ఆధార్‌ గోప్యతపై సుప్రీంలో వాడీవేడి వాదనలు | supreme court hearing on aadhar issue | Sakshi
Sakshi News home page

Jan 17 2018 1:40 PM | Updated on Sep 2 2018 5:24 PM

supreme court hearing on aadhar issue - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్ గోప్యత అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం తుది విచారణ జరిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖాన్‌ విల్కర్, జస్టిస్‌ ఆదర్శ్ కుమార్ సిక్రీ, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం వాదనలు విన్నది. ఆధార్‌తో వ్యక్తిగత గోప్యతకు ముప్పు ఉందని పిటిషనర్లు వాదనలు వినిపించగా.. ప్రభుత్వం వారి వాదనను తోసిపుచ్చింది. ఆధార్‌తో వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగబోదని పేర్కొంది. ఆధార్‌తో సమ్మిళిత వృద్ధి, పేదల సాధికారత సాధ్యపడుతుందని రాజ్యాంగ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చింది.

ఆధార్‌ వల్ల ప్రభుత్వ పథకాల్లో అవినీతి, అక్రమాలకు తావులేకుండా లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం అందే అవకాశముంటుందని తెలిపింది. ఆధార్ సమాచార భద్రతకు డేటా ప్రొటెక్షన్ చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ‘జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని ప్యానెల్ త్వరలో డేటా ప్రొటెక్షన్ లా పై నివేదిక ఇవ్వనుంది. 130 కోట్ల దేశ జనాభాలో 119 కోట్ల మందికి ఆధార్ ఉంది. ఆధార్ అనుసంధానం తర్వాత నకిలీ గ్యాస్ కనెక్షన్ల తొలగింపుతో దేశ ఖజానాకు రూ.57,000 కోట్ల మేర సబ్సిడీ ఆదా అయింది’అని ప్రభుత్వం తెలిపింది. ఆధార్‌తో 80,000 మంది నకిలీ ఉపాధ్యాయలను గుర్తించినట్టు కేంద్ర మానవ  వనరుల అభివృద్ధి శాఖ సైతం తెలిపింది. ఆధార్ డేటాను అనధికారికంగా ఉపయోగించే వారిపై క్రిమినల్ కేసులు పెట్టేలా చట్టాన్ని తయారు చేశామని పేర్కొంది.

‘వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల ఎంపికను ఆధార్ డేటా సులభతరం చేసింది. 76 కోట్ల బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేశాం. ఆధార్ లింక్‌ చేయడంలో సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది  తలెత్తలేదు. మనీ లాండరింగ్, ఉగ్రవాద చర్యలకు నిధులందించేవారు, నేరాలకు పాల్పడేవారికే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బయోమెట్రిక్స్ మినహా ఆధార్‌లోని మిగతా వివరాలన్నీ ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ధృవపత్రాల్లో ఉన్నవే. అన్ని వెబ్‌సైట్లలో లభ్యమవుతున్నాయి. ఆస్తుల క్రయవిక్రయాలకు వేలిముద్రలు సేకరించడం గత 100 ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీనే. డిజిటల్ ఐడెంటిటీని చాలా దేశాల్లో భద్రత కోసం ఉపయోగిస్తున్నాయి. ఆధార్ కారణంగా నిరుపేదలందరికీ అందాల్సిన ప్రయోజనాలు తప్పుదారిపట్టబోవు’ అని ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement