గదర్శక సూత్రాల మేరకు ఖర్చు చే సి, మిగతా నిధులను ముఖ్యమంత్రి ప్రయాణాలు తదితర ఇతర ఖర్చుల కోసం కలెక్టర్లకు కేటా యించడాన్ని నీతి ఆయోగ్ తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నది.

 

 ఎదురు దాడి వ్యూహం

 మౌనంగా ఉంటే తమ పార్టీకి జరగబోయే నష్టాన్ని గమనించినందునే ఈ రెండేళ్ల కాలంలో కేంద్రం ఏపీకి అందించిన నిధుల వివరాలతో 45 నిముషాల సీడీని తయారు చేసి బీజేపీ రాష్ర్టంలోని అన్ని జిల్లాల్లో ప్రదర్శిస్తోంది. ఈ సీడీ ప్రదర్శనలు ఏపీ బీజేపీ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో జరుగుతు న్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఒకసారి రాష్ట్రంలో పర్యటించి, మాట్లాడి వెళ్ళారు. వికాస్ పర్వ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ఐదు జిల్లాల్లో బీజేపీ కేంద్ర మంత్రులు పర్యటించి పలు సభల్లో మాట్లాడారు. మిగిలిన జిల్లాల్లో కూడా త్వరలో మరికొందరు కేంద్ర మంత్రులు పర్యటించి వాస్తవాలు వివరిస్తారని బీజేపీ నాయకులు చెప్తున్నారు.

 

 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన నుంచి రాగానే ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించాల్సి ఉంది. కానీ కశ్మీర్ పరిస్థితుల కారణంగా అది కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ ఈసారి చంద్రబాబుకు, ఆయన పార్టీలో అడ్డగోలుగా మాట్లాడుతున్న వారికి ‘మూ తోడ్ జవాబ్’  చెప్పే నాయకుడిని ముందుకు తేబోతున్నట్ట్టు వార్తలు వస్తు న్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వతంత్ర శక్తిగా ఎదగడానికి నిర్ణయిం చుకున్న బీజేపీ నిర్ణయం టీడీపీతో మూడోసారి ముత్యం అన్నట్టుగా ఏర్పడిన స్నేహాన్ని ఎక్కడిదాకా తీసుకుపోతుందో వేచి చూడాల్సిందే.

 - దేవులపల్లి అమర్

 datelinehyderabad@gmail.com


 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top