
దైర్యముంటే సీఏఏను అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు జేడీ(యూ) నేత ప్రశాంత్ కిషోర్ సవాల్ విసిరారు.
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్‌ఆర్‌సీలను అమలు చేయాలని హోంమంత్రి అమిత్ షాకు జనతాదళ్ (యూ) ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ సవాల్ విసిరారు. పౌరుల అసమ్మతిని తోసిపుచ్చడం ఏ ప్రభుత్వానికి బలం కాదని హితవు పలికారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను మీరు ఖాతరు చేయని పక్షంలో మీరు ప్రకటించిన కార్యక్రమానికి అనుగుణంగా సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై ముందుకు వెళ్లి వాటిని ఎందుకు అమలు చేయరని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆయన బుధవారం ట్వీట్ చేశారు.
కాగా, నిరసనలకు భయపడి సీఏఏను వెనక్కితీసుకోబోమని, తాము నిరసనల మధ్యే జన్మించామని, ఎదిగామని విపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఇదే చెబుతున్నామని లక్నోలో జరిగిన ర్యాలీలో అమిత్ షా పునరుద్ఘాటించిన క్రమంలో ప్రశాంత్ కిషోర్ ఈ మేరకు ట్వీట్ చేశారు.