పోక్సో బిల్లుకు పార్లమెంటు ఓకే | Sakshi
Sakshi News home page

పోక్సో బిల్లుకు పార్లమెంటు ఓకే

Published Fri, Aug 2 2019 3:19 AM

Parliament passes POCSO Bill providing death penalty for child abuse - Sakshi

న్యూఢిల్లీ: ‘లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ (పోక్సో) (సవరణ) బిల్లు–2019’ని పార్లమెంటు గురువారం ఆమోదించింది. చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి అత్యంత అరుదైన కేసుల్లో దోషులకు మరణ శిక్ష విధించేందుకు కూడా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయి. ఈ బిల్లును రాజ్యసభ గత నెల 29నే ఆమోదించగా, లోక్‌సభలో బిల్లు గురువారం పాసయ్యింది. మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఈ బిల్లును ఆమోదం కోసం ప్రవేశపెడుతూ చిన్నారులపై నేరాలను లింగభేదం లేకుండా ఒకేలా చూసేందుకు ఈ బిల్లును తెచ్చామని అన్నారు.

‘చిన్నారులతో నీలి చిత్రాలు’ (చైల్డ్‌ పోర్నోగ్రఫీ)కి ఈ బిల్లులో నిర్వచనం కూడా చేర్చి, మరిన్ని ఎక్కువ దుశ్చర్యలను నేరం కిందకు వచ్చేలా చేశారు. పార్టీలకు అతీతంగా అనేకమంది ఎంపీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. దేశంలో 43 కోట్ల మంది చిన్నారులు ఉన్నారనీ, లింగభేదం లేకుండా వారందరికీ న్యాయపరంగా అదనపు భద్రతను ఈ బిల్లు కల్పిస్తుందని ఆమె తెలిపారు. చర్చ అనంతరం మూజువాణి ఓటుతో బిల్లును లోక్‌సభ ఆమోదించింది.

నపుంసకులుగా మార్చాలి: కిరణ్‌ ఖేర్‌
ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ఆర్‌ఎల్‌పీ సభ్యుడు హనుమాన్‌ బేనీవాల్‌ మాట్లాడుతూ పోక్సో చట్టం కింద దోషులుగా తేలిన వారిని బహిరంగంగా ఉరి తీయాలనీ, అప్పుడే ఇలాంటి నేరాలు చేయాలనుకునే వారికి భయం కలుగుతుందని డిమాండ్‌ చేశారు. నేరస్తులకు ఉరిశిక్ష విధించడం సాధ్యం కాకపోతే వారిని నపుంసకులుగా మార్చేలా నిబంధనలు ఉండాలని బీజేపీ ఎంపీ కిరణ్‌ ఖేర్‌ సూచించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement