అత్యవసర విచారణ అక్కర్లేదు

Supreme Court adjourns Ayodhya case, to decide hearing date in January - Sakshi

అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు 

జనవరిలో ధర్మాసనం ఏర్పాటుచేస్తామని ప్రకటన

ఆర్డినెన్స్‌ తేవాలన్న ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ

న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదాన్ని అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చింది. 2019 జనవరిలో తాము ఏర్పాటు చేయబోయే ధర్మాసనం అయోధ్య కేసు విచారణ తేదీలను ఖరారు చేస్తుందని తెలిపింది. అత్యున్నత న్యాయస్థానం నిర్ణయంపై బీజేపీతోపాటు పలు హిందుత్వ సంఘాలు నిరసన తెలిపాయి. రామమందిర నిర్మాణంలో జాప్యంతో హిందువుల్లో సహనం నశిస్తోందని కేంద్రమంత్రి గిరిరాజ్‌ కిశోర్‌ వ్యాఖ్యానించగా మందిర నిర్మాణం కోసం వెంటనే ఆర్డినెన్స్, లేదా పార్లమెంట్‌లో చట్టం తేవాలని విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ), ఆర్‌ఎస్‌ఎస్‌ కేంద్రాన్ని డిమాండ్‌ చేశాయి. కాగా, అయోధ్య వివాదంలో కోర్టులు ఏమీ చేయలేవని శివసేన పేర్కొంది.  

మాకు వేరే ప్రాథమ్యాలున్నాయి..
అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంపై అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ తేదీలను వచ్చే ఏడాది జనవరిలో ఖరారు చేయనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ‘అయోధ్య వివాదాస్పద భూమిపై అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సముచిత ధర్మాసనం విచారణ చేపడుతుంది. విచారణ తేదీలను ఆ ధర్మాసనం వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో నిర్ణయిస్తుంది’ అని తెలిపింది.

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై వెంటనే విచారణ చేపట్టాలంటూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం, రామ్‌లల్లా తరఫున వాదిస్తున్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, సీనియర్‌ లాయర్‌ సీఎస్‌ వైద్యనాథన్‌ కోరగా స్పందించిన ధర్మాసనం..‘మాకు వేరే ప్రాథామ్యాలున్నాయి. ఈ వివాదంపై జనవరి, ఫిబ్రవరి లేక మార్చిలోనా ఎప్పుడు విచారణ చేపట్టాలో ఆ ధర్మాసనం నిర్ణయిస్తుంది’ అని పేర్కొంది. వివాదాస్పద ప్రాంతంలోని 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్‌ బోర్డ్, నిర్మోహి అఖారా, రామ్‌ లల్లా వర్గాల మధ్య సమానంగా విభజించాలంటూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.

హిందువుల్లో సహనం నశిస్తోంది: న్యాయస్థానాలపై తమ ప్రభుత్వానికి గౌరవం, విశ్వాసం ఉన్నాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. అయితే, మెజారిటీ ప్రజలు ఈ విషయంలో త్వరగా తుది తీర్పు వెలువరించాలని కోరుతున్నారన్నారు. రామ మందిరం ఆలస్యంపై హిందువుల్లో సహనం నశిస్తోందని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ కిశోర్‌ అన్నారు.

ప్రభుత్వం ముందున్న మార్గాలు
అయోధ్య పరిష్కారంపై ఒత్తిడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ముందు 4 మార్గాలున్నట్లు భావిస్తున్నారు.
అవి 1. సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యేదాకా ఎదురుచూడటం,
2. రామాలయం నిర్మాణానికి వీలుగా ఆర్డినెన్స్‌ తేవడం,
3. పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టడం,
4. రథయాత్ర మాదిరి ఉద్యమాన్ని ప్రారంభించడం.

వెంటనే ఆర్డినెన్స్‌ తేవాలి: హిందుత్వ సంస్థలు
‘త్వరలో ఈ వివాదాన్ని కోర్టు తేల్చాలి. మందిరం నిర్మాణానికి ఎదురవుతున్న అవరోధాలను ప్రభుత్వం తొలగించాలి. వెంటనే రామాలయాన్ని నిర్మించాలి. ఆలయ నిర్మాణంతోనే దేశంలో మతసామరస్యం, ఐక్యతా భావం పెంపొందుతాయి’ అని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధి అరుణ్‌ కుమార్‌ తెలిపారు.రామాలయాన్ని నిర్మించటానికి వీలుగా కేంద్రం చట్టం తేవాలని వీహెచ్‌పీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అలోక్‌ కుమార్‌ కోరారు. లేని పక్షంలో జనవరిలో అలహాబాద్‌ కుంభమేళాలో తదుపరి కార్యాచరణను ఖరారు చేస్తామన్నారు. రాముని జన్మస్థలం అయోధ్యలోనే రామమందిరం కట్టాలని కోరుతున్నాం. అంతేతప్ప, పాకిస్తాన్‌లో కాదని శివసేన పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top