ప్రపంచ సాహిత్యానికి తీసిపోనిది తెలుగు సాహిత్యం

Telugu poet and writer Devi Priya receive Sahitya Akademi Award - Sakshi

ఇతర భాషల్లోకి అనువాదం కాకపోవడం పెద్దలోపం

సాహిత్య అకాడమీపై ఉత్తరాది ప్రభావం భావన సరికాదు

సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరణ సందర్భంగా దేవిప్రియ

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు కవిత్వం, సాహిత్యం ప్రపంచంలోని మరే ఇతర సాహిత్యానికీ తీసిపోదని.. దానికి అత్యున్నత ప్రమాణాలు, నాణ్యత ఉన్నాయని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవిప్రియ అభిప్రాయపడ్డారు. ఆయన రచించిన ‘గాలిరంగు’ కవిత్వం.. 2017కుగానూ ఉత్తమ కవితా సంపుటి అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా పల్నాడులోని ఓబులేశునిపల్లెలో జన్మించిన దేవిప్రియ సినీరంగంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి జర్నలిజంలో స్థిరపడ్డారు. ‘అమ్మ చెట్టు’ మొదలుకొని ‘గాలిరంగు’ వరకు మొత్తం 7 కవితా సంపుటాలను రచించారు. 24 భాషల్లో పురస్కారాలకు ఎంపికైన రచయితలకు అవార్డుల ప్రదానోత్సవం సోమవారం ఢిల్లీలో జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ నూతన అధ్యక్షుడు కంబార్‌ చంద్రశేఖర్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా కొనసాగిన తన రచనా ప్రస్థానంలో తెలుగు నుంచి ‘గాలిరంగు’కు సాహిత్య అకాడమీ అవార్డు అందుకోవడం సంతోషాన్నిచ్చిందన్నారు. ప్రపంచంలోని ఏ సాహిత్య ప్రమాణాలతోనూ తీసిపోని తెలుగు సాహిత్యం.. ఇతర భాషల్లోకి అనువాదం కాకపోవడం పెద్ద లోపమని అభిప్రాయపడ్డారు. సాహిత్య అకాడమీపై ఉత్తరాది ప్రభావం ఉందన్న భావనను తెలుగు రచయితలు, కవులు వదులుకోవాలన్నారు.  తెలుగు సాహిత్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలూ చొరవ తీసుకోవాలని కోరారు. పాఠశాల స్థాయిలో తెలుగును తప్పనిసరి చేసిన సీఎం కేసీఆర్‌కు భాష, సాహిత్యంపై శ్రద్ధ ఉండడం అభినందనీయమన్నారు. తెలుగులో విద్యనభ్యసించే అవకాశాలను ప్రభుత్వాలు భవిష్యత్తు తరాలకు కల్పించాలని అన్నారు.  కాగా, ఉర్దూలో మొహమ్మద్‌ బేగ్‌ ఈ అవార్డును అందుకున్నారు. హైదరాబాద్‌ వర్సిటీలో ఆయన ఉర్దూ విభాగాధిపతిగా పనిచేసి రిటైరయ్యారు. చిన్న కథల విభాగంలో ఆయన రచించిన ‘దుఃఖమ’ అవార్డుకు ఎంపికైంది. పురస్కారాలు అందుకున్న రచయితలకు జ్ఞాపికతోపాటు రూ.లక్ష నగదు బహుమానాన్ని ప్రదానం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top