
నాలుగో దశలో కీలక పోటీలు
నాలుగో దశలో బడా నేతల కర్మభూమిగా పేరొందిన అలహాబాద్, రాయ్‌బరేలీ జిల్లాలతో పాటు బుందేల్‌ఖండ్, మహోబాజిల్లాల్లో గురువారం పోలింగ్ జరుగుతుంది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశలో.. రాజకీయ దిగ్గజాల కేంద్రంగా పేరొందిన అలహాబాద్, రాయ్‌బరేలీ, వెనుకబడిన బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని ఝాన్సీ, మహోబా తదితర 12 జిల్లాల్లో గురువారం పోలింగ్ జరగనుంది. యూపీ మధ్య, తూర్పు ప్రాంతాలకు దిగువున ఉన్న జిల్లాల్లోని 53 సీట్లల్లో బీజేపీ, ఎస్సీ–కాంగ్రెస్, బీఎస్పీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. పలువురు అభ్యర్థుల మధ్య పోటీ కీలకంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానాల్లో ఎస్పీ 24, బీఎస్పీ 15, కాంగ్రెస్ 6, బీజేపీ 5 సీట్లు గెలుచుకోగా, ఇతరులకు 3 స్థానాలు దక్కాయి.
అలహాబాద్‌లో..
అలహాబాద్ మినహా మిగిలివన్నీ వెనుకబడిన జిల్లాలే. అయిదుగురు ప్రధానులకు ఎన్నికల క్షేత్రంగా నిలిచిన అలహాబాద్ పెద్ద జిల్లా. 2012 ఎన్నికల్లో ఇక్కడి మొత్తం 11 సీట్లలో 9 మంది సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులను ప్రజలు గెలిపించినా, వారిలో ఏ ఒక్కరికీ అఖిలేశ్ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కలేదు. మాజీ ప్రధానులు నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, వీపీ సింగ్, చంద్రశేఖర్‌కు అనుబంధమున్న అలహాబాద్–వెస్ట్ నియోజకవర్గం రాష్ట్ర ప్రజలందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రతిష్టాత్మక అలహాబాద్ యూనివర్సిటీ విద్యార్థిసంఘం అధ్యక్ష పదవిని కైవసం చేసుకుని 2014లో వార్తల్లోకి ఎక్కిన రీచాసింగ్ ఎస్పీ టికెట్‌పై అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో గెలిచిన బీఎస్పీ సిటింగ్ ఎమ్మెల్యే పూజాపాల్ మూడోసారి గెలిచే ప్రయత్నం చేస్తున్నా విజయావకాశాలు లేవని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పార్టీ జాతీయ కార్యదర్శి సిద్ధార్థనాథ్ సింగ్ రంగంలో నిలిచారు. లాల్ బహదూర్ శాస్త్రి మనవడైన సింగ్ చాలా కాలంగా ఢిల్లీలో నివసించడం ఆయనకు ప్రతికూలాంశంగా మారింది. జిల్లాలోని ఫూల్‌పూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన కేశవ్‌ప్రసాద్ మౌర్య రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కావడంతో ఇక్కడి 11 సీట్లకు పోటీని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎస్పీ నేత ములాయం కేబినెట్‌లో పనిచేసిన మాజీ ఎంపీ రేవతీ రమణ్‌సింగ్ మనవడు ఉజ్వల్ రమణ్ ఎస్పీ తరఫున పోటీ చేస్తున్న కర్ఛనా స్థానం కూడా కీలకంగా మారింది.
రాజా భయ్యా మళ్లీ బరిలోకి..
ప్రతాప్‌గఢ్ జిల్లా కుందా నుంచి 1993 నుంచి వరుసగా అయిదుసార్లు ఎన్నికైన మంత్రి రఘురాజ్‌ప్రతాప్ సింగ్ అలి యాస్ రాజా భయ్యా ఆరోసారీ ఇండిపెండెంట్‌గానే ఎస్పీ మద్దతుతో నామినేషన్ వేశారు. హింసే ఆయుధంగా భావించే ‘బాహుబలి’ నేతగా పేరొందిన రాజా భయ్యా గతంలో కల్యాణ్‌సింగ్, రాంప్రకాశ్ గుప్తా, రాజ్‌నాథ్‌సింగ్ (అందరూ బీజేపీ), ములాయం కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు. ఓ పోలీసు అధికారి హత్య కేసులో ఆయన పేరు రావడంతో 2013లో అఖిలేశ్ కేబినెట్ నుంచి తప్పుకున్నా.. తర్వాత పోలీసులు క్లీన్‌చిట్ ఇచ్చాక తిరిగి మంత్రి అయ్యారు. ఇదే జిల్లాలోని రాంపూర్ ఖాస్ నుంచి వరుసగా 9 సార్లు గెలిచిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ప్రమోద్‌తివారీ కూతురు, సిటింగ్ ఎమ్యెల్యే ఆరాధనా మిశ్రా రెండోసారి పోటీచేస్తున్నారు.
రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ నేత కూతురు..
నెహ్రూ–గాంధీ కుటుంబ సభ్యులపై వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీకి దూరమై మళ్లీ అందులో చేరిన సీనియర్ నేత అఖిలేశ్‌కుమార్ సింగ్ కూతురు అదితీ సింగ్ ఈసారి కాంగ్రెస్ టికెట్‌పై రాయ్‌బరేలీ నుంచి పోటీచేస్తున్నారు. 2012 ఎన్నికల్లో అఖిలేశ్ పీస్ పార్టీ టికెట్‌పై గెలిచారు. అదితి.. బీఎస్పీ అభ్యర్థి షాబాజ్‌ఖాన్, ఆరెల్డీ నేత భారతీ పాండే నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఇదే జిల్లాలోని ఊంచాహర్ స్థానంలో బీఎస్పీ నుంచి బీజేపీలోకి ఎన్నికల ముందు ఫిరాయించిన మాజీ మంత్రి స్వామిప్రసాద్ మౌర్య కొడుకు ఉత్కర్‡్ష కమలదళం తరఫున పోటీ చేస్తున్నారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్