ఆ రాష్ట్ర ప్రయాణీకులకు ప్రత్యేక నిబంధనలు!

Pramod Sawant Says Goa May Issue Separate Rules Travellers From Maharashtra - Sakshi

గోవాలో 67కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

పనాజి: రాష్ట్రంలో కరోనా(కోవిడ్‌-19) కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలో ప్రవేశించే వారి కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ‘‘గోవాలోని కరోనా పేషెంట్లలో 90 శాతం మంది మహారాష్ట్ర నుంచి వచ్చిన వారే ఉన్నారు. కాబట్టి ఇకపై అక్కడి నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేక నిబంధనలు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నాం’’ అని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటామనే సంకేతాలు జారీ చేశారు. కాగా రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ముంబై నుంచి గోవాకు వచ్చిన 11 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కోవిడ్‌ బాధితుల సంఖ్య 67కు చేరుకుంది. (చైనాతో వివాదం: ​కామెంట్‌ చేయదలచుకోలేదు)

ఇక సరిహద్దు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్నప్పటికీ గోవా ప్రాణాంతక వైరస్‌ను కట్టడి చేయడంలో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన నాటి నుంచి అక్కడ రోజురోజుకీ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గోవా మీదుగా వెళ్తున్న పలు రైళ్లను రాష్ట్రంలో ఆపకూడదని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. కాగా తాజా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన గోవా ఆరోగ్య శాఖా మంత్రి విశ్వజిత్‌ రాణే... రైళ్లు, రోడ్డు, ఇతర మార్గాల ద్వారా రాష్ట్రంలో ప్రయాణిస్తున్న వారి వల్ల కేసులు పెరుగుతున్నాయని.. ఈ క్రమంలో సీఎంతో చర్చించి నిబంధనలు మరింత కఠినతరం చేయాలని కోరనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.(పరీక్షలు వాయిదా వేసే అవకాశమే లేదు: గోవా సీఎం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top