సీఎం ఇలాకాలో..రాజకీయ కక్షలు

Political Gang War In Orissa - Sakshi

బరంపురం ఒరిస్సా : ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ స్వయంగా   ప్రాతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లాలో కొద్ది నెలల నుంచి రాజకీయ కక్షలు రాజుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర పౌరసంబంధాల శాఖ మంత్రి సూర్యనారాయణ పాత్రో సొంత నిమోజకవర్గమైన దిగపండిలో కాంగ్రెస్, బీజేడీ పార్టీలకు చెందిన వర్గాల మధ్య రాజకీయ కక్షలు రాజుకున్నాయి. మరో ఐదు నెలల్లో జరగనున్న జమిలి ఎన్నికల నేపథ్యంలో గంజాం జిల్లాలో ఇప్పటి నుంచే ఎన్నికల వేడి మొదలైంది.  జిల్లాలోని దిగపండి నియోజకవర్గంలో రెండు పార్టీలకు చెందిన ఇరు వర్గాలు  ఒకరిపై ఒకరు మారణాయుధాలు, బాంబు దాడులతో అధిపత్యం సాధించేందుకు యత్నించారు.

రెండు రోజుల క్రితం దిగపండి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల పద్మనాభపూర్‌లో   జరిగిన బాంబుల దాడి సంఘటనే దీనిని రుజవు చేస్తోంది. ఇదే విధంగా రంబా దగ్గర కృష్ణి కేశ్‌పూర్, తొంటియా గ్రామాల మధ్య బీజేపీ, బీజేడీ పార్టీల నాయకులు  ఆధిపత్యం సాధించేందుకు ఇరు వర్గాల కీలక మద్దతుదారులు మారణాయుధాలు, బాంబు దాడులు చేసుకుని  బీభత్సాన్ని సృష్టించారు. ఈ నేపథ్యంలో పోలీసులు చొరవ తీసుకుని  ఇరు వర్గాలను శాంతింపజేశారు. మరో వైపు రొంగాయిలొండా బ్లాక్‌ పరిధి ఎకసింగ్‌పూర్‌ గ్రామంలో గత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య రాజుకున్న రాజకీయ కక్షలు ప్రశాంతంగా ఉన్నాయనుకుంటే   కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్, బీజేడీ నాయకుల మధ్య పరస్పపర దాడులు జరగడంతో గోళంతరా పోలీసులు ఇరువర్గాల వారిని అరెస్ట్‌ చేశారు.

అయితే అరెస్ట్‌ అయిన వారిని వెంటనే రాజకీయ నాయకుల ఒత్తిడితో పోలీసులు విడిచి పెట్టినట్లు తీవ్ర అరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా అస్కాలో రాజకీయ అధిపత్యం కోసం అధికార పార్టీ బీజేడీకి చెందిన నాయకులు గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉండి ఇటీవల బీజేడీలో చేరిన రాజకీయ నాయకులపై దాడులు చేయించడం జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇదే విధంగా చికిటి, గంజాం, ఛత్రపూర్, హింజిలికాట్‌ సరగడ, సురడా, సన్నోఖేముండి బ్లాక్‌లలో కూడా జరిగిన వివిధ సంఘటనలను బట్టి రాజకీయ కక్షలు జోరుగా రాజుకుంటున్నట్లు జిల్లాలోని రాజకీయ పరిశీలకులు, మేధావులు, ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top