తిరువనంతపురం : కేరళలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏరియల్ సర్వే చేశారు. రాజ్‌నాథ్ సింగ్ వెంట కేరళ సీఎం పినరయి విజయన్, కేంద్ర మంత్రి కేజే అల్ఫోన్స్ ఇతర ఉన్నతాధికారులున్నారు. కేరళలో పోటెత్తిన వరదలతో తలెత్తిన పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్రం తోడ్పాటు అందిస్తుందని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారని, వరద బీభత్సాన్ని ప్రత్యక్షంగా వీక్షించడంతో పాటు నష్టాన్ని మదింపు వేశారని సీఎంఓ కేరళ ట్వీట్ చేసింది. భారీ వర్షాలు ముంచెత్తడంతో కేరళ వరద తాకిడికి గురైంది.
ఇడుక్కి, ఇదమలయార్ రిజర్వాయర్లలో వరద ఉధృతి కొంత తగ్గుముఖం పట్టినా లోతట్టు ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. వరద తీవ్రతతో కేరళలో ఇప్పటివరకూ వివిధ ఘటనల్లో 31 మంది మరణించారని అధికారులు తెలిపారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
