
గోవాలో భేటీ సందర్భంగా బ్రెజిల్ అధ్యక్షుడితో మోదీ కరచాలనం
అణు సరఫరా దేశాల బృందం(ఎన్‌ఎస్జీ)లో సభ్యత్వం కోసం భారత ఆకాంక్షను బ్రెజిల్ అర్థం చేసుకుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
♦ భారత్ ఆకాంక్షను అర్థం చేసుకుందన్న ప్రధాని మోదీ
♦ ఉగ్రవాదంపై పోరులో బ్రెజిల్ సహకారాన్ని ప్రశంసించిన ప్రధాని
♦ ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలపై సంతకాలు
బెనౌలిమ్(గోవా): అణు సరఫరా దేశాల బృందం(ఎన్‌ఎస్జీ)లో సభ్యత్వం కోసం భారత ఆకాంక్షను బ్రెజిల్ అర్థం చేసుకుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు మైఖేల్ టెమెర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదంపై భారత పోరుకు ఆ దేశం మద్దతునూ ప్రశంసించారు. సోమవారం ఇరు దేశాధినేతలు గోవాలో బ్రిక్స్ సదస్సు వేదికపై విస్తృత ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఉగ్రవాదంపై పోరులో ఎలాంటి విభేదాలూ, వివక్షా చూపకుండా ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా ముందుకు రావాలంటూ రెండు దేశాలు పిలుపునిచ్చాయి. చర్చల అనంతరం ఇరు దేశాధినేతలు మీడియాతో మాట్లాడారు.
‘ఐరాసలో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందానికి ఆమోదం పొందే ప్రక్రియలో కీలక భాగస్వామిగా ఉన్న బ్రెజిల్‌తో భవిష్యత్తులో కలసి పనిచేస్తాం. మాదక ద్రవ్యాల నియంత్రణ, వ్యవసాయ పరిశోధన, సైబర్ భద్రత వంటి కొత్త అంశాల్లో కలసి సాగాలని నిర్ణయించాం. భారత్, బ్రెజిల్‌ల మధ్య ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం తుది దశకు చేరుకుంది’ అని మోదీ తెలిపారు.
అన్ని గ్రూపుల్లో కలసి సాగుతాం: మోదీ
‘ఐక్యరాజ్యసమితి, జీ20, జీ4, డబ్ల్యూటీవో, బ్రిక్స్, ఐబీఎస్‌ఏల్లో బ్రెజిల్‌తో మరింత సన్నిహితంగా కలసి పనిచేస్తాం. భారత ఉత్పత్తులు, కంపెనీలకు విస్తృత స్థాయి మార్కెట్, పెట్టుబడి అవకాశాలు కల్పించాలన్న విజ్ఞప్తి సానుకూలంగా స్పందించినందుకు టెమెర్‌కు కృతజ్ఞతలు’ అని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాలకు పరస్పర ప్రయోజనం చేకూర్చే నాలుగు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. జెనెటిక్ రిసోర్సస్, వ్యవసాయం, పశు సంక్షేమ, సహజ వనరులు, మత్స్య శాఖపై మొదటి ఒప్పందం, ఫార్మా ఉత్పత్తుల నియంత్రణపై రెండో ఒప్పందం కుదిరింది. పశువుల పునరుత్పత్తికి సాయపడే సాంకేతికతపై మరొకటి, పెట్టుబడుల సహకారం, సులభతరం చేయడంపై మరో ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు.
ఎన్‌ఎస్జీపై బ్రెజిల్ అధ్యక్షుడి హామీ
ఎన్‌ఎస్జీలో భారత్‌కు సభ్యత్వంపై సభ్య దేశాలతో కలిసి పనిచేస్తామంటూ బ్రెజిల్ హామీనిచ్చిందని విదేశాంగ శాఖ పేర్కొంది. ఇరు దేశాధినేతల చర్చల సందర్భంగా టెమెర్ ఆ విషయాన్ని ప్రధానికి తెలిపారని విదేశాంగ కార్యదర్శి ప్రీతీ శరణ్ చెప్పారు. ఎన్‌ఎస్జీలో చేరాలన్న భారత్ కోరిక, ఆకాంక్షను బ్రెజిల్ అధ్యక్షుడికి ప్రధాని తెలిపారని చెప్పారు.