ఆధార్‌ : కేంద్రంపై మండిపడ్డ సుప్రీంకోర్టు

Why Bank Account Should Be Frozen For Not Linking It With Aadhaar? - Sakshi

న్యూఢిల్లీ : ఆధార్‌ నెంబర్‌ లింక్‌ చేయలేదని బ్యాంకు అకౌంట్లు మూసివేయడం, ఫ్రీజ్‌ చేయడంపై సుప్రీంకోర్టు కేంద్రంపై మండిపడింది. ఈ కారణంతో బ్యాంకు అకౌంట్లను ఎలా రద్దు చేస్తారని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఆధ్వర్యంలో ఐదుగురు జడ్జీలు గల రాజ్యాంగ బెంచ్‌ ఆధార్‌పై నమోదైన పిటిషన్లను గురువారం విచారించింది. ఈ విచారణలో కేంద్రంపై సుప్రీం సీరియస్‌ అయింది. అదేవిధంగా ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌లో ఉన్న పలు ప్రొవిజిన్లను కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అమెరికా కాంగ్రెస్‌ ముందు విచారణకు హాజరైన ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ను కోట్‌ చేస్తూ.. సాంకేతిక పరిజ్ఞానమనేది సామూహిక పర్యవేక్షణకు అత్యంత శక్తివంతమైనదని తెలిపింది. ఇది అమెరికా లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల ఎన్నికలను కూడా ప్రభావితం చేయగలిగిందని పేర్కొంది. 

ఆధార్‌ లింక్‌ చేయలేదన్న కారణంతో బ్యాంకు అకౌంట్లను ఎలా రద్దు చేస్తారు? ఎలా ఫ్రీజ్‌ చేస్తారు? అంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. అకౌంట్‌ను ఆధార్‌తో లింక్‌ చేయకపోతే, తన సొంత నగదునే ప్రజలు విత్‌డ్రా చేసుకోలేరని ఆవేదన వ్యక్తం చేసింది. ఇతర అధికారిక వాలిడ్‌ డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ, ఆధార్‌ తప్పనిసరి చేయాల్సినవసరం ఏమిటి? అని కూడా టాప్‌ కోర్టు ప్రశ్నించింది. ఈ బెంచ్‌లో జస్టిస్‌ ఏకే సిక్రి, ఏఎం ఖాన్విల్కర్, డి వై చంద్రకుడ్, అశోక్ భూషణ్‌లు ఉన్నారు.

కాగ, బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, క్రెడిట్‌ కార్డులు ఆధార్‌ నెంబర్‌ను షేర్‌ చేయాలని కస్టమర్లను కోరుతున్నాయి. కేవలం ఫైనాన్సియల్‌ సర్వీసు కంపెనీలు మాత్రమే కాక, టెలికాం కంపెనీలు సైతం మొబైల్‌ నెంబర్లను ఆధార్‌తో లింక్‌ చేసుకోవాలని మెసేజ్‌లు పంపుతున్నాయి. వీటికి తొలుత 2017 డిసెంబర్‌ 31 తుది గడువుగా పేర్కొనగా.. అనంతరం ఆ తేదీని 2018 మార్చి 31 వరకు పొడిగించారు. కానీ ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన జడ్జిమెంట్‌లో తాము ఆధార్‌పై విచారణ జరిపేంత వరకు ఆధార్‌ లింక్‌ చేపట్టాలని రాజ్యాంగ బెంచ్‌ చెప్పింది. కానీ ఆధార్‌ లింక్‌ చేయలేదని బ్యాంకు అకౌంట్లను మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కేంద్రంపై మండిపడింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top