సిగిరేట్‌ తాగితే పళ్లు రాలిపోతాయ్‌..

Smoking Causes Higher Risk Of Teeth Problems - Sakshi

బర్మింగ్‌హామ్‌ : సరదా సరదా సిగరెట్టు.. దొరల్‌ తాగు బలె సిగరెట్టు... పట్టు బట్టి ఒక దమ్ము లాగితే స్వర్గానికి అది తొలిమెట్టు. ఇది ఓ సినిమాలో పాట.. పొగరాయుళ్లు తమకు అన్వయించుకునే మాట. ఓ పూట తిండి లేకపోయినా ఉంటారేమో గానీ పొగతాగంది ఉండలేరు. నష్టం తప్పదు నాయనా అని ఎంత నచ్చజెప్పినా నచ్చిందే చేస్తామంటారు. కొత్త సిగిరేట్లు ఎలా అందుబాటులోకి వస్తున్నాయో అలానే రోగాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

సిగిరేట్‌ తాగటం వల్ల పళ్లు త్వరగా రాలిపోతాయని పరిశోధనల్లో తేలింది. ఇంగ్లాండుకు చెందిన ‘‘యూనివర్శిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్’’ శాస్త్రవేత్తల బృందం జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పొగ తాగని వారికంటే తాగే వారిలో రెండు రెట్లు ఎక్కువగా పళ్లు రాలిపోయే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. పొగతాగే వారికి ఎక్కువగా చిగుళ్ల సమస్యలు వస్తాయని, వీరిలో ఎక్కువమంది చిగుళ్ల సమస్యలతో బాధ పుడతున్నారని తెలిపారు.

సంవత్సరానికి రెండుసార్లైనా ‘రూట్‌ కెనాల్‌ ట్రీట్‌మెంట్‌’ చేయించుకోవాలని హెచ్చరిస్తున్నారు. పొగతాగే వారికి నోటి నొప్పి, చిగుళ్ల, పంటి సమస్యలు ఎక్కువంటున్నారు. ఆల్కాహాల్‌, సిగిరేట్‌ ఈ రెండిటిని ఎక్కువగా తీసుకోవటం కారణంగా నోటి క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు. సిగరేట్‌ తాగటం వల్ల నోటిలోని వ్యాధి నిరోధక వ్యవస్ధ దెబ్బ తింటుందని తెలిపారు. నోటికి సంబంధించిన అన్ని రోగాలకు పొగాకే కారణమని తేల్చి చెప్పేస్తున్నారు. చైన్‌ స్మోకర్లలాగా దమ్ము మీద దమ్ము కొడుతూ పోతే నోటితో పట్టుకోవడానికి చివరకు పళ్లే లేకుండా పోతాయని హెచ్చరిస్తున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top