
భిన్నత్వమే కూటమి బలం: మోదీ
గ్లోబల్ సౌత్‌కు బ్రిక్స్‌పై ఎన్నో ఆశలు
వాటిని నెరవేర్చి చూపిద్దామని పిలుపు
పరిశోధన సంస్థ ఏర్పాటుకు ప్రతిపాదన
రియో డి జనిరో: ‘‘అంతర్జాతీయ సహకారానికి, ఆదర్శ బహుళ ధ్రువ ప్రపంచానికి బ్రిక్స్ కూటమి చక్కని ఉదాహరణగా, విశ్వసనీయతకు మారుపేరుగా నిలవాలి. రానున్న రోజుల్లో ఇతర ప్రపంచ దేశాలకు అన్ని విషయాల్లోనూ దిశానిర్దేశం చేసే దారిదీపం కావాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ‘‘బ్రిక్స్‌పై దక్షిణార్ధ గోళ దేశాలు (గ్లోబల్ సౌత్) ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. వాటిని నెరవేర్చి నమ్మకాన్ని నిలబెట్టుకుందాం. పాలన, అభివృద్ధి, పరస్పర సహకారం తదితరాల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పుదాం’’ అని సభ్య దేశాల అధినేతలకు పిలుపునిచ్చారు.
ఈ విషయంలో సభ్య దేశాలన్నింటితోనూ భుజం భుజం కలిపి ముందుకు సాగేందుకు భారత్ పూర్తిగా కట్టుబడి ఉందని వక్కాణించారు. బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సదస్సులో సోమవారం రెండో రోజు ‘భిన్నత్వానికి దన్ను, ఆర్థిక వ్యవహారాలు, ఏఐ’, ‘పర్యావరణం, కాప్–30, ప్రపంచ ఆరోగ్యం’ వంటి అంశాలపై జరిగిన సెషన్లలో మోదీ ప్రసంగించారు. బ్రిక్స్ కూటమి బలం దాని భిన్నత్వంలోనే దాగుందని నొక్కిచెప్పారు. కృత్రిమ మేధకు నానాటికీ అపారంగా పెరిగిపోతున్న ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు.
‘ఏఐ’ ఆందోళనలకు అలా చెక్
‘‘విద్య నుంచి వ్యవసాయం దాకా అన్ని రంగాల్లోనూ ఏఐని భారత్ చురుగ్గా, విస్తృతంగా ఉపయోగిస్తోంది. ఏఐపై నెలకొన్న ఆందోళనలకు సమర్థంగా చెక్ పెట్టాలంటే ఇటు పాలనకు, అటు ఇన్నొవేషన్లకు సమ ప్రాధాన్యమివ్వడమే మార్గం. బాధ్యతాయుతమైన ఏఐ మనందరి లక్ష్యం కావాలి’’ అని మోదీ సూచించారు. ఏఐ ప్రభావంపై వచ్చే ఏడాది భారత్ నిర్వహించనున్న శిఖరాగ్ర భేటీలో పాల్గొనాల్సిందిగా బ్రిక్స్ సభ్య దేశాలన్నింటినీ ఈ సందర్భంగా ఆహా్వనించారు. కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకునేందుకు వీలుగా బ్రిక్స్ సైన్స్ అండ్ రీసెర్చ్ రిపోజిటరీ (బీఎస్‌ఆర్‌ఆర్) ఏర్పాటును ప్రతిపాదించారు.
అంతర్జాతీయ స్థాయిలో కీలక ఖనిజాలు సరఫరాకు ఆటంకం లేకుండా చూడటంలో కూటమి కీలకపాత్ర పోషించాలని అభిలíÙంచారు. ఆ వనరులను ఏ దేశమూ స్వీయ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి, ఇతర దేశాలపై ఆయుధంగా వాడకుండా చూడాలన్నారు. 18 రకాల కీలక ఖనిజ వనరులకు నిలయమైన చైనా ఇటీవల వాటి ఎగుమతులను బాగా తగ్గించడం తెలిసిందే. పరోక్షంగా దాన్ని ఉద్దేశించి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా ప్రధాని లీ కియాంగ్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో కీలక పాలన సంస్కరణలకు బ్రిక్స్ బాటలు పరవాలని సూచించారు. ప్రపంచ శాంతిని కాపాడటంలో, విభేదాలను శాంతియుతంగా పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాలన్నారు.
అధినేతలతో భేటీలు
బ్రిక్స్ సదస్సు సందర్భంగా సోమవారం పలువురు దేశాధినేతలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. 10 దేశాలతో కూడిన ఆసియాన్ కూటమితో భారత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై మలేసియా ప్రధాని అన్వర్ బిన్ ఇబ్రహీంతో చర్చించారు. వర్తకం, పెట్టబడులు, రక్షణ, విద్య, ఆరోగ్యం, పర్యాటకం తదితరాలపై లోతైన సమీక్ష జరిపారు. బొలీవియా అధ్యక్షుడు లూయిస్ ఆల్బర్టో ఆర్స్ కాటకొరా, ఉరుగ్వే అధ్యక్షుడు యమంద్ ఒర్సీతో ద్వైపాక్షిక అంశాలను గురించి మోదీ చర్చలు జరిపారు. యోగాకు ఉరుగ్వేలో నానాటికీ ఆదరణ పెరగుతుండటంపై హర్షం వెలిబుచ్చారు.
పర్యావరణ న్యాయం... మాకు పవిత్ర నైతిక విధి
పర్యావరణ న్యాయం భారత్ దృష్టిలో పవిత్రమైన నైతిక విధి అని మోదీ ఉద్ఘాటించారు. పారిస్ పర్యావరణ ఒప్పంద ప్రతిజ్ఞలను గడువుకు ముందే నెరవేర్చిన తొలి దేశం భారతేనని గుర్తు చేశారు. ‘‘భూమి ఆరోగ్యంపైనే ప్రజారోగ్యం ఆధారపడి ఉంది. ఈ విషయంలో సంపన్న దేశాలపై గురుతర బాధ్యత ఉంది’’అన్నారు. ‘‘బ్రిక్స్ సారథిగా మానవత్వం, పర్యావరణ న్యాయం తదితరాలకు భారత్ పెద్దపీట వేస్తుంది. సమర్థ కూటమిగా బ్రిక్స్‌పనితీరుకే సరికొత్త నిర్వచనమిస్తుంది’’ అని మోదీ స్పష్టం చేశారు.
వచ్చే ఏడాది భారత్ బ్రిక్స్ సారథ్య పగ్గాలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఎలాంటి విపత్తులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్నివేళలా సిద్ధంగా ఉండాల్సిన అవసరం చాలా ఉందంటూ కరోనా మహమ్మారిని ప్రధాని ఉటంకించారు. ‘‘వైరస్‌లు వీసాలు తీసుకుని రావని కరోనా నిరూపించింది. వాటి పరిష్కారాలు కూడా పాస్‌పోర్టులను చూసి ఎంపిక చేసుకునేవి కావు’’ అంటూ చమత్కరించారు. వర్ధమాన దేశాలు ఆత్మవిశ్వాసం విషయంలో సంపన్న దేశాలకు ఏ మాత్రమూ తీసిపోవద్దని సూచించారు.