breaking news
nsg membership
-
ఎన్ఎస్జీ సభ్యత్వానికి బ్రెజిల్ మద్దతు
♦ భారత్ ఆకాంక్షను అర్థం చేసుకుందన్న ప్రధాని మోదీ ♦ ఉగ్రవాదంపై పోరులో బ్రెజిల్ సహకారాన్ని ప్రశంసించిన ప్రధాని ♦ ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలపై సంతకాలు బెనౌలిమ్(గోవా): అణు సరఫరా దేశాల బృందం(ఎన్ఎస్జీ)లో సభ్యత్వం కోసం భారత ఆకాంక్షను బ్రెజిల్ అర్థం చేసుకుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు మైఖేల్ టెమెర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదంపై భారత పోరుకు ఆ దేశం మద్దతునూ ప్రశంసించారు. సోమవారం ఇరు దేశాధినేతలు గోవాలో బ్రిక్స్ సదస్సు వేదికపై విస్తృత ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఉగ్రవాదంపై పోరులో ఎలాంటి విభేదాలూ, వివక్షా చూపకుండా ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా ముందుకు రావాలంటూ రెండు దేశాలు పిలుపునిచ్చాయి. చర్చల అనంతరం ఇరు దేశాధినేతలు మీడియాతో మాట్లాడారు. ‘ఐరాసలో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందానికి ఆమోదం పొందే ప్రక్రియలో కీలక భాగస్వామిగా ఉన్న బ్రెజిల్‌తో భవిష్యత్తులో కలసి పనిచేస్తాం. మాదక ద్రవ్యాల నియంత్రణ, వ్యవసాయ పరిశోధన, సైబర్ భద్రత వంటి కొత్త అంశాల్లో కలసి సాగాలని నిర్ణయించాం. భారత్, బ్రెజిల్‌ల మధ్య ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం తుది దశకు చేరుకుంది’ అని మోదీ తెలిపారు. అన్ని గ్రూపుల్లో కలసి సాగుతాం: మోదీ ‘ఐక్యరాజ్యసమితి, జీ20, జీ4, డబ్ల్యూటీవో, బ్రిక్స్, ఐబీఎస్ఏల్లో బ్రెజిల్‌తో మరింత సన్నిహితంగా కలసి పనిచేస్తాం. భారత ఉత్పత్తులు, కంపెనీలకు విస్తృత స్థాయి మార్కెట్, పెట్టుబడి అవకాశాలు కల్పించాలన్న విజ్ఞప్తి సానుకూలంగా స్పందించినందుకు టెమెర్‌కు కృతజ్ఞతలు’ అని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాలకు పరస్పర ప్రయోజనం చేకూర్చే నాలుగు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. జెనెటిక్ రిసోర్సస్, వ్యవసాయం, పశు సంక్షేమ, సహజ వనరులు, మత్స్య శాఖపై మొదటి ఒప్పందం, ఫార్మా ఉత్పత్తుల నియంత్రణపై రెండో ఒప్పందం కుదిరింది. పశువుల పునరుత్పత్తికి సాయపడే సాంకేతికతపై మరొకటి, పెట్టుబడుల సహకారం, సులభతరం చేయడంపై మరో ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఎన్ఎస్జీపై బ్రెజిల్ అధ్యక్షుడి హామీ ఎన్ఎస్జీలో భారత్‌కు సభ్యత్వంపై సభ్య దేశాలతో కలిసి పనిచేస్తామంటూ బ్రెజిల్ హామీనిచ్చిందని విదేశాంగ శాఖ పేర్కొంది. ఇరు దేశాధినేతల చర్చల సందర్భంగా టెమెర్ ఆ విషయాన్ని ప్రధానికి తెలిపారని విదేశాంగ కార్యదర్శి ప్రీతీ శరణ్ చెప్పారు. ఎన్ఎస్జీలో చేరాలన్న భారత్ కోరిక, ఆకాంక్షను బ్రెజిల్ అధ్యక్షుడికి ప్రధాని తెలిపారని చెప్పారు. -
ఒబామా బుట్టలో పడి మోసపోయిన మోదీ
సాక్షి వెబ్ ప్రత్యేకం న్యూఢిల్లీ: ప్రపంచంలో 48 దేశాల ప్రాతినిధ్యం కలిగిన అణు సరఫరా బృందం (ఎన్ఎస్జీ)లో భారత్‌కు సభ్యత్వం లభించకపోవడానికి చైనా మోకాలడ్డిందని నిందించడం కన్నా అమెరికాను నమ్మి మోసపోయామని భావించడం ఇంకా బాగుంటుంది. ఈ పరిణామం వల్ల భారత్ దౌత్యం భంగపడిందని అనడంకన్నా నరేంద్ర మోదీ ప్రతిష్ట మసకబారిందని చెప్పడం ఇంకా బాగుంటుంది. అమెరికా బుట్టలో మోదీ పడ్డాడని అంటే మరీ బాగుంటుందేమో! ఇటీవల విదేశీ పర్యటనల ద్వారా భారత విదేశాంగ విధానం బలపడిందని భావించిన లేదా భ్రమ పడిన మోదీ ఆ కీర్తిని కూడా తన భుజాలపై వేసుకునేందుకు ప్రయత్నించారు. ఎన్ఎస్జీలో నిజంగా సభ్యత్వం లభిస్తే అది తన విజయంగా చెప్పుకునేందుకు మోదీ ఉబలాటపడ్డారు. ఆయన్ని భారత సలహాదారులు కూడా తప్పుదోవ పట్టించారు. మోదీని ఖాళీగా ఉన్న మైదానంలో దించామని, చేయాల్సిందల్లా కార్నర్‌కు వెళితేచాలు అక్కడ ఎన్ఎస్జీ సభ్యత్వం లభిస్తుందని ఆశపెట్టారు. అందుకు అమెరికా వైఖరిని మిఠాయిగా చూపించారు. తరతరాలుగా విదేశాంగ విధానంలో భారత్ అనుసరిస్తున్న అలీన విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టి ప్రపంచ పెద్దన్నయ్యగా చెలామణి అవుతున్న అమెరికానే మోదీ ఎక్కువగా నమ్ముకున్నందుకు అందుకు తగ్గ ఫలితమే లభించింది. సలహాదారుల మాట ఎలావున్నా ఎన్ఎస్జీలో చేర్చుకునేందుకు అండగా నిలబడతామంటూ ప్రపంచ పెద్దన్న బరాక్ ఒబామా అక్కున చేర్చుకొని మరీ మాటివ్వడంతో మోదీ కూడా బుట్టలో పడ్డారు. ఎన్ఎస్జీ విషయంలో భారత్ పట్ల చైనా అధికారిక వైఖరి ఏమిటో ఇటు మనకు, అటు అమెరికాకు తెలియందికాదు. అయినా చైనా మనకు మద్దతు ఇస్తుందని ఎలా భావించాం? ముఖ్యంగా పాకిస్థాన్ కూడా ఎన్ఎస్జీ సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో రక్షణ రంగంలో పాకిస్థాన్‌తో అంటకాగుతున్న చైనా ఆ దేశాన్ని కాదని భారత్‌కు అండగా నిలబడుతుందని ఎలా పొరపాటుపడ్డాం? ఇటు పాకిస్థాన్, అటూ అమెరికాను దృష్టిలో పెట్టుకొని భారత్ విదేశాంగ విధానంలో చైనాను దూరం చేసుకోవడమేకాకుండా ఆ దేశంపై ఇటీవలి కాలంలో విమర్ళలు కుప్పిస్తూ వచ్చాం. ఏదో మొక్కుబడిగా చైనా అధినేతతో మోదీ చర్చలు జరుపుతూ వచ్చారు. దౌత్యం అంటే ‘కడుపులో లేందీ కౌగలించుకుంటే వస్తుందా!’ అన్న విషయాన్ని చైనా విస్మరించగలదా? ఎన్ఎస్జీ దేశాలను ప్రభావితం చేయగల సత్తా అమెరికాకు ఉందని భావించిన మోదీ, చైనాపై అమెరికా ప్రభావం ఎంతనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఎన్ఎస్జీ మార్గదర్శకాల ప్రకారం ఒక్కటంటే ఒక్క దేశం వీటో చేసినా దానికి మిగతా అన్ని దేశాలు కట్టుబడి ఉండాలనే విషయం మోదీకి తెలియదా? వాస్తవానికి సియోల్‌లో గురు, శుక్రవారాల్లో రెండు రోజులపాటు జరిగిన ఎన్ఎస్జీ ప్రిలిమినరీ సమావేశంలో ఏకంగా 16 దేశాలు భారత్‌ను వ్యతిరేకించాయి. అందులో ముందుగా భారత్‌కు అండగా ఉంటామంటూ మాట ఇచ్చిన బ్రెజిల్, స్విడ్జర్లాండ్ దేశాలు మాటమార్చి మొండి చేయి చూపడం మన దౌత్యంలో ఉన్న దౌర్భాగ్యాన్ని సూచిస్తోంది. ‘మేము ముందే మద్దతిచ్చామా, లేదా?’ అన్న వైఖరితో భారత్‌కు జరిగిన పరాభవం తనది కాదంటూ అమెరికా చేతులు దులుపుకొంది. వాస్తవానికి ఎన్ఎస్జీలో చేరాలనే ఆశను రేకెత్తించిందే అమెరికా. 2010లో బరాక్ ఒబామా ఎన్ఎస్జీలో చేరేందుకు కృషిచేయాల్సిందిగా భారత్‌కు సూచించారు. ఇరు దేశాల మధ్య 2008లో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకొనే ఆయన ఈ సూచన చేసి ఉండవచ్చు. అప్పుడు ఆ అణు ఒప్పందాన్ని ఎన్ఎస్జీ అడ్డుకోకుండా చూసిన ఒబామా ఇప్పుడెందుకు చైనాను ఒప్పించేందుకు ప్రయత్నించలేదు? భారత్ అణు కార్యక్రమాలను అడ్డుకునేందుకే ఎన్ఎస్జీ ఏర్పడిందని ప్రకటించిన అమెరికా మాజీ అధ్యక్షుల మాటకు ఆయన కూడా కట్టుబడి ఉన్నారా? ఇక్కడ పాకిస్తాన్, చైనాలతో మన సంబంధాలు ఎలా ఉంటాయన్న అంశంకన్నా బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్‌కు ఎన్ఎస్జీ సభ్యత్వమే ముఖ్యం. ఈ సభ్యత్వం లేనంతకాలం అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందం వల్ల అమెరికాకే ప్రయోజనం తప్పా, మనకు ఎలాంటి ప్రయోజనం లేదన్న విషయాన్ని గ్రహించాలి. ఇక ముందైనా ఈ విషయంలో భారత్ ఆచి తూచి అడుగేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే పాకిస్థాన్ లాంటి దేశం కూడా ఎన్ఎస్జీ సభ్యత్వాన్ని తన్నుకుపోవచ్చు. -
మాటమార్చిన స్విట్జర్లాండ్.. భారత్‌కు వెన్నుపోటు
స్విట్జర్లాండ్ మాట మార్చింది.. భారత దేశానికి వెన్నుపోటు పొడిచింది. అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో సభ్యత్వం కోసం భారతదేశం చేసుకున్న దరఖాస్తును వ్యతిరేకించింది. చైనాతో గొంతు కలిపింది. ఎన్పీటీలో లేని దేశాలకు ఎన్ఎస్జీలో సభ్యత్వం ఎలా ఇస్తారంటూ చైనా వేసిన ప్రశ్నతో స్విస్ కూడా ఏకీభవించింది. దాంతో ఎన్ఎస్జీలో సభ్యత్వం విషయంలో భారత దేశానికి ఉన్న అవకాశాలు కొంతవరకు సన్నగిల్లాయి. వాస్తవానికి ఇంతకుముందు.. అంటే ఈ నెల మొదట్లో ప్రధాని మోదీ స్విట్జర్లాండ్‌లో పర్యటించినపుడు స్విస్ ఫెడరేషన్ అధ్యక్షుడు జాన్ ష్నైడర్ అమన్ .. ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం భారత దేశం చేస్తున్న ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ప్రామిస్ కూడా చేస్తున్నట్లు తెలిపారు. కానీ కీలక సమయం వచ్చినపుడు హ్యాండిచ్చారు.