‘ముందు ఆలయం.. తర్వాతే ప్రభుత్వం’

Uddhav Thackeray Said First Temple Then Government - Sakshi

ముంబై : 2019 లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్దమవుతున్నాయి. ఇప్పటి నుంచే ఎవరికి వారు తమ ప్రచారాస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ముందు ఆలయ నిర్మాణం.. తర్వాతే ప్రభుత్వ ఏర్పాటును తమ ఎజెండాగా ప్రకటించారు శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరే. అయోధ్య రామ మందిరం నిర్మాణ ప్రచారంలో భాగంగా ఈ నెల 24, 25న అయోధ్యను సందర్శించనున్నారు ఉద్ధవ్‌ థాకరే. ఈ సందర్భంగా పార్టీ సీనియర్‌ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి హిందూవు డిమాండ్‌ ఒక్కటే.. ముందు రామ మందిర నిర్మాణం..  ఆ తర్వాతే ప్రభుత్వాలు అంటూ వివరించారు. ఈ నెల 24న అయోధ్యను సందర్శించి.. అక్కడ శౌర్య పూజా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు అన్ని రాష్ట్రాల్లో మహాహరతి పూజా కార్యక్రమాల్ని నిర్వహించాల్సిందిగా కార్యకర్తలను కోరారు. ఈ సందర్భంగా థాకరే మిత్ర పక్షం బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడంలో బీజేపీ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. మందిర నిర్మాణమే తమ ప్రథమ కర్తవ్యంగా ఉద్ధవ్‌ థాకరే చెప్పుకొచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top