సేన, బీజేపీ మధ్య ‘స్పీకర్’ చిచ్చు! | Shiv Sena, BJP spar over speaker's election in Maharashtra assembly | Sakshi
Sakshi News home page

సేన, బీజేపీ మధ్య ‘స్పీకర్’ చిచ్చు!

Nov 12 2014 2:11 AM | Updated on Mar 29 2019 9:24 PM

ఇప్పటికే వరుస జగడాలతో దూరమవుతున్న బీజేపీ, శివసేన పార్టీల మధ్య మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎన్నికల అంశం.....

నోటిఫికేషన్ రద్దుకు శివసేన డిమాండ్
 
ముంబై: ఇప్పటికే వరుస జగడాలతో దూరమవుతున్న బీజేపీ, శివసేన పార్టీల మధ్య మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎన్నికల అంశం మరో వివాదానికి కారణమైంది. స్పీకర్ ఎన్నికలో నామినేషన్ వేసేందుకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకే గడువు ఉండగా... ఇంకా చాలా మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేయని నేపథ్యంలో ఎన్నిక నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని శివసేన డిమాండ్ చేసింది. దీంతో ప్రొటెం స్పీకర్ నామినేషన్ గడువును పొడిగించారు. ఇక స్పీకర్ పదవి కోసం అధికారపక్షానికి పోటీగా శివసేన, కాంగ్రెస్ తమ అభ్యర్థులను రంగంలోకి దించాయి. మరోవైపు ఫడ్నవిస్ సర్కారు బుధవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మినహా మిగతా అన్ని పక్షాల మద్దతునూ స్వాగతిస్తామని బీజేపీ ప్రకటించడం గమనార్హం. మంగళవారం మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశమైన కొద్దిసేపటికే.. శివసేన నేత ఏక్‌నాథ్ షిండే పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తారు.

సభలో ఇంకా 106 మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేయాల్సి ఉందని.. అంతవరకూ వారికి స్పీకర్ ఎన్నికల్లో పోటీకిగానీ, అభ్యర్థులను బలపర్చడానికిగానీ అవకాశముండదని స్పష్టం చేశారు. అందువల్ల స్పీకర్ ఎన్నిక నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే శివసేన సభ్యులంతా లేచి దీనిపై నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. దీనికి పీడబ్ల్యూపీ, ఎన్సీపీ మద్దతు పలికాయి.  
 ముక్కోణపు పోటీ..  అసెంబ్లీ స్పీకర్ ఎన్నికలో అధికార బీజేపీతో పాటు శివసేన, కాంగ్రెస్  కూడా తమ తరఫున అభ్యర్థులను నిలపడంతో ముక్కోణపు పోటీ నెలకొంది. బీజేపీ తరఫున హరిభావూ బాగ్డే, శివసేన నుంచి విజయ్ ఔటి, కాంగ్రెస్ తరఫున వర్షా నామినేషన్లు వేశారు.    

‘కాంగ్రెస్ మినహా ఎవరి మద్దతైనా ఓకే’

కాగా, రాష్ట్ర అసెంబ్లీలో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం నేడు విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. సభలో మొత్తం 288 మంది సభ్యులు ఉండగా.. బీజేపీ తాజా ఎమ్మెల్యే గోవింద్ మృతిచెందారు. మిగతా 287 మంది సభ్యుల్లో 144 మంది మద్దతును ప్రభుత్వం పొందాల్సి ఉంటుంది. ఒకవేళ సభ్యులెవరైనా గైర్హాజరై, కోరం సరిపోయిన పక్షంలో... హాజరైనవారిలో సగం మందికిపైగా మద్దతును ప్రభుత్వం పొందాల్సి ఉంటుంది. పరీక్ష నేపథ్యంలో.. కాంగ్రెస్ మినహా ఏ పార్టీ మద్దతునైనా తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ ప్రకటించింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement