విద్యార్థుల దహనం కేసు; ముగ్గురు ఖైదీల విడుదల

Tamilnadu Govt Releases Accused AIADMK In Bus Burning Case - Sakshi

సాక్షి, చెన్నై : ధర్మపురి వ్యవసాయ విద్యార్థుల బస్సు దహనం కేసులో ముగ్గురు ఖైదీలను విడుదల చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టాన్సీ కేసులో దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను దోషిగా తేల్చిన తీర్పును వ్యతిరేకిస్తూ అప్పట్లో ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అన్నాడీఎంకే పార్టీకి చెందిన కార్యాకర్తలు కాలేజీ బస్సును తగులబెట్టారు.

కాగా ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థినులు సజీవ దహనమవడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ క్రమంలో నెడుంజెలియన్‌, రవిచంద్రన్‌ అలియాస్‌ మధు, మునియప్పన్‌ అనే ముగ్గురు అన్నాడీఎంకే కార్యకర్తలకు సర్వోన్నత న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. అయితే వీరు రాష్ట్రపతి క్షమాభిక్షను కోరగా.. ఉరిశిక్ష జీవితఖైదుగా మారింది. ఈ నేపథ్యంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ 101వ జయంతి సందర్భంగా ఆ ముగ్గురిని విడుదల చేసేందుకు అనుమతించాల్సిందిగా ప్రభుత్వం గవర్నర్‌కు సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో అందుకు గవర్నర్‌ సమ్మతి తెలపడంతో వారిని విడుదల చేస్తున్నట్లు అధికార అన్నాడీఎంకే ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top