కరువు కోరల్లో మరాఠ్వాడా | Sena to call governor to drought-hit Marathwada | Sakshi
Sakshi News home page

కరువు కోరల్లో మరాఠ్వాడా

Nov 27 2014 10:41 PM | Updated on Sep 2 2017 5:14 PM

మరాఠ్వాడా ప్రాంతాన్ని కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన విజ్ఞప్తి చేసింది.

సాక్షి, ముంబై: మరాఠ్వాడా ప్రాంతాన్ని కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గవర్నర్ సి.హెచ్.విద్యాసాగర్‌రావుతో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ప్రతిపక్షనాయకుడు ఏక్‌నాథ్ షిండే సహా ఆ పార్టీ ప్రతినిధుల బృందం గురువారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా మరాఠ్వాడాలో కరువు పీడిత ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయనకు విన్నవించారు. ఉద్ధవ్ ఠాక్రే తమ పార్టీకి చెందిన 63 మంది ఎమ్మెల్యేలతో కలిసి రెండు రోజుల పాటు మరాఠ్వాడా ప్రాంతంలో పర్యటించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఈ బృందం మరాఠ్వాడాలోని బాధితులతో ప్రత్యక్షంగా భేటీ వారి బాధలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గురువారం ఉదయం గవర్నర్‌ను కలిసి మరాఠ్వాడా కరువు పరిస్థితిపై నివేదిక సమర్పించారు. ఆ ప్రాంతంలో కరువు రావడం వరుసగా ఇది మూడో సంవత్సరమని, అక్కడి ప్రజలు తాగేందుకు నీరు లేక అల్లాడుతున్నారని వివరించారు. వేసిన పంటలు నీరు లేక  ఎండిపోతున్నాయన్నారు. బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించలేక అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వివరించారు.

 మరాఠ్వాడాలోని ఎనిమిది జిల్లాల్లో మొత్తం 8,536 గ్రామాలు ఉండగా అందులో 8004 గ్రామాల్లో కరువు తాండవిస్తోందని, వారందరికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని గవర్నర్‌కు విన్నవించారు. రైతులు తీవ్రంగా నష్టపోవడ ంవల్ల మరాఠ్వాడాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని కోరారు. విద్యార్థులందరి ఫీజులు, 10,12 తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజులు, రైతుల రుణాలు మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే రైతులకు నిలిపివేసిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని, విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని, కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్థిక సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి చేరే విధంగా ఏర్పాటు చేయాలని విన్నవించారు. నష్టపోయిన రైతులకు తక్షణం ఎకరానికి కనీసం రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేయాలన్నారు. మరాఠ్వాడా ప్రాంతానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న 183 నీటి ప్రాజెక్టుల పనులు వెంటనే ప్రారంభించాలని, ఆ ప్రాంతానికి చెందాల్సిన నీటిని వెంటనే ఉజనీ, జైక్వాడి డ్యాంల నుంచి విడుదల చేయాలని కోరారు. కాగా, శివసేన విజ్ఞప్తికి గవర్నర్ స్పందిస్తూ త్వరలో మరాఠ్వాడా ప్రాంతంలో పర్యటిస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యక్షంగా రైతులతో భేటీ అయ్యి సమస్యలు అడిగి తెలుసుకుంటానని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలూ విభేదాలు పక్కనబెట్టి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement