‘అయోధ్య’పై రివ్యూ పిటిషన్‌ | Sakshi
Sakshi News home page

‘అయోధ్య’పై రివ్యూ పిటిషన్‌

Published Tue, Dec 3 2019 4:35 AM

Review Ayodhya verdict plea reaches Supreme Court - Sakshi

న్యూఢిల్లీ: అయోధ్యలో రామ జన్మభూమి– బాబ్రీమసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలైంది. తీర్పులో కొన్ని తప్పులున్నాయని, వాటిని సవరించాలని కోరుతూ సోమవారం మౌలానా సయ్యద్‌ అషాద్‌ రషీది, జామియత్‌ ఉలేమా ఇ హింద్‌ ఉత్తరప్రదేశ్‌ శాఖ అధ్యక్షుడు మౌలానా అర్షద్‌ మదానీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. సయ్యద్‌ రషీది తొలి పిటిషన్‌దారు ఎం సిద్ధిఖీకి చట్టబద్ధ వారసుడు.

‘ఆ స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించాలని తీర్పునివ్వడం ద్వారానే నిజమైన న్యాయం జరిగినట్లవుతుంది’ అని 93 పేజీల ఆ రివ్యూ పిటిషన్‌లో పేర్కొన్నారు. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రామాలయ నిర్మాణం జరగాలని, ప్రతిగా, ముస్లింల తరఫున సున్నీ వక్ఫ్‌ బోర్డుకు అయోధ్యలోని ప్రముఖ ప్రాంతంలో మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలం కేటాయించాలని జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నవంబర్‌ 9న సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement