వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం

Prime Minister Narendra Modi's warning to the terrorists - Sakshi

ఉగ్రమూకలకు ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక

సాక్షి ప్రతినిధి, చెన్నై/కన్యాకుమారి: ఉగ్రవాదులపై పోరాటం విషయంలో భారత్‌ ఇకపై నిస్సహాయంగా ఉండబోదని ప్రధాని మోదీ తెలిపారు. ఉగ్రమూకలు దుశ్చర్యలకు పాల్పడితే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. తమిళనాడు పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన మోదీ, విపక్షాల తీరును ఎండగట్టారు.

ఎవరివైపు ఉన్నారో స్పష్టం చేయండి..
ఐఏఎఫ్‌ పైలెట్, వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ పట్ల దేశమంతా గర్వపడుతోందని మోదీ తెలిపారు. భారత తొలి మహిళా రక్షణమంత్రిగా తమిళనాడుకు చెందిన నిర్మలా సీతారామన్‌ ఉండటంపై నేను గర్వపడుతున్నానని వెల్లడించారు. బాలాకోట్‌ జైషే స్థావరంపై వైమానిక దాడి, పాక్‌కు చెందిన ఎఫ్‌–16ను కుప్పకూల్చడం ద్వారా భారత సాయుధ బలగాల సామర్థ్యం మరోసారి తేటతెల్లమయిందన్నారు. కానీ కొందరు రాజకీయ నేతల వ్యాఖ్యలు దేశానికి చేటు చేసేలా, పాకిస్తాన్‌కు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా నేతలు భారత బలగాలవైపు ఉన్నారా? లేక స్వదేశంలో ఉగ్రవాదానికి ఊతమిచ్చేవారి తరఫున ఉన్నారా? అన్నది స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఐఏఎఫ్‌ సిద్ధమైనా యూపీఏ ఒప్పుకోలేదు
మోదీ తాత్కాలికమనీ, దేశమే శాశ్వతమని ప్రధాని అన్నారు. 2008లో ముంబై ఉగ్రదాడుల సందర్భంగా ఉగ్రవాదులను శిక్షిస్తారని దేశమంతా భావించినప్పటికీ అప్పటి యూపీఏ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అప్పట్లో భారత వాయుసేన సర్జికల్‌ స్ట్రయిక్స్‌ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్రం అనుమతించలేదని ఆరోపించారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం ఉగ్రవాదుల ఏరివేత విషయంలో సాయుధ బలగాలకు పూర్తిస్వేచ్ఛ ఇచ్చామన్నారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన కింద 1.1 కోట్ల మంది రైతులకు రూ.2,000 చొప్పున  ఆర్థిక సాయం అందించామని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top