భారత్‌పై మరోసారి మిడతల దాడి: యూఎన్‌ఎఫ్‌ఏఓ

UNFAO Warns of Another Invasion of Locusts in July - Sakshi

న్యూఢిల్లీ: కరోనాతో కకావికలమైన ఇండియా త్వరలోనే మిడతల రూపంలో మరోసారి ప్రమాదాన్ని ఎదుర్కొబోతున్నట్లు ఐక్యరాజ్య సమితి అనుభంద సంస్థ వ్యవసాయ ఆహార సంస్థ(ఎఫ్‌ఏఓ) హెచ్చరించింది. పంటను నాశనం చేసే ఎడారి మిడతలు జూలైలో మరోసారి భారత్‌పై దాడి చేయనున్నట్లు తెలిపింది. మిడతల వల్ల బాగా నష్టపోయిన రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌ సహా మరో 16 రాష్ట్రాలపై మిడతలు మరోసారి దాడి చేయనున్నట్లు కేంద్రం హెచ్చరించిన సంగతి తెలిసిందే. వర్షాకాలం ముందు మే నెలలో నైరుతి పాకిస్తాన్ నుంచి రాజస్తాన్‌కు వసంత-జాతి మిడుత సమూహాలు వలసలు వస్తాయని ఈ సంస్థ తెలిపింది. 1962 తరువాత ప్రస్తుతం మొదటిసారి  వీటిలో కొన్ని సమూహాలు ఉత్తరాది రాష్ట్రాలకు ప్రయాణించాయని ఎఫ్‌ఏఓ వెల్లడించింది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం  పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోని వ్యవసాయ భూముల్లో వృక్షసంపద ద్వారా వ్యాప్తి చెందుతున్న ఈ సమూహాలు ఏప్రిల్‌లో పాకిస్తాన్ నుంచి భారతదేశంలోకి ప్రవేశించాయన్నారు. ఇవి కూడా  ‘హార్న్ ఆఫ్ ఆఫ్రికా’ నుంచి వచ్చాయని తెలిపారు. తూర్పు ఆఫ్రి​కాలోని వాయవ్య కెన్యాలో​ ప్రస్తుతం రెండో దశ బ్రీడింగ్‌ జరుగుతుందని..  ఫలితంగా జూన్ రెండవ వారం నుంచి జూలై మధ్య వరకు అపరిపక్వ సమూహాలకు దారి తీస్తాయని హెచ్చరించారు. సోమాలియా, ఇథియోపియాలో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే కొనసాగుతోంది. కొత్త సమూహాలు చాలా వరకు కెన్యా నుంచి ఇథియోపియాకు, జూన్ మధ్యకాలం తరువాత దక్షిణ సూడాన్ నుంచి సుడాన్ వరకు ప్రయాణిస్తాయి. మరికొన్ని సమూహాలు ఉత్తర ఇథియోపియాకు వెళతాయి. ఈశాన్య సోమాలియాకు చేరుకున్న సమూహాలు ఉత్తర హిందూ మహాసముద్రం మీదుగా ఇండో-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతానికి వలస వెళ్ళే అవకాశం ఉంది అని ఎఫ్‌ఏఓ తెలిపింది. (వణికిస్తున్న రాకాసి మిడతలు)

మిడతలు రోజులో 150 కిలోమీటర్ల వరకు ఎగురుతాయి. ఒక చదరపు కిలోమీటర్‌ మేర ఉన్న సమూహం.. 35,000 మంది ప్రజలకు సరిపోయే ఆహారాన్ని తింటాయి. రాజస్థాన్‌లోని బార్మెర్, జోధ్‌పూర్ జిల్లాల్లోని అనేక గ్రామాలు మిడతల దాడులను చూస్తూనే ఉన్నాయని భారత ప్రభుత్వ లోకస్ట్ వార్నింగ్ ఆర్గనైజేషన్ (ఎల్‌డబ్ల్యూఓ) కేఎల్ గుర్జార్ తెలిపారు. ప్రస్తుతం 65,000 హెక్టార్ల ప్రాంతంలో మిడతలు నియంత్రించబడ్డాయని.. రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా కొత్త మిడతల సమూహాలు లేవని ఆయన అన్నారు. (మిడతలను పట్టే ‘మెథడ్స్‌’)

మిడతల దాడులను నియంత్రించడానికి మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో హెలికాప్టర్ల వాడకాన్ని చూసే అవకాశం ఉందని ఎల్‌డబ్ల్యూఓ తెలిపింది. రాత్రిపూట చెట్లపైకి చేరిన తర్వాత మిడతలు మీద రసాయనాలను పిచికారీ చేయడానికి డ్రోన్లు, ఫైర్ టెండర్లు, ట్రాక్టర్లు ఉపయోగిస్తున్నామన్నారు. పెద్ద సంఖ్యలో కదులుతున్న మిడతల దండును నియంత్రించడానికి  హెలికాప్టర్లను కూడా ఉపయోగిస్తాము అని గుర్జార్ చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని వింధ్య, బుందేల్‌ఖండ్, గ్వాలియర్-చంబల్ ప్రాంతాల్లో శుక్రవారం మిడతలు కనిపించాయన్నారు. రాజస్థాన్‌లో, బార్మెర్, పాలి, జోధ్‌పూర్, జలూర్, నాగౌర్, బికనేర్ వంటి ప్రదేశాల్లో మిడుత సమూహాలు కనిపించాయన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top