
బ్రెజిల్ అత్యున్నత పురస్కారాన్ని స్వయంగా మోదీ మెడలో వేసి సత్కరిస్తున్న డసిల్వా
ఆ భూతాన్నిఏమాత్రం సహించం
దానిని ప్రోత్సహించే దేశాలకూ మేం వ్యతిరేకం
భారత్, బ్రెజిల్ ప్రకటన
అధ్యక్షునితో మోదీ చర్చలు
బ్రసీలియా: ఉగ్రవాదంపై భారత్, బ్రెజిల్ సంయుక్త సమరనాదం చేశాయి. ‘‘ఉగ్రవాదాన్ని సహించబోం. ఆ భూతంపై పోరులో మాది ఒకే బాట, ఒకే మాట. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాల మాటే లేదు. ఒకే విధానంతో ముందుకెళ్తాం’’ అని బ్రిక్స్ వేదికగా ప్రకటించాయి. ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డసిల్వాతో మంగళవారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉగ్రవాదంపై భారత్, బ్రెజిల్ ఆలోచనాధోరణి ఒకేలా ఉందంటూ వారు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పహల్గాం ఉదంతం తర్వాత భారత్‌కు సంఘీభావం తెలిపినందుకు బ్రెజిల్‌కు, డసిల్వాకు మోదీ ధన్యవాదాలు తెలిపారు.
విస్తృతాంశాలపై చర్చలు
వాణిజ్యం, అంతరిక్షం, పునరుత్పాదక ఇంధనం, ఆహారం, ఇంధన భద్రత, మౌలికవసతుల అభివృద్ధి, డిజిటల్ ప్రజా వసతులు, రక్షణ, భద్రత, ఆరోగ్యం, ఫార్మాసూటికల్స్, సంస్కృతి, ఇరుదేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు తదితర కీలకాంశాలపై మోదీ, డసిల్వా లోతుగా చర్చించారు. కీలకమైన ఖనిజాలు, అధునాతన, నూతన సాంకేతికతలు, కృత్రిమ మేధ, సూపర్ కంప్యూటర్లు అంశాల్లోనూ సహకారం పెంపొందించుకోవడంపై చర్చించారు. 12 బిలియన్ డాలర్లుగా ఉన్న వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఐదేళ్లలో 20 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇంధనం, వ్యవసాయం, డిజిటల్ రూపాంతరీకరణ, ఉగ్రవాదంపైపోరుపై సంయుక్త సహకారం కోసం ఆరు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
కార్నివాల్.. ఫుట్‌బాల్.. సాంబా
‘‘భారత్, బ్రెజిల్ సంబంధాలు కార్నివాల్‌లాగా వర్ణరంజితంగా ఉండాలి. ఫుట్‌బాల్ క్రీడలాగా స్ఫూర్తిదాయకంగా ఉండాలి. సాంబా నృత్యంలాగా ఇరుదేశాల ప్రజల హృదయాలను రంజింపజేయాలి. ఇరుదేశాల వీసా కేంద్రాల వద్ద పొడవాటి క్యూ వరసలు మాయమయ్యేలా వీసాప్రాసెసింగ్ వేగంగా జరగాలి. అన్నింటా అదే స్ఫూర్తి కనపడాలి’’ అని మోదీ అన్నారు. పశ్చిమాసియా ఎక్కడైనా సరే, వివాదాలకు చర్చలు, సంప్రదింపులతో పరిష్కారాలు కనుగొనాలన్నారు. ‘‘బ్రెజిల్‌తో రక్షణ రంగ ఒప్పందం అనేది ఇరుదేశాల మధ్య లోతైన పరస్పర విశ్వాసానికి ప్రతీక.
రక్షణరంగ పరిశ్రమల మధ్య మరింత అనుసంధానం కోసం కృషిచేస్తాం. వ్యవసాయం, పశుసంవర్ధనలో రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా సహకారం ఉంది. ఇప్పుడు వ్యవసాయ రంగ పరిశోధన, ఆహార శుద్ధి రంగాలకూ దీనిని విస్తరిస్తాం. ఆరోగ్యరంగంలోనూ పరస్పర సహకారం అందించుకుంటాం. పర్యావరణం, శుద్ధ ఇంధనం అనేవి రెండు దేశాలకూ కీలకమే. నేటి ఒప్పందాలు మా హరిత లక్ష్యాలను నెరవేరుస్తాయి. యూపీఐ చెల్లింపు వ్యవస్థను బ్రెజిల్‌లోనూ అందుబాటులోకి రావడానికి ప్రయత్నిస్తాం. ఆయుర్వేదం, భారత సంప్రదాయ వైద్యం సైతం బ్రెజిల్‌కు చేరువచేస్తాం’’ అని మోదీ అన్నారు.
మోదీకి అత్యున్నత పౌర పురస్కారం
మోదీకి బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం ‘ది గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్’ లభించింది. బ్రెజిల్ అధ్యక్షుడు డసిల్వా ఆయనకు పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ అవార్డును అధ్యక్షుడు స్వయంగా మోదీ మెడలో వేశారు. ఈ సందర్భంగా డసల్వా, మోదీ కరచాలనం, తర్వాత ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ‘‘ నాకీ అవార్డ్ దక్కడం ఎంతో గర్వంగా, ఉద్వేగంగా ఉంది. ఇది నాకు మాత్రమేకాదు 140 కోట్ల భారతీయులకు దక్కిన పురస్కారం’’ అని మోదీ సంయుక్త ప్రకటన వేళ వ్యాఖ్యానించారు. 2014 మేలో ప్రధాని అయ్యాక మోదీకి ఇలా విదేశాల్లో మొత్తంగా 26 అత్యున్నత పౌరపురస్కారాలు లభించాయి.