
అస్సాంలో ఘోరం
ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరపగా.. ఓ బుల్లెట్ హై వోల్టేజ్ వైరుకు తగిలి అది కిందపడటంతో కనీసం 11 మంది చనిపోయారు.
♦ విద్యుత్ వైరుకు 11 మంది బలి
♦ పోలీసు కాల్పుల్లో తెగిపడిన వైరు
టిన్‌సుకియా: ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరపగా.. ఓ బుల్లెట్ హై వోల్టేజ్ వైరుకు తగిలి అది కిందపడటంతో కనీసం 11 మంది చనిపోయారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటన అస్సాంలోని టిన్‌సుకియా జిల్లా పంగేరీలో సోమవారం చోటుచేసుకుంది. ‘మూడు రోజుల కిందట ఇద్దరు హత్యకు గురయ్యారు. అరెస్టు చేసిన ఐదుగురిని తాము శిక్షిస్తామని, వారిని తమకు అప్పజెప్పాలని భారీ సంఖ్యలో నిరసనకారులు రాళ్లు, కర్రలతో పంగేరీ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు.
వాళ్లు రాళ్లు రువ్వడంతో అద్దాలు పగిలాయి. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఓ బుల్లెట్ హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ వైరుకు తగలడంతో అది నిరసనకారులపై పడింది. 9 మంది అక్కడే మృతిచెందగా, ఒకరు ఆస్పత్రిలో, మరొకరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే చనిపోయారు’ అని పోలీసు అధికారులు తెలిపారు. ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.