తృణముల్ కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న సంచలన నిర్ణయం పెద్దనోట్ల రద్దు నేటి నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాలను కుదిపేయనుంది. ఈ అంశంపై ఎన్డీఏ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేయడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఈ విషయంపై భేటీ అయిన తృణముల్ కాంగ్రెస్(టీఎంసీ) బుధవారం పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. పార్లమెంట్ సమావేశం ప్రారంభించక ముందు టీఎంసీ నేతలు నోట్ల రద్దు అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
మరోవైపు పెద్ద నోట్ల రద్దును కొందరు నేతలు గొప్ప నిర్ణయంగా పేర్కొంటుండగా.. మరికొందరు నేతలు తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ముందస్తు జాగ్రత్తలు ఏమీ తీసుకోకుండా పెద్ద నోట్లను రద్దుచేశారని, దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇదివరకే తన నిర్ణయాన్ని వెల్లడించారు.