సీరియల్‌ కష్టాలు కాదు..సీరియల్‌ అంటే ఇష్టాలు..!

Serial means not suffers it means likes of many - Sakshi

ఎందుకంటే ఇది మనుషుల్ని మార్చిన సీరియల్‌ 

సినిమాల్లో, సీరియల్స్‌లో సందేశాలు ఇస్తే.. ఎవరైనా చూస్తారా? 

సందేశాలు ఇస్తే ఎవరు చూస్తారండీ.. జనాలకు కావాల్సింది వినోదమే..  

కానీ ఓ సీరియల్‌లో సందేశం ఇస్తే.. కోట్ల మంది చూశారు.. చూడటమే కాదు.. మారారు కూడా.. ఆ సీరియల్‌ పేరు.. ‘మే కుచ్‌బీ కర్‌ సక్తీ హూ’.. అంటే.. నేను ఏదైనా సాధించగలను అని అర్థం.. ఆ సీరియల్‌ కూడా సాధించింది.. లింగపరమైన అంశాల్లో పల్లె ప్రజల ఆలోచనా విధానంలో మార్పును తెచ్చింది.. 

ఇంతకీ ఏ మార్పు తెచ్చింది? ఈ ధారావాహిక ప్రసారం కావడానికి ముందు వివాహానికి చట్టబద్ధమైన వయస్సు ఎంత అనేది 59 శాతం మంది మహిళలకే తెలుసు.. సీరియల్‌ తొలి సీజన్‌ పూర్తయిన తర్వాత ఆ సంఖ్య 83 శాతానికి పెరిగింది! గర్భనిరోధానికి ఆధునిక పద్ధతులు ఉపయోగిస్తే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయని 57 శాతం మంది పురుషులు భావించేవారు.. సీరియల్‌ చూశాక.. ఆ సంఖ్య 32 శాతానికి తగ్గింది. తొలి కాన్పునకు 21–25 ఏళ్లు సరైన సమయమని 57 శాతం మంది అత్తమామలు అనుకునేవారు.

సీరియల్‌ ప్రసారమైన కొన్ని వారాల తర్వాత ఆ సంఖ్య 86 శాతానికి పెరిగింది. పెళ్లి తర్వాత అమ్మాయి పుట్టింటి మొహం చూడకూడదని 45 శాతం మంది అనుకునేవారు.. తర్వాత అది 28 శాతానికి తగ్గింది. ఢిల్లీకి చెందిన ఎన్జీవో పాపులేషన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) దేశంలో హిందీ మాట్లాడే పలు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో చేసిన అధ్యయనం ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. అంతేనా.. మధ్యప్రదేశ్‌లోని నయాగావ్‌లో అప్పటివరకూ ఏ అమ్మాయి కాలేజీ చదువులు చదివింది లేదు. అయితే, ఈ సీరియల్‌ స్ఫూర్తితో లడ్కువార్‌ కుష్వాహా(16) తాను కాలేజీకి వెళ్లాలని నిర్ణయించుకుంది. తల్లిదండ్రులు మద్దతిచ్చారు. గ్రామమంతా వ్యతిరేకించింది. కొంతమందైతే.. ఆమెను కారుతో గుద్దించాలనీ చూశారు. దేనికీ వెరవలేదు.. ఇప్పుడు ఆ గ్రామం నుంచి 10 మంది అమ్మాయిలు కాలేజీకి వెళ్లి చదువుకుంటున్నారు. బిహార్‌లోని చత్తర్‌పూర్‌లో కొంతమంది పురుషులు గృహహింసకు వ్యతిరేకంగా ఓ గ్రూపును ఏర్పాటు చేశారు. తమ భార్యలకు ఇంటిపనుల్లో సాయం చేయాలని తీర్మానించుకున్నారు.. ఇలాంటి ఉదాహరణలెన్నో.. 

సామాజిక రుగ్మతలను ఎత్తిచూపుతూ.. 

లడ్కువార్‌ కుష్వాహా 
విద్యావినోద(ఎడ్యుటైన్‌మెంట్‌) ధారావాహికగా రూపొందిన ‘మే కుచ్‌ బీ కర్‌ సక్తీ హూ’.. బాల్య వివాహాలు, లింగ సమానత్వం, భ్రూణ హత్యలు, తొలి కాన్పు సమయంలో ఉండాల్సిన వయసు, కుటుంబ నియంత్రణ, గృహ హింస ఇలా చాలా అంశాలను స్పృశించింది. దూరదర్శన్‌లో ఈ సీరియల్‌ 2014–2016 వరకూ రెండు సీజన్స్‌గా ప్రసారమైంది. టెలివిజన్‌ ఆడియన్స్‌ మెజర్‌మెంట్, ఇండియన్‌ రీడర్‌షిప్‌ సర్వే ప్రకారం.. రెండు సీజన్లు, పునఃప్రసారాలను కలిపితే 40 కోట్ల మంది దీనిని చూశారు.

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్, గేట్స్‌ ఫౌండేషన్, ఐక్యరాజ్యసమితి పాపులేషన్‌ ఫండ్‌ సహకారంతో దీన్ని నిర్మించారు. పీఎఫ్‌ఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పూనమ్‌ ముత్రేజా.. అమెరికాకు చెందిన కమ్యూనికేషన్, సోషల్‌ చేంజ్‌ ఎక్స్‌పర్ట్‌ అరవింద్‌ సింఘాల్‌తో కలసి ఈ సీరియల్‌కు శ్రీకారం చుట్టారు. గాంధీ, ద ఫాదర్‌ సినిమా దర్శకుడు ఫిరోజ్‌ అబ్బాస్‌ఖాన్‌ దీనికి డైరెక్టర్‌. ప్రతి ఎపిసోడ్‌ ఒక సందేశంతో, క్విజ్‌తో ముగిసేది. అలాగే మిస్డ్‌ కాల్‌ కోసం ఓ నంబర్‌ ఇచ్చేవారు. మిస్డ్‌ కాల్‌ ఇచ్చిన వారికి వీరే కాల్‌ చేసేవారు. రెండేళ్ల వ్యవధిలో దేశం నలుమూలల నుంచి మొత్తం 14 లక్షల కాల్స్‌ వచ్చాయి. కాల్‌ చేసిన చాలా మంది తమ అభిప్రాయాలు వెల్లడించడమే కాక.. మారతామని ప్రతిజ్ఞ కూడా చేశారు.    
 – సాక్షి, తెలంగాణ డెస్క్‌  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top