సీబీఐ ‘బోఫోర్స్‌’ పిటిషన్‌ తిరస్కరణ

Supreme Court dismisses CBI's appeal against Delhi HC's 2005 verdict - Sakshi

న్యూఢిల్లీ: బోఫోర్స్‌ శతఘ్నల కొనుగోలు కుంభకోణం కేసులో 2005 నాటి ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన అదే తీర్పును సవాల్‌ చేస్తూ న్యాయవాది, బీజేపీ నేత అజయ్‌ అగర్వాల్‌ పిటిషన్‌ వేశారనీ, ఆ పిటిషన్‌లో∙సీబీఐ కక్షిదారుగా చేరొచ్చని కోర్టు సూచించింది. హిందుజా సోదరులు సహా బోఫోర్స్‌ కేసులోని నిందితులందర్నీ నిర్దోషులుగా విడుదల చేస్తూ ఢిల్లీ హైకోర్టు 2005లో తీర్పునిచ్చింది. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ సీబీఐ ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో కేసువేసింది. సాధారణంగా హైకోర్టులో తీర్పు వెలువడిన తర్వాత 90 రోజుల్లోనే ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేయాల్సి ఉంటుంది.

అయితే సీబీఐ 13 ఏళ్ల తీవ్ర జాప్యం  తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించిందనీ, ఈ ఆలస్యానికి సరైన కారణం కూడా చెప్పలేకపోయిందంటూ కోర్టు సీబీఐ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ‘ తీవ్ర జాప్యానికి సీబీఐ తెలిపిన కారణాలతో మేం సంతృప్తి చెందడం లేదు. ఇదే కేసుకు సంబంధించి అజయ్‌ అగర్వాల్‌ పిటిషన్‌ ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉంది. ఆ పిటిషన్‌లోనే సీబీఐ కూడా కక్షిదారుగా చేరి వాదనలు వినిపించవచ్చు. విచారణను పునఃప్రారంభించేందుకు అనుమతి కోరవచ్చు’ అని జస్టిస్‌ కేఎం జోసెఫ్, జస్టిస్‌ హేమంత్‌ గుప్తాలు సభ్యులుగా గల ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసేందుకు నాటి యూపీఏ ప్రభుత్వాలు తమకు అనుమతివ్వక పోవడం కారణంగానే 13 ఏళ్ల ఆలస్యమైందని సీబీఐ వాదించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top